చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..పలు కీలక నిర్ణయాలకు ఆమోదం.. పూర్తి వివరాలు ఇవే
AP Cabinet Approves Key Decisions, Here Are the Major Highlights
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, పర్యాటక రంగాల బలోపేతానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ ఆమోదించిన ఈ ముఖ్యమైన తీర్మానాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరంగా వెల్లడించారు.
రాష్ట్ర ఆరోగ్య రంగంలో పారదర్శకతను పెంచడం కోసం ‘మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం’ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 2011 కేంద్ర చట్టాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్న ఈ విధానం ద్వారా ఏపీలో వైద్య సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు అవయవ మార్పిడి ప్రక్రియ మరింత పారదర్శకంగా మారనుంది.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేబినెట్ ‘బీచ్ షాక్స్ పాలసీ’కి పచ్చజెండా ఊపింది. గోవా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల పర్యాటక విధానాలను అధ్యయనం చేసిన అనంతరం, ప్రాథమికంగా భీమిలి, విశాఖపట్నం, శ్రీకాకుళం, చీరాల బీచ్‌లలో దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నారు. ఈ బీచ్ షాక్స్ ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు మాత్రమే పనిచేయడానికి అనుమతి ఉంటుంది.
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి కేబినెట్ పెద్దపీట వేసింది. అమరావతి రాజధాని నగర పరిధిలోని వివిధ నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు, కృష్ణా నది ఒడ్డున ప్రతిష్టాత్మకంగా చేపట్టే ‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు ఆమోదం తెలిపారు. అలాగే అమరావతి క్వాంటం వ్యాలీకి కేటాయించిన భూమికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపు ఇచ్చారు. పారిశ్రామిక పార్కులు, ఓడరేవులు, పెట్టుబడులు, విమానయానం మరియు పోలవరం ప్రాజెక్టు పనులకు కూడా పరిపాలనా ఆమోదాలు లభించాయి. ఇందులో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్ విమానయాన పాలసీ-2026’ కు ఆమోదం తెలిపారు.
ఉద్యోగుల విషయంలో కూడా మంత్రివర్గం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు మరియు గురుకుల సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అలాగే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) అమలుకు ముందే నోటిఫికేషన్ వచ్చి, సాంకేతిక కారణాల వల్ల CPS అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (OPS) ప్రయోజనాలను విస్తరించాలని నిర్ణయించారు.
మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం ‘ఆంధ్రప్రదేశ్ జలాశయాల కేజ్ కల్చర్ పాలసీ-2025’ ముసాయిదాను ఆమోదిస్తూ, మధువలస, ఏలేరు జలాశయాలలో కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు ఫిషిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చారు. విద్యుత్ రంగంలో, పీఎం-కుసుమ్ పథకం కింద సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు కోసం చిత్తూరు జిల్లాలోని వ్యవసాయ శాఖ భూమిని NREDCAP సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. అలాగే హడ్కో (HUDCO) నుండి రూ. 300 కోట్ల రుణం పొందేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ప్రభుత్వ హామీ ఇవ్వడానికి కేబినెట్ సమ్మతించింది.
మరోవైపు అగ్రిగోల్డ్ వంటి సంస్థల డిపాజిటర్ల కేసులను వేగంగా పరిష్కరించేందుకు వీలుగా 21 ప్రత్యేక పోస్టుల మంజూరుకు పచ్చజెండా ఊపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో జూలై 1వ తేదీ నుంచి ‘వికాసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్’ (VB-GRAMG)ను రాష్ట్రంలో అమలు చేసే ప్రతిపాదనలకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.