Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

IMD Alert: అర్నబ్ తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. కోస్తాంధ్ర తీర ప్రాంతాలకు ముప్పు?

jagan 29 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
IMD Alert: అర్నబ్ తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. కోస్తాంధ్ర తీర ప్రాంతాలకు ముప్పు?

Bay of Bengal Dead Zone

IMD Alert: ‘అర్ణబ్’ అతి తీవ్ర తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరప్రాంతం ఇంకా తేరుకోకముందే మరో వాతావరణ ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడుతున్న అల్పపీడన వ్యవస్థ బలపడి వాయుగుండంగా మారి రాష్ట్రం వైపు కదిలే సూచనలు కనిపిస్తుండటంతో తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

భారత వాతావరణ శాఖ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం, దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలలో కొత్తగా ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల కాలంలో పశ్చిమ-వాయవ్య దిశగా వేగంగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందనుంది. ఆ తదనంతరం మరో 24 గంటల వ్యవధిలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది మరింత కేంద్రీకృతమై వాయుగుండంగా బలపడే బలమైన అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ నూతన వాతావరణ వ్యవస్థ మరింత ఊపందుకుని ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే సూచనలు కనిపిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీని ప్రత్యక్ష ప్రభావం వల్ల నవంబర్ 2 , 3వ తేదీల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ‘అర్ణబ్’ తుపాను వల్ల తీవ్రమైన పంట నష్టం, విద్యుత్ వ్యవస్థల ధ్వంసం , భారీ ఆస్తి నష్టంతో కుదేలైన కోస్తా జిల్లాలకు ఈ తాజా హెచ్చరికలు ఇబ్బందికరంగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ వాయుగుండం కదలికలు, తీవ్రతపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుందని, ప్రజలు , అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.