Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Vijayasai Reddy’s Open Letter: విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ.. జగన్‌‌కు నమ్మకద్రోహం ఎప్పటికీ చేయను.. కోవర్టులెవరో..నమ్మకద్రోహులెవరో ఆయనే తెలుసుకోవాలి..

jagan 29 Aug 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Vijayasai Reddy’s Open Letter: విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ.. జగన్‌‌కు నమ్మకద్రోహం ఎప్పటికీ చేయను.. కోవర్టులెవరో..నమ్మకద్రోహులెవరో ఆయనే తెలుసుకోవాలి..

Vijayasai Reddy New Party

Vijayasai Reddy’s Open Letter: వైసీపీ కోటరీ నన్ను నమ్మకద్రోహి అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తోంది” అంటూ మాజీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. జగన్‌కు తాను ఎప్పుడూ నమ్మకద్రోహం చేయలేదని, నమ్మకద్రోహమే తన రక్తంలో ఉంటే ఎప్పుడో పార్టీ మారిపోయేవాడినని ఆయన పేర్కొన్నారు. జగన్‌గారికి నమ్మకస్తుడిననే కారణంతోనే అనేక కేసుల్లో తనను నిందితుడిగా చేర్చారని తెలిపారు.

2020 తర్వాత తనపై పార్టీలో క్రమంగా కుట్రలు, అవమానాలు పెరిగాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనను ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు కోర్ కమిటీ నుంచి కూడా తొలగించారని పేర్కొన్నారు. “నేను ఎప్పుడూ కోటరీలో లేను. జగన్‌గారి దృష్టిలో నా మాటకు ఉన్న విలువను 2020 నుంచి అంచెలంచెలుగా తగ్గించింది ఎవరు?” అని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులకు సైతం జగన్‌ను కలవకుండా అడ్డుకున్నది సజ్జలేనని ఆరోపించారు.

పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు సజ్జల ఆధ్వర్యంలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనిపై కార్యకర్తలు, జగన్ అభిమానులు ఆలోచించాలని ఆయన కోరారు.
తాను పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు వేరే పార్టీ పెడుతున్నానని విజయసాయిరెడ్డి తన లేఖలో వెల్లడించారు. కాగా, ఈ బహిరంగ లేఖలో విజయసాయిరెడ్డి వైసీపీ అంతర్గత వ్యవహారాలు, తనపై జరిగిన అవమానాలు, సజ్జల పాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ పూర్తి సారాంశం..

వైఎస్సార్‌సీపీ “కోటరీ” నా మీద “నమ్మక ద్రోహి” అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచార పోస్టులు పెట్టిస్తున్నందున ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. నమ్మకద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకుని, సీబీఐ, ఈడీ చార్జిషీట్‌లో నా పేరు లేకుండా చేసుకునేవాడిని. జగన్‌గారికి నమ్మకస్తుడిని అనే ఒకే ఒక్క కారణంగా జగన్‌గారితో పాటు ప్రతి ఛార్జిషీట్‌లోనూ నన్ను ఎ-2గా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది. జగన్‌గారు 16 నెలలు జైళ్లో ఉంటే నన్ను 15 నెలలు జైళ్లో పెట్టారు. నమ్మక ద్రోహం నా రక్తంలో ఉంటే, అప్పుడే అప్రూవర్‌గా మారేవాడిని.

2024 ఎన్నికల తర్వాత కూడా నాకు సంబంధం లేని లిక్కర్ స్కామ్‌లో నన్ను ఎ-5గా చేర్చారు. కాకినాడ సీపోర్టు కేసులో ఎ-2 గా చేర్చారు. ఈ రెండున్నర ఏళ్ల టీడీపీ పాలనలో “సకల శాఖల మంత్రి” పేరు మాత్రం ఇంతవరకు ఏ చార్జిషీట్‌లోనూ లేదు. జగన్‌గారికి వెన్నుపోటు పొడుస్తూ, ఆయనకు తెలియకుండా టీడీపీతో కలిసి ఎలా పని చేయాలో, ఏ కేసులూ లేకుండా ఎలా చేసుకోవాలో అక్కడ ఉన్న “కోటరీ నాయకుడు”కి తెలిసినంత నాకు తెలవదు. నేను ఏనాడూ అలాంటి నమ్మక ద్రోహం పనులు చేయలేదు.

ఇప్పుడు పార్టీ మారటానికి రెడీగా ఉన్న “ఉత్తరాంధ్ర నాయకుడు” తో కలిసి ఈ కోటరీ నాయకుడే 2020 నుంచి జగన్‌గారు ముఖ్యమంత్రిగా ఉండగా, నా మీద విపరీతంగా చాడీలు చెప్పించి నన్ను ఉత్తరాంధ్ర బాధ్యతలనుంచి తప్పించటానికి కారణం అయ్యాడు. జగన్ గారి మెప్పు పొందడానికి నాస్తికుడుగా, కమ్యూనిస్ట్ గా చెప్పుకునే ఇతను వైఎస్సార్సీపీకే కాదు, రాష్ట్రానికే నమ్మకద్రోహి.

కుటుంబం కోసం 40ఏళ్ళు అత్యంత నమ్మకస్తుడిగా పని చేసిన నేను, నా ఆత్మగౌరవానికి 2020 నుంచి భంగం కలిగించింది ఎవరు …!? నన్ను PMO లో కాని, ఢిల్లీ లో కాని, పార్టీ లో కాని, అవమానకరం గా అంచలంచెలుగా తగ్గించింది ఎవరు …? పొమ్మునలేక పొగ పెట్టింది ఎవరు…? అతిపెద్ద 2019 ఎన్నికల విజయం తర్వాత సజ్జల ప్రమేయం ఎలా శృతి మించింది … పార్టీ కి నా సేవలు ఏంటి, సజ్జల ద్రోహం ఏంటి, పరిపాలన జగన్ గారు చేశారా, “సజ్జల” సకల శాఖ మంత్రి గా, ఒక రాజ్యాంగేతర శక్తి గా తన ముఠా తో చేసిన పాలన లో, జగన్ ని .. ఎలా ఎవ్వరిని కలవకుండా …MLA లను, MP లను , మంత్రులకు సహితం అపాయింట్మెంట్ లు లేకుండా గోడ కట్టింది ఈ సజ్జల కాదా?

కార్యకర్తలు, నాయకులు, పార్టీ కోసం పనిచేసేవారు, ఈ సజ్జల కింద పని చేయాలా? ఇది జగన్ ని నమ్మి పని చేద్దామని ఉన్న వారికి పట్టిన కర్మ కాదా … జగన్ ని నమ్మి పని చేసే సీనియర్లు, నాయకులు, కార్యకర్తలు 2029లో మరోసారి పార్టీ ఓడిపోతే సజ్జలని తిట్టుకుంటూ రాజకీయాల నుంచి రిటైర్ అయిపోవాల్సిందేనా …? నా సంగతి తర్వాత … కుటుంబ సభ్యులు సైతం దూరం అయింది ఈ ప్రబుద్ధుడు సజ్జల వలన కాదా …?

ఒక పెద్దిరెడ్డి గారు, ఒక బొత్స గారు, ఒక YV సుబ్బారెడ్డి గారు, ఒక మిథున్ రెడ్డి గారు, ఒక సాయిరెడ్డి అందరూ రీజినల్ కోఆర్డినేటర్స్ గా, సజ్జలని రాష్ట్ర పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ గా మమ్మల్ని మానిటర్ చేయాలని, మేమంతా ఆయనకు రిపోర్ట్ చేయాలన్న ఆదేశాలు మిగతా నాయకులకు ఆమోదయోగ్యమో నాకు తెలియదు కానీ, నాకు మాత్రం కాదు. అందుకే నా ఆత్మగౌరవాన్ని చంపుకుని పని చేయలేక … 4సం. రాజ్యసభ పదవీ కాలాన్ని వదులుకొని … వైసీపీ గుర్తుపై ఎన్నికైనందుకు నైతికసూత్రాన్ని పాటిస్తూ రాజీనామా చేయడం జరిగింది.

విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ

జగన్ గారిని నేను రెండు సంవత్సరాలు నోరు తెరచి ఒక్క మాట మాట్లాడలేదు. కోటరీ కారణంగా నాకు జరిగిన అవమానాల కారణంగా బయటకు వచ్చా అని పదేపదే చెప్పాను. అయినా, అదే కోటరీ వారంతా, ఈ రోజు నేను పార్టీ పెడతానంటే నన్ను విమర్శిస్తున్నారు … నేను నేరుగా గెలిచేందుకే ప్రజాస్వామ్యబద్ధం గా యుద్ధం చేస్తా … అంతే గాని… అప్పట్లో ప్రభుత్వాన్ని, ఇప్పుడు పార్టీని కబ్జా చేసి … జగన్ గారిని రోజు మోసం చేస్తూ కోవర్ట్ రాజకీయం చేయడం నాకు చేత కాదు … ఇది విజయసాయి రెడ్డి గా నా మాట …

జగన్‌గారు పెట్టుకున్న రెండు అంచల వ్యవస్థ లో అనేక విషయాల్లో నా ఆత్మాభిమానం మీద కొడుతుంటే తట్టుకోలేకపోయాను. అంతకు ముందు, మంగళగిరిలో 2022లో జరిగిన పార్టీ ప్లీనరీలో నేరుగా ఈ సకల శాఖ మంత్రి నా మీద డైరెక్టుగా, భౌతికంగా దాడి చేస్తే జగన్ గారికి తెలిసి ప్రేక్షకపాత్ర వహించారు. ఈ విషయం పార్టీలో అక్కడవున్న నాయకులు కూడా చూసారు.

ఇవన్నీ తెలిసి కూడా అప్పటికే అతడి చేతిలో బందీ అయిపోయిన జగన్‌గారు, నన్ను పూర్తిగా పక్కన పెట్టేందుకు, 2022లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తల మీటింగ్ లో “సాయిన్న వయసు అయిపోయింది – ముసలోడు అయిపోయాడు” అంటూ అనుబంధ సంఘాల ఇంఛార్జ్ బాధ్యతలు తప్పిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఉన్న ఇంఛార్జ్ బాధ్యతలను తప్పించారు. కోర్ కమిటీలోనుంచి తొలగించారు. నేను నమ్మకస్తుడినే అయినా నా మీద ఇలా టార్గెట్ చేయించటంలో కోటరీ సక్సెస్ అయ్యింది.

ఇలాంటి అవమానాలు మొత్తం 74 ఉన్నాయి. అవమానాలకు గురైనా, కడుపులోనే దాచుకున్న విషయాలు అనేకం ఉన్నాయి. 2020 వరకు జగన్‌గారి దృష్టిలో నా మాటకు ఎంతో విలువ ఉండేది. అదే కోటరీ కడుపు మంటకు కారణం అయింది. నేను ఎప్పుడూ కోటరీలో లేను. నేను ఢిల్లీలో జగన్‌గారి ఆదేశాల మేరకు పని చేయటంలో బిజీగా ఉంటే, సకల శాఖల మంత్రి జగన్‌గారితోటే ఉండి నన్ను పడగొట్టే కార్యక్రమంలో బిజీగా ఉండేవాడు.

ఇప్పుడు ఆ వైసీపీ పార్టీలో నంబర్ 2 ఎవరంటే జగన్‌గారు. ఇప్పుడు నంబర్ వన్ ఎవరంటే “సకల శాఖల మంత్రి సజ్జల”. ఆ పార్టీ గెలుస్తుందా… ఓడుతుందా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ, నిరంతరం ఆ కొత్త నంబర్ వన్ గారి ఆజ్ఞలకు తలవంచి ఇప్పుడున్న సీనియర్ల మాదిరిగా నేను సర్దుకుపోలేను. అతనికి నమస్కారాలు/సాష్టాంగాలు/దండాలు పెట్టలేను. ఇక అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది. 2024 ఎన్నికల తర్వాత, ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అందువల్లే పార్టీకి, నా రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశాను. ఇప్పుడు వేరే పార్టీ పెడుతున్నాను.

నేను జగన్‌గారికి నమ్మక ద్రోహం చేయలేదు, చేయను. పార్టీలో ఉండి, ఎవరు కోవర్టులుగా పని చేస్తున్నారో, ఎవరు నమ్మక ద్రోహం చేస్తున్నారో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, జగన్‌గారి అభిమానులు ఆలోచన చేసుకోవాలి. ఈ నిజాలు చెప్పకపోతే, విమర్శలు మాత్రమే ప్రచారంలోకి వస్తున్నాయి. మరో సందర్భంలో మీడియా ద్వారా మరిన్ని నిజాలు తెలియజేస్తా.