Nepal Floods 2026: 579కి చేరిన నేపాల్ వరదల మృతుల సంఖ్య..నేపాల్, చైనాలో కలిపి 2500 మంది గల్లంతు..
వరదల వల్ల నేపాల్లో 579 మంది ప్రాణాలు కోల్పోగా, చైనా సరిహద్దు ప్రాంతంలో మరో 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 584కి చేరింది. నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం 977 మంది ఆచూకీ లభించడం లేదని ప్రకటించగా, రెండు దేశాల్లో (నేపాల్, చైనా) కలిపి దాదాపు 2,500 మంది గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు
Nepal Floods 2026: నేపాల్ దేశంలో సంభవించిన ఆకస్మిక వరదలు అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. 2015 నాటి వినాశకరమైన భూకంపం తర్వాత దేశంలో చోటుచేసుకున్న అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తు ఇదేనని భావిస్తున్నారు. శుక్రవారం నాటికి అందిన సమాచారం ప్రకారం, వరదల వల్ల నేపాల్లో 579 మంది ప్రాణాలు కోల్పోగా, చైనా సరిహద్దు ప్రాంతంలో మరో 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 584కి చేరింది. నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం 977 మంది ఆచూకీ లభించడం లేదని ప్రకటించగా, రెండు దేశాల్లో (నేపాల్, చైనా) కలిపి దాదాపు 2,500 మంది గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు.
భారత పౌరుల పరిస్థితి – విదేశాంగ శాఖ స్పందన
భారత పౌరుల భద్రతపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీలో తాజా పరిస్థితులను వివరించింది. ప్రభావిత ప్రాంతాల నుంచి 21 మంది భారతీయులను ఖాఠ్మాండు మీదుగా ఢిల్లీకి చేర్చారు. త్రిశూలీ వన్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ కార్మికులను, చైనా వైపు చిక్కుకున్న 96 మందిని రోడ్డు మార్గాన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ఇప్పటికీ దాదాపు 320 మంది భారత పౌరులతో పాటు మరో 100 మంది భారత సంతతి వ్యక్తులతో సంబంధాలు తెగిపోయాయి. వారితో కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు.
విపత్తుకు కారణం, తాజా పరిస్థితి
యూఎస్ జియోలాజికల్ సర్వే ఆధారంగా.. హిమానీనదం (గ్లేసియర్) విరిగిపడటంతో పాటు మంచు కొండలు ఒక్కసారిగా కరిగిపోవడం వల్ల బురద నీరు, శిథిలాలు దిగువ ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. టిబెట్ వైపు ఉన్న డ్యామ్ పగిలిపోవడంతో నేపాల్ పోలీసులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. శిథిలాల వల్ల సరిహద్దులో తాత్కాలికంగా ఏర్పడిన సరస్సు ప్రమాదకరంగా మారడంతో చైనా రెస్క్యూ పనులను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రమాద తీవ్రత తగ్గడంతో మళ్లీ ప్రారంభించింది.
సహాయక చర్యలు
మూడో రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేపాల్ ప్రభుత్వం మోహరించిన 14,000 మందికి పైగా భద్రతా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 3,742 మందిని బాధితులను రక్షక దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.