Skip to content
వార్తలు వార్తలు

సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు CBSE కొత్త వ్యూహం

Prajapaksham 31 May 2026 1 నిమిషాల పఠనం వార్తలు
సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు CBSE కొత్త వ్యూహం

ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో సైబర్‌సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయనే ఆరోపణలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తొలిసారిగా అధికారికంగా స్పందించింది. ఓఎస్‌ఎం పోర్టల్‌లో బయటపడ్డ భద్రతా లోపాలపై తాము ప్రత్యేక దృష్టి సారించామని ఎక్స్ (X) వేదికగా బోర్డు వెల్లడించింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) లకు చెందిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందం గత కొన్ని రోజులుగా ఈ వ్యవస్థ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోందని పేర్కొంది. ప్రస్తుతం వ్యవస్థలో తలెత్తిన లోపాలను ఇప్పటికే పూర్తిగా పరిష్కరించామని, భవిష్యత్తులో ఇతరత్రా ఎలాంటి సైబర్ ముప్పులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. ఓఎస్‌ఎం పోర్టల్‌ను అత్యంత సురక్షితమైన వేదికగా మారుస్తున్నామని సీబీఎస్‌ఈ భరోసా ఇచ్చింది.

ఈ భద్రతా లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి తమ దృష్టికి తీసుకువచ్చిన ఎథికల్ హ్యాకర్లు, పౌరులకు సీబీఎస్‌ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. వీరిలో కొందరిని తాము వ్యక్తిగతంగా సంప్రదించి కృతజ్ఞతలు తెలియజేశామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సాంకేతిక లోపాలను ఎవరైనా గుర్తిస్తే ఆ వివరాలను నేరుగా తమకు పంపించాలని సూచించింది. వాస్తవానికి ఈ ఓఎస్‌ఎం పోర్టల్‌లోని భద్రతా లోపాలను నిసర్గ అధికారి అనే 19 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ తొలిసారిగా బహిర్గతం చేశారు. ఈ పోర్టల్‌కు సంబంధించిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్లౌడ్ వ్యవస్థలో భద్రపరిచిన బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాలు, విద్యార్థుల సమాధాన పత్రాలను ఎవరైనా సులభంగా యాక్సెస్ చేయగలిగే ప్రమాదకర పరిస్థితి ఉందని ఆయన డిజిటల్ ఆధారాలతో సహా ఆన్‌లైన్‌లో నిరూపించారు.

ఇదిలావుండగా, ఈ ఓఎస్‌ఎం వ్యవస్థ నిర్వహణ కాంట్రాక్టును కేటాయించే టెండర్‌ నిబంధనలలో ‘కోయెంప్ట్’ అనే ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా మార్పులు జరిగాయంటూ సార్థక్ సిద్ధాంత్ అనే 12వ తరగతి విద్యార్థి చేసిన ఆరోపణలను సీబీఎస్‌ఈ పూర్తిగా తోసిపుచ్చింది. అయితే, ఈ ఓఎస్‌ఎం సాంకేతిక లోపాల కారణంగా విద్యార్థుల మార్కుల కేటాయింపులో తప్పులు దొర్లాయనే ఆందోళనలు వ్యక్తమవడంతో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులైన విద్యార్థులకు న్యాయం చేసేందుకు మరోసారి మార్కుల వెరిఫికేషన్, రీఎవాల్యుయేషన్ (పునఃసమీక్ష) చేసుకునే ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించిన నూతన పోర్టల్‌ జూన్ 1 నుంచి విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *