Telangana Elections: కృష్ణా జలాల అంశంతో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Revanth Reddy and Uttam Kumar Reddy
Telangana Elections: కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్-2 ఎదుట అత్యంత సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి ఎన్. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న అన్ని రకాల జల వివాదాలకు సంబంధించి అవసరమైన బలమైన ఆధారాలను ట్రిబ్యునల్‌కు సమర్పించాలని స్పష్టం చేశారు. వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి కృష్ణా జలాల పంపిణీ అంశం ఎంతో కీలకం కానుందని, సాధ్యమైనంత గరిష్ట స్థాయిలో నీటి వాటాను సాధించేందుకు గట్టిగా కృషి చేయాలని సూచించారు.
మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో జరగనున్న విచారణలో తెలంగాణ తరఫున వినిపించాల్సిన కీలక వాదనలపై న్యాయ నిపుణులతో ఆయన విస్తృతంగా చర్చించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునళ్లు కేటాయించిన మొత్తం 1,050 టీఎంసీల కృష్ణా జలాలను అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం-1956లోని సెక్షన్-3 కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పగించింది. సెక్షన్-3 కింద ట్రిబ్యునల్‌లో ఉభయ రాష్ట్రాల ప్రాథమిక వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయని, ఏపీ వాదనలను ఖండిస్తూ తెలంగాణ వినిపిస్తున్న ప్రతివాదనలు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయని న్యాయనిపుణులు సీఎంకు వివరించారు. డిసెంబర్ నాటికి ఈ ప్రతివాదనలు పూర్తయి, ట్రిబ్యునల్ తన తీర్పును రిజర్వ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 1,050 టీఎంసీల వాటాలో తెలంగాణకు 673 టీఎంసీలు కేటాయించాలని ట్రిబ్యునల్ ఎదుట గట్టిగా వాదిస్తున్నట్లు వివరించారు.
సెక్షన్-3 కింద నీటి పంపకాలపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ త్వరగా కొలిక్కి వచ్చేలా చూడాలని న్యాయనిపుణులను సీఎం ఆదేశించారు. సెక్షన్-3 కింద నీటి పంపకాలకు కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఆమోదిస్తే, ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 89 కింద రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం మళ్లీ విచారణ జరపాల్సిన అవసరం ఉండదని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, నీటిపారుదల కార్యదర్శి ఇ. శ్రీధర్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ తదితరులు పాల్గొన్నారు.
డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముందస్తు నిర్ణయం మేరకు ఏదుల నుంచే డిండి, అచ్చంపేట పథకాలకు నీటిని పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఈ రెండు పథకాలకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నార్లపూర్ నుంచి ఏదుల వరకు తరలించేందుకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని సూచించారు. వీటి సమగ్ర ప్రాజెక్టు నివేదికను త్వరగా సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను సీఎం హెచ్చరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీఎంసీల నీటినే పూర్తిస్థాయిలో తరలించలేని పరిస్థితి నెలకొన్నందున, అదనపు టీఎంసీ పనుల విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మొదట సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర జల సంఘం నుంచి అవసరమైన అన్ని రకాల అనుమతులు పొందడంతో పాటు డీపీఆర్‌ను పక్కాగా సిద్ధం చేసి మరొకసారి కేంద్రానికి సమర్పించాలని స్పష్టం చేశారు.