AI Virus: AIతో కొత్త వైరస్..ప్రపంచానికి పెను సంక్షోభమా లేక వైద్య రంగంలో విప్లవమా.. తలలు పట్టుకుంటున్న శాస్త్రవేత్తలు..
AI Virus
AI జీవసంబంధ పరిశోధనల్లో వేగంగా వినియోగంలోకి వస్తోంది. ఔషధాల అభివృద్ధి, వ్యాక్సిన్ పరిశోధనలు, వ్యాధుల విశ్లేషణ వంటి రంగాల్లో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. అదే సాంకేతికతను కొత్త వైరస్‌ల రూపకల్పనకు దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే ఆందోళనలను బయోసెక్యూరిటీ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికా పరిశోధకులు AI సహాయంతో కొత్త బ్యాక్టీరియోఫేజ్ వైరస్‌లను రూపొందించి ప్రయోగశాలలో విజయవంతంగా పరీక్షించారు. ఈ పరిశోధన వైద్యరంగానికి కొత్త అవకాశాలు తెరుస్తూనే బయోసెక్యూరిటీపై ఆందోళనలు కూడా పెంచుతోంది.
AI Virus: కృత్రిమ మేధ (AI) సాంకేతికత మరో కీలక మైలురాయిని చేరుకుంది. అమెరికా పరిశోధకులు తొలిసారిగా AI సహాయంతో పూర్తిస్థాయి జన్యు నిర్మాణం (Genome) కలిగిన కొత్త వైరస్‌లను రూపొందించారు. అంతే కాకుండా వాటిని ప్రయోగశాలలో విజయవంతంగా పనిచేసేలా రూపొందించినట్లు వెల్లడించారు. ఈ పరిశోధన వైద్యరంగానికి కొత్త ఆశలు కలిగిస్తూనే.. బయోసేఫ్టీ, బయోసెక్యూరిటీ పరంగా కొత్త ఆందోళనలకు కూడా తెరతీసింది.
ఈ పరిశోధనలో రూపొందించిన 16 వైరస్‌లు.. బ్యాక్టీరియోఫేజ్‌లు (Bacteriophages). అయితే ఇవి మనుషులకు హాని చేసే వైరస్‌లు కాదు. కేవలం బ్యాక్టీరియాపై మాత్రమే దాడి చేసే వైరస్‌లు. యాంటీబయాటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు భవిష్యత్తులో ఇవి ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
AI ఎలా పనిచేసింది? స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు Evo-1, Evo-2 అనే ప్రత్యేక AI మోడళ్లను ఉపయోగించారు. ఇవి ChatGPT భాషను అర్థం చేసుకున్నట్లే.. జీవుల DNA భాషను విశ్లేషించి కొత్త జన్యు క్రమాలను రూపొందించగలవు. వైరస్‌లు, బ్యాక్టీరియా, మొక్కలు, మనుషుల జన్యు సమాచారం ఆధారంగా ఈ AIకి శిక్షణ ఇచ్చారు. అనంతరం ప్రత్యేకంగా ఇ. కోలి (E. coli) బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకునే వైరస్‌లను రూపొందించారు. మొత్తం 302 AI రూపొందించిన నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించగా.. వాటిలో 16 వైరస్‌లు విజయవంతంగా బ్యాక్టీరియాను నాశనం చేశాయి.
వైద్యరంగానికి కొత్త ఆశలు : ఈ సాంకేతికత ద్వారా భవిష్యత్తులో.. యాంటీబయాటిక్ నిరోధక (Antibiotic-resistant) బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కొత్త చికిత్సలు అభివృద్ధి చేసే అవకాశం ఉంది.
అలాగే జన్యుపరమైన వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు రూపొందించవచ్చు. కొత్త ఎంజైమ్‌లు, యాంటీబాడీలు అభివృద్ధి చేసి క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగించవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన: అయితే దీనిపై ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ పరిశోధన Science జర్నల్‌లో ప్రచురితమైన అనంతరం పలువురు బయోసెక్యూరిటీ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు డాక్టర్ థామస్ ఇంగ్లెస్‌బై, డాక్టర్ మోరిట్జ్ హాంకే అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి AI సాంకేతికతను దుర్వినియోగం చేసి భవిష్యత్తులో ప్రమాదకర వైరస్‌లను రూపొందించే అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేమన్నారు. అందుకే ఈ రంగంలో కఠినమైన భద్రతా ప్రమాణాలు, అంతర్జాతీయ నియంత్రణలు అవసరమని సూచించారు.
భద్రత కోసం తీసుకున్న చర్యలు: పరిశోధకులు మాత్రం ఈ ప్రయోగంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. మనుషులకు లేదా జంతువులకు సోకే వైరస్‌లను పరిశోధనలో ఉపయోగించలేదు. కేవలం బ్యాక్టీరియాను మాత్రమే సోకే బ్యాక్టీరియోఫేజ్‌లపైనే పరిశోధన నిర్వహించారు. మొత్తం ప్రయోగాన్ని అత్యున్నత భద్రతా ప్రమాణాలున్న ప్రయోగశాలలో నిర్వహించారని తెలిపారు.
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం వైరస్‌ల పరిశోధనకే పరిమితం కాదు. భవిష్యత్తులో AI సహాయంతో జీవశాస్త్ర రూపకల్పన (Synthetic Biology) మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కొత్త ఔషధాలు, జన్యు చికిత్సలు, వ్యక్తిగత వైద్య సేవల అభివృద్ధికి ఇది కీలకంగా మారవచ్చని భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ సాంకేతికత దుర్వినియోగం కాకుండా కఠినమైన బయోసెక్యూరిటీ ప్రమాణాలు అమలు చేయడం కూడా అంతే ముఖ్యమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
- AI Virus: AIతో కొత్త వైరస్..ప్రపంచానికి పెను సంక్షోభమా లేక వైద్య రంగంలో విప్లవమా.. తలలు పట్టుకుంటున్న శాస్త్రవేత్తలు..
- Vijay Divorce Case Ends: విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు.. పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న సంగీత..కేసును కొట్టివేసిన కోర్టు
- Dhurandhar: ధురంధర్ మూవీ ప్రపంచ రికార్డు.. 2026లో ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లీష్ చిత్రంగా హిస్టరీ క్రియేట్..
- Heavy Rain Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. 16 రాష్ట్రాలకు IMD అలర్ట్.. ఒడిశా-కేరళకు రెడ్ వార్నింగ్.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వానలు..
- Lost Important Documents? ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకుంటే ఏమి చేయాలి? మీరు ఎక్కడ ఫిర్యాదు చేయాలి?