Skip to content
తెలంగాణ › వార్తలు

Southern States Police Meet: దక్షిణాది రాష్ట్రాల పోలీసులు పరస్పర సమన్వయంతో పనిచేయాలి: దక్షిణ ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు..

jagan 23 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Southern States Police Meet: దక్షిణాది రాష్ట్రాల పోలీసులు పరస్పర సమన్వయంతో పనిచేయాలి: దక్షిణ ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు..

Revanth reddy

Southern States Police Meet: దక్షిణాది రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య అంతర్రాష్ట్ర సమన్వయాన్ని మరింత పటిష్ఠం చేయాలని, సరిహద్దులతో సంబంధం లేకుండా రక్షణ వ్యవస్థలు పరస్పరం సహకరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ (ICCC) వేదికగా శుక్రవారం నిర్వహించిన ‘దక్షిణ ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ’ (SRPCC) ముఖ్య సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. దక్షిణ భారతదేశాన్ని నేరరహిత, అత్యంత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత పోలీసు అధికారులపైనే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నగరంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఐసీసీసీ పరిజ్ఞానాన్ని, సాంకేతిక వ్యవస్థలను పొరుగు రాష్ట్రాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.

సమాజంలో నేరాల స్వరూపం రోజురోజుకూ మారుతున్న నేపథ్యంలో పోలీసింగ్ వ్యవస్థలో నిరంతరం సంస్కరణలు అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రక్షణ రంగానికి, పోలీసు శాఖకు ప్రభుత్వం కేటాయించే నిధులను కేవలం ఖర్చుగా భావించకుండా సమర్థవంతమైన సమాజ నిర్మాణానికి, ప్రజల ప్రాణరక్షణకు చేసే దీర్ఘకాలిక పెట్టుబడిగా చూడాలని పేర్కోన్నారు. ప్రజలు ఎల్లప్పుడూ అత్యంత పారదర్శకంగా, నైతిక విలువలతో, పక్షపాతరహితంగా పనిచేసే పోలీసు వ్యవస్థనే ఆశిస్తున్నారని స్పష్టం చేశారు. పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ పోలీసు వ్యవస్థను మూడు ప్రధాన కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించామని, దీనివల్ల ప్రతి పోలీసు కమిషనర్ తన పరిధిలోని శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం లభించిందని తెలిపారు. నగరంలో ప్రత్యేక నేరాల నిరోధానికి హైడ్రా (HYDRAA), ఈగల్ (EAGLE), టీ-సేఫ్ (T-SAFE) వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామన్నారు.

ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల (డ్రగ్స్) అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలు ప్రధాన సవాళ్లుగా పరిణమించాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి చెక్ పెట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో పాటు సిబ్బందికి నిరంతరం ప్రత్యేక శిక్షణ అందించాలని సూచించారు. దేశంలోనే సైబర్ నేరాల నిరోధంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని, ఇటీవల ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ప్రగతి సమీక్ష సమావేశంలో కూడా ఈ విషయమై ప్రశంసలు లభించాయని గుర్తుచేశారు. అలాగే తెలంగాణను నక్సలిజం రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో పోలీసులు చూపిన చొరవను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పనిచేస్తున్న ‘ఈగల్’ విభాగానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా 80 శాతానికి పైగా రేటింగ్ ఇచ్చిందని వివరించారు. సైబర్ నేరగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి రికవరీ ఇప్పించడంలో ‘తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

అమెరికా హెల్త్ విభాగం ఎఫ్‌డీఏ (FDA) తరహాలోనే ఆహార కల్తీని అరికట్టడం, నాసిరకం ఔషధాల విక్రయాలను నిరోధించడం కోసం వివిధ శాఖలను సమన్వయం చేస్తూ ‘టీ-సేఫ్’ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చామని సీఎం వివరించారు. సరస్సులు, ఆక్రమణలకు గురైన చెరువులు , ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడంలో ‘హైడ్రా’ సంస్థ చేపడుతున్న చర్యలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని చెప్పారు. ఇక వినూత్నంగా హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి, వారికి ఉపాధి కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, కర్ణాటక డీజీపీ ఎం.ఏ.సలీం, తమిళనాడు డీజీపీ మహేష్ అగర్వాల్, పుదుచ్చేరి డీజీపీ షాలిని సింగ్, లక్షద్వీప్ ఏడీజీపీ బి.శంకర్ జైస్వాల్, కేరళ ఐజీ అజితా బేగం, ఏపీ ఐజీపీ రవికృష్ణ, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తో పాటు అండమాన్ నికోబార్, ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు , కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.