Skip to content
జాతీయం వార్తలు

E20తో మైలేజ్ తగ్గడం నిజమేనని తెలిపిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి..

Prajapaksham 04 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
E20తో మైలేజ్ తగ్గడం నిజమేనని తెలిపిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి..

హర్దీప్ సింగ్ పూరి

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన) పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోతోందంటూ వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వివరణ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ20 ఇంధనం వల్ల వాహనాల మైలేజ్‌పై పడే ప్రభావం చాలా స్వల్పమని స్పష్టం చేశారు. కేవలం ఇథనాల్ వల్లే కాకుండా, వాహనం యొక్క స్థితిగతులు, డ్రైవింగ్ విధానం వంటి అనేక ఇతర కారణాల వల్ల కూడా మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో ఈ20 ఇంధనంపై ఒక విధమైన అసత్య ప్రచారం, అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని మంత్రి మండిపడ్డారు. ఇథనాల్ వాడకం వల్ల ఇంజన్ పనితీరు దెబ్బతినదనే విషయం శాస్త్రీయంగా నిరూపితమైందని ఆయన గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా రేసింగ్ కార్లలో కూడా ఇథనాల్‌ను ఉపయోగిస్తారని, దీనివల్ల వాహనాల యాక్సిలరేషన్ (వేగ వృద్ధి రేటు) మెరుగుపడటమే కాకుండా.. ఇంజన్ నుంచి వచ్చే అవాంఛనీయ శబ్దాలు (నాకింగ్) కూడా తగ్గుతాయని మంత్రి వివరించారు.

భారతదేశంలోని వాహన తయారీదారుల సంఘం (SIAM), ఆటోమొబైల్ పరిశోధన, పరీక్షల సంస్థ అయిన ‘ఆటోమేటివ్ రిసెర్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ARAI) వంటి అన్ని కీలక భాగస్వామ్య పక్షాలతో లోతుగా సంప్రదింపులు జరిపి, అవసరమైన అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఈ20 పెట్రోల్‌ను మార్కెట్లోకి తెచ్చిందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ25 (25 శాతం ఇథనాల్) బ్లెండింగ్‌ వైపు వెళ్లాలన్నా, పూర్తి స్థాయి తనిఖీలు , పరీక్షలు పూర్తయిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇక ఈ20 పెట్రోల్ వాడే వాహనాలకు మోటార్ ఇన్సూరెన్స్ (బీమా) వర్తించదంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడటం వల్ల వాహనాల బీమా రక్షణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, దీనిపై ఇప్పటికే బీమా సంస్థలు స్పష్టమైన ప్రకటనలు విడుదల చేశాయని ఆయన వాహనదారులకు భరోసా ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఇంధన భద్రతను పటిష్టం చేయడానికి , రైతులకు అదనపు ఆదాయాన్ని చేకూర్చడానికి ఈ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని మంత్రి పురి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *