Pendurthi Tragedy: విశాఖ పెందుర్తిలో దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆ*త్మహత్య..కారణమదేనా..
Pendurthi Tragedy
Pendurthi Tragedy: పండుగ వాతావరణం నిండాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదపు ఛాయలు కనిపించాయి. తోబుట్టువుల అనురాగానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగ నాడే, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు తీసుకున్న ఘోర ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. జీవన పోరాటంలో ఒడిదుడుకులు తట్టుకోలేకనో.. మరే ఇతర కారణాల వల్లనో కానీ, రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు పసిపాపలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది.
విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన మల్లా వినోద్కుమార్, ఉపాధి నిమిత్తం పెందుర్తికి వచ్చి చింతల అగ్రహారంలోని ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. వినోద్ కుమార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. అతని భార్య స్థానికంగా కూరగాయల వ్యాపారం చేస్తూ అతనికి తోడుగా నిలిచింది. వీరికి రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోజువారీ కష్టాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఈ దంపతులు.. ఆదివారం రాఖీ పండుగ సందర్భంగా బంధువులు, కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపారు.
రోజంతా ఆనందంగా గడిపిన వినోద్ కుమార్.. రాత్రి సమయంలో ఉన్నట్టుండి తన సెల్ఫోన్ ద్వారా బంధువులకు ‘RIP’ (రెస్ట్ ఇన్ పీస్) అని ఒక సందేశాన్ని పంపించాడు. ఆ మెసేజ్ చూసి తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే వారి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా వినోద్ కుమార్ ఉరికి వేలాడుతూ కనిపించగా.. అతని భార్య, ఇద్దరు పిల్లలు స్పృహతప్పి పడి ఉన్నారు.
వెంటనే స్థానికుల సహాయంతో తల్లి, ఇద్దరు పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరేసరికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినోద్ కుమార్ మొదట తన భార్య, ఇద్దరు చిన్నారులకు విషాహారం తినిపించి, ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ దారుణ నిర్ణయానికి కుటుంబ కలహాలు కారణమా? లేక ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో సుదీర్ఘ దర్యాప్తు ప్రారంభించారు.
కళ్లముందే ఆడుతుపాడే ఇద్దరు పసిపాపలు, రెక్కల కష్టంపై ఆధారపడే దంపతులు పండుగ రోజే అనంత లోకాలకు వెళ్లడం ఆ ప్రాంతంలో తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది.
- Rahul Gandhi: విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం.. ఢిల్లీ పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం!
- Kolkata Stampede Video: కోల్కతా దుర్గా పూజ తొక్కిసలాట, 17 మంది మృతి, 25 మందికి గాయాలు.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రం..
- Jantar Mantar Violence: జంతర్ మంతర్ హింసపై ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్.. బాధితులకు అవకాశం..
- Palamuru Water Dispute: కోమటి రెడ్డి అడిగితే తల అయినా కోసిస్తా…కానీ పాలమూరు నీటి విషయంలో తగ్గేది లేదు…ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
- Railway Ticket Insurance: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇకపై ఆన్లైన్లోనే కాదు.. రైల్వే కౌంటర్ టికెట్లకూ ఇన్సూరెన్స్ కవరేజ్..