వారంతా చొరబాటుదారులేనా?
వారంతా చొరబాటుదారులేనా?
ఢిల్లీ రాంలీలా మైదానంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఇండియా కూటమి బహిరంగ సభ విజయవంతం కావడంతో బీజేపీలో గుబులు పెరిగిపోయింది. ప్రజల్లో బలంగా వెళ్తున్న విపక్ష పార్టీల వాదనలను తిప్పికొట్టేందుకు ‘లోకతంత్ర బచావో… అరాచకత్వ హఠావో’ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.. అరాచకత్వాన్ని నిర్మూలించండి) అనే పేరుతో అధికార బీజేపీ దేశవ్యాప్త పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది.
అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాదయాత్ర చేసి, మోజాంజాహీ మార్కెట్ వద్ద సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో విచిత్ర వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఎస్ఐఆర్ ద్వారా వివిధ కారణాలతో తొలగించిన 13 కోట్ల ఓట్లలో 3 కోట్లు బంగ్లాదేశీ చొరబాటుదారులవని ఆయన అన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తొలగించిన ఓట్లను అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్, అదర్ (ASD) విభాగాలుగా విభజించారు. అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా సంబంధిత గృహంలో తాళం వేసి ఉన్నా, అందుబాటులో లేకున్నా (అబ్సెంట్), ఇళ్లు మారిన (షిఫ్టెడ్), మరణించిన (డెడ్), ఒకటి కంటే ఎక్కువ చోట్లలో పేరున్నా (డూప్లికేట్), ఇతర (అదర్స్) వర్గాలు అన్నమాట. అందులో అబ్సెంట్ కేటగిరీలో మూడు కోట్ల మందిని ఇప్పటి వరకు గుర్తించారు. ఆ మూడు కోట్ల మందిని మొత్తంగా చొరబాటుదారులని స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం డొల్లతనాన్ని బయటపెడుతోంది.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటరును గుర్తించి నోటీసులు ఇవ్వడం, వాటికి సమాధానాలను స్వీకరించడం బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) బాధ్యత. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో రాజధాని హైదరాబాద్ మహానగరంలో బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లారని భావించలేము. చాలా మంది పోలింగ్ బూత్ ఏరియాలో ఏదో ఒక చోట కూర్చొని, నంబర్లు అందుబాటులో ఉంటే ఓటర్లకు ఫోన్ చేసి నోటీసులు ఇవ్వడం, లేదంటే ఓటర్ల మానాన వారిని వదిలేసిన ఘటనలు ఎన్నో వార్తలకెక్కాయి. పైగా ముసాయిదా జాబితా ప్రకటించే ముందు ఒకసారి, జాబితాను ప్రకటించిన తరువాత మరొకసారి ఈ తంతు కొనసాగింది.
తెలంగాణలో వివిధ కేటగిరీలలో 11.25 లక్షలకు పైగా ఓటర్లను అందుబాటులో లేని (అబ్సెంట్) కేటగిరీలో ఉన్నట్లు భావించి, వారిని తుది జాబితా నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమవుతోంది. హోం మంత్రి చెప్పిన ప్రకారం వీరంతా బంగ్లాదేశీ చొరబాటుదారులేనా? హైదరాబాద్‌లోని 15 శాసనసభా నియోజకవర్గాలలో ఒక్క అక్రమ వలసదారుడిని గుర్తించలేదని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపినట్లు ఒక ప్రముఖ మీడియాలో వార్త వచ్చింది. అయితే, ఈ ప్రక్రియలో 12 మంది వరకు నేపాలీల పేర్లు తొలగించినట్లు, అయితే వారు అక్రమ వలసదారులు కాదని, చట్టబద్ధ అనుమతితోనే మన దేశంలోకి ప్రవేశించినట్లు అందులో పేర్కొన్నారు.
పరిపాలనా అంశాలతో కాకుండా విద్వేష, విభజన రాజకీయాలను అడ్డం పెట్టుకునే అధికారంలోకి రావటాన్ని బీజేపీ అలవాటుగా మార్చుకోవడం తెలిసిన విషయమే. అదే కోవలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఎస్ఐఆర్ పేరుతో అడ్డగోలుగా ఓట్ల తొలగింపును సమర్థించుకునేందుకే అబ్సెంట్ పేరుతో తొలగించిన మూడు కోట్ల మంది ఓటర్లను స్వయంగా హోం మంత్రి అమిత్ షా బంగ్లాదేశీ చొరబాటుదారులని నిర్ధారించారు.
ఓట్ల చేర్పు, తొలగింపు బాధ్యత ఎన్నికల కమిషన్‌ది. అదేమీ తొలగింపు కారణాలలో చొరబాటుదారులు అనే నిర్ధారణ చేయలేదు కదా? బాధ్యతాయుతమైన కేంద్ర హోం మంత్రిగా ఉండి, ఎలాంటి నిర్ధారణ లేకుండా అబ్సెంట్ ఓటర్లందరినీ బంగ్లాదేశీ చొరబాటుదారులని ప్రకటించడం సమంజసమేనా? నిజానికి ఒక వర్గం ఓటర్లను తొలగించాలని బీజేపీ కార్యకర్తలే దరఖాస్తు చేసిన ఉదంతాలెన్నో వెలుగులోకి వచ్చాయి. బీజేపీకి చెందిన ఒక బీఎల్ఓ 30 మంది పేర్లను తొలగించాలని ఫామ్-7 ద్వారా కోరడంపై ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది. ఢిల్లీలో కూడా ఇలాంటివి అనేకం బయటపడ్డాయి.
హైదరాబాద్ సభలోనే 2014, 2019 ఎన్నికల్లో ఎస్ఐఆర్ లేకుండానే దేశ ప్రజలు నరేంద్ర మోదీకి సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని అన్నారు అమిత్ షా. 2024 ఎన్నికల తరువాత హర్యానా, మహారాష్ట్రలో మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అన్నా హజారే నేతృత్వంలోని ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం ఆసరాతో 2014 ఎన్నికల్లో, పుల్వామా ఉగ్రదాడిని ప్రచారాస్త్రంగా చేసుకుని 2019లో అధికారంలోకి రావడం మరవగలమా? అలాగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు మంచి ఫలితాలు సాధించిన హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలలో కొద్ది నెలల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు తిరగబడడానికి భారీగా ఓట్ల నమోదు కారణమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టారు.
ఇప్పుడు ఎస్ఐఆర్పై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని అమిత్ షా అంటున్నారు. నిజానికి 2025 డిసెంబర్ 1వ తేదీన ఎస్ఐఆర్పై చర్చించాలని ఇండియా కూటమి డిమాండ్ చేసిన వీడియోను బయటపెట్టిన టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రాయ్కి ఏమి సమాధానమిస్తారో? ఆ తరువాత కూడా బడ్జెట్ సమావేశాలలో, వర్షాకాల సమావేశాలలో ప్రతి రోజూ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా సభ లోపల, వెలుపల నిరసనలు తెలిపినా కేంద్రం నుంచి స్పందన కరువైంది.
ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలకు కారణమైన సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి మార్చిలో అభిశంసన నోటీసును రాజ్యసభ చైర్మన్ తిరస్కరించలేదు. అప్పుడు చర్చకు సిద్ధంకాని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు ముందుకు వస్తోందంటే, దేశవ్యాప్తంగా ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లడమే కారణం. దానిని తిప్పికొట్టేందుకు అలవాటైన విభజన రాజకీయాస్త్రాలలో భాగంగానే బంగ్లాదేశీ చొరబాటుదారుల ఓట్లను తొలగించామనే సాకును కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువస్తోంది.
ఇప్పటికే విద్యార్థుల ఆందోళనలు, ప్రతిపక్షాల ఉద్యమాలపై విదేశీ కుట్ర, విదేశీ నిధులు, దేశద్రోహులు అనే ముద్రలు నిలబడలేదు. చొరబాటుదారుల అస్త్రం కూడా తేలిపోవడం ఖాయం.