Ayodhya Ram Mandir Donation Row: రూ.5 కోట్ల బంగారు పూత రామచరితమానస్ గ్రంథం ఏమైంది..
అయోధ్య రామాలయంలో ఏం జరుగుతోంది?
Ayodhya Ram Mandir Donation Row: ప్రతిష్ఠాత్మక అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు సాగుతున్న తరుణంలోనే మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తాను, తన కుటుంబం ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పించిన కోట్లాది రూపాయల విలువైన బంగారు పూత గల రామచరితమానస్ గ్రంథం ఆలయం నుండి అదృశ్యం కావడంపై కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్. లక్ష్మీనారాయణన్.. ఆయన భార్య సరస్వతి కలిసి 2024 ఏప్రిల్‌లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఈ అమూల్యమైన బహుమతిని సమర్పించారు. తులసీదాస్ రచించిన రామచరితమానస్‌లోని 10,902 శ్లోకాలతో కూడిన 522 పేజీలకు బంగారు పూత పూయించి ఈ అద్భుత గ్రంథాన్ని రూపొందించారు. సుమారు 147 కిలోల బరువున్న ఈ గ్రంథం విలువ దాదాపు రూ. 4.5 కోట్ల నుండి రూ. 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఈ గ్రంథాన్ని ఆలయంలో కొన్ని నెలల పాటు భక్తుల దర్శనార్థం ఉంచారని, ఆ తర్వాత ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అక్కడి నుండి తొలగించారని లక్ష్మీనారాయణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాట్లాడుతూ.. రామజన్మభూమి ఉద్యమంతో తమ కుటుంబానికి ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తన దివంగత తల్లి ఏళ్ల తరబడి రామనామాన్ని రాశారని గుర్తుచేసుకున్నారు. తన పదవీ విరమణ సంపాదనతో శ్రీరాముడికి సేవగా ఈ కానుకను సమర్పించానని.. దీని ద్వారా తాను ఎలాంటి గుర్తింపు కోరుకోవడం లేదని, కేవలం పారదర్శకత మాత్రమే కావాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ దానికి పూజలు జరుగుతున్నంత కాలం తాను ఎంతో సంతోషించానని, కానీ అకస్మాత్తుగా దానిని అక్కడి నుండి తీసేయడం బాధించిందని వాపోయారు.
ఈ విషయంపై ఆలయ అధికారులను, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను సంప్రదించినా సరైన సమాధానం రాలేదని లక్ష్మీనారాయణన్ తెలిపారు. దీంతో ఆయన ఈ వ్యవహారాన్ని ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతలతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దృష్టికి తీసుకెళ్లి తన ఆందోళనను వివరించారు.
ఇప్పటికే ఆలయ విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా నగదు నిర్వహణ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగితో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి, వారి నుండి నగదు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌తో పాటు మరో ట్రస్టీ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.
ఇలాంటి కుంభకోణాలు సరైన పర్యవేక్షణ లోపం వల్లే జరుగుతాయని, ఇది పూర్తిగా నివారించదగినదని లక్ష్మీనారాయణన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ అత్యంత విలువైన గ్రంథం ఎక్కడ ఉందనే దానిపై ఆలయ ట్రస్టు అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, కోట్లాది మంది భక్తుల నమ్మకంతో ముడిపడిన విరాళాలు, కానుకల విషయంలో జవాబుదారీతనం ఉండాలనే డిమాండ్ ఈ ఘటనతో మరింత బలపడింది.