Skip to content
బిజినెస్ వార్తలు

IRCTC Dark Patterns: IRCTCలో ‘డార్క్ ప్యాటర్న్స్’ కలకలం.. టికెట్ బుకింగ్‌లో ప్రయాణికులకు తెలియకుండానే అదనపు ఛార్జీల భారం..

jagan 28 Aug 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
IRCTC Dark Patterns: IRCTCలో ‘డార్క్ ప్యాటర్న్స్’ కలకలం.. టికెట్ బుకింగ్‌లో ప్రయాణికులకు తెలియకుండానే అదనపు ఛార్జీల భారం..

IRCTC New Website: రైలు టికెట్ బుకింగ్ మరింత సులభం.. అనవసర క్యాప్చాలు, పాప్‌అప్‌లకు ఇక గుడ్‌బై..

IRCTC Dark Patterns: LocalCircles నిర్వహించిన 90 వేల మందికిపైగా వినియోగదారులతో, 324 జిల్లాలను కవర్ చేసిన సర్వేలో, IRCTC వెబ్‌సైట్, యాప్‌లలో ఆరు రకాల డార్క్ ప్యాటర్న్స్ ఉన్నట్లు నివేదించబడింది. అత్యధికంగా 70% మంది forced action ను ఎదుర్కొన్నట్లు చెప్పారు.

IRCTC Dark Patterns: రైలు టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేయాలని సామాన్య ప్రయాణికులు కోరుకుంటున్న వేళ.. IRCTC డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తాజాగా నిర్వహించిన సర్వే ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెచ్చింది. లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వేలో 324 జిల్లాలకు చెందిన 90 వేల మందికి పైగా IRCTC వినియోగదారుల అభిప్రాయాలను సేకరించారు.

సర్వే ప్రకారం, టికెట్ బుకింగ్ ప్రక్రియలో వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసేలా.. వారికి తెలియకుండానే అదనపు సేవలు లేదా రుసుములు చేరేలా ఉండే ‘డార్క్ ప్యాటర్న్స్’ కనిపిస్తున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) గుర్తించిన వివిధ రకాల డార్క్ ప్యాటర్న్‌లలో, IRCTC ప్లాట్‌ఫారమ్‌లలో ప్రధానంగా ఆరు రకాల సమస్యలు ఎదురవుతున్నాయని సర్వే పేర్కొంది.

బుకింగ్ మధ్యలో లాగ్‌అవుట్..

సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది టికెట్ బుకింగ్‌లో కీలక దశకు చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా సిస్టమ్ నుంచి లాగ్‌అవుట్ అయిన అనుభవం ఎదురైందని తెలిపారు. దీంతో ప్రయాణికులు మళ్లీ మొదటి నుంచి బుకింగ్ ప్రక్రియను ప్రారంభించాల్సి వస్తోందని పేర్కొన్నారు.

పాప్‌అప్‌లతో విసుగు

సుమారు 46 శాతం మంది ప్రయాణికులు లావాదేవీల సమయంలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, ప్రమోషనల్ ఆఫర్లను పరిశీలించాలని లేదా వ్యక్తిగత వివరాలను అందించాలని పదేపదే వచ్చే పాప్‌అప్‌లు ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పారు.

తెలియకుండానే కార్ట్‌లో సేవలు

45 శాతం మంది స్పందన ప్రకారం, ప్రయాణ బీమా, భోజనం లేదా ఇతర అదనపు సేవలు వినియోగదారుడు స్పష్టంగా ఎంచుకోకపోయినా బుకింగ్ ప్రక్రియలో చేరుతున్నట్లు అనుభవాలు ఉన్నాయని తెలిపారు. ఈ విధానాన్ని ‘బాస్కెట్ స్నీకింగ్’గా పేర్కొంటున్నారు. అదేవిధంగా, ప్రారంభంలో చూపించే టికెట్ ధరతో పోలిస్తే చెల్లింపు చివరి దశకు వచ్చేసరికి అదనపు ఛార్జీలు చేరుతున్నాయని 43 శాతం మంది పేర్కొన్నారు. దీనిని ‘డ్రిప్ ప్రైసింగ్’గా పిలుస్తారు.

ఎంపిక చేసిన వివరాలు మారిపోతున్నాయా..

సర్వేలో 38 శాతం మంది ప్రయాణికులు మొదట ఎంచుకున్న రైలు, తరగతి లేదా ఇతర వివరాలు బుకింగ్ ప్రక్రియలో మారిపోయినట్లు అనుభవించామని తెలిపారు. మరో 31 శాతం మంది స్క్రీన్ డిజైన్ ద్వారా తమ దృష్టిని ఇతర చెల్లింపు సేవలు లేదా అదనపు ఉత్పత్తుల వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

డిఫాల్ట్‌గా No ఉండాలి

IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ సాంకేతిక వేగం పెరిగినప్పటికీ, వినియోగదారుల అనుభవాన్ని ప్రభావితం చేసే డిజైన్ సమస్యలు కొనసాగుతున్నాయని సర్వే పేర్కొంది. ప్రయాణ బీమా వంటి యాడ్-ఆన్ సేవలకు డిఫాల్ట్ ఎంపిక ‘No’గా ఉండాలని, వినియోగదారుడు స్వయంగా అంగీకరిస్తేనే వాటిని చేర్చాలని ప్రతిపాదించింది.

డార్క్ ప్యాటర్న్‌లపై ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు వినియోగదారుల హక్కుల విషయంలో ఒకే ప్రమాణాలు ఉండాలని లోకల్‌సర్కిల్స్ అభిప్రాయపడింది. IRCTCపై స్వతంత్ర లేదా థర్డ్-పార్టీ ఆడిట్ నిర్వహించి, టికెట్ బుకింగ్ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపింది.

అయితే, సర్వేలో వెల్లడైన అంశాలపై IRCTC అధికారిక స్పందన వస్తేనే ఈ ఆరోపణలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.