రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపాలి.. విశాఖ ఆక్వా కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
Chandrababu Naidu Calls for Global Recognition of Andhra Shrimp Industry
భారతదేశ బ్లూ ఎకానమీ (సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ)కు ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్’ సాధనలో ఆక్వా రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు తన ప్రభుత్వం సిద్ధం చేసిన బృహత్ ప్రణాళికను ఆవిష్కరించారు.
ప్రస్తుతం దేశీయ సముద్ర ఆహార ఉత్పత్తి, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన అగ్రస్థానాన్ని ముఖ్యమంత్రి గణాంకాలతో సహా వివరించారు. దేశం మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతంగా ఉంటే, రొయ్యల ఉత్పత్తిలో ఏకంగా 66 శాతం వాటాతో రాష్ట్రం అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. సముద్ర ఆహార ఎగుమతుల ద్వారా దేశానికి వచ్చే ఆదాయంలో 38 శాతం, అంటే సుమారు రూ.28,000 కోట్లకు పైగా ఒక్క ఏపీ నుంచే సమకూరుతోందని గుర్తుచేశారు. ప్రపంచ సీ-ఫుడ్ వ్యాపారంలో భారతదేశ వాటా ప్రస్తుతం కేవలం 5 శాతంగానే ఉందని, దీనిని మరింత విస్తరించేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో మరింత వృద్ధి చెందితే, దేశ ఎగుమతుల రంగం కూడా ఆటోమేటిక్‌గా బలోపేతం అవుతుందని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని మరింత ఆధునీకరించేందుకు అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరు ప్రాంతాలను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక ‘ఆక్వా కారిడార్’ను అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కారిడార్ ద్వారా పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లు , ఆధునిక సాంకేతికతతో కూడిన ఒక సంపూర్ణ ఎకో సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడులు సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్తూ.. ‘పాండ్ టు పోర్టు, ఫార్మర్ టు గ్లోబల్ కన్స్యూమర్’ (చెరువు నుండి ఓడరేవు వరకు, రైతు నుండి ప్రపంచ వినియోగదారుడి వరకు) అనే వినూత్న విధానంతో ముందుకు సాగుతామని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ‘ఆంధ్రా రొయ్య… ఇండియా సీ-ఫుడ్’ అనే బ్రాండ్‌ను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే అన్ని రకాల చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు కేవలం 15 రోజుల్లోగా అవసరమైన భూమిని కేటాయిస్తామని వెల్లడించారు. కాకినాడ పోర్టు ఆధునికీకరణకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఇచ్చిన హామీ పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం, రాష్ట్రంలో మెగా సీ-ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం అందిస్తున్న మద్దతును కొనియాడారు.