విధ్వంసం చేయదలిస్తే, యుద్ధమే అక్కరలేదు
After Bengal and Maharashtra, Punjab is the BJP's next target.
వివేచన గలవాడి అభిప్రాయాన్ని మూర్ఖుడు యథాతథంగా వెలిబుచ్చలేడు. వాడికి అర్థమైన రీతిలో అర్థమైనంతే చెపుతాడు. దాన్ని మనం లెక్కలోకి తీసుకోనక్కరలేదు. మూర్ఖుడు వినేది ఒకటి. అర్థం చేసుకునేది మరొకటి ఉంటుంది- బెట్రెండ్ రస్సెల్.
‘దేశభక్తి అనే పదం, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మూర్ఖపాలకులు వాడే ముసుగు’ అన్నాడు మరొక తత్వవేత్త. అబద్ధాల్ని గట్టిగా నమ్మేవాళ్ళు మనమొక నిజా న్ని చెప్పినపుడు ‘ఆధారమేమిటి’? అని యాగీ చేస్తారు. వాళ్ళు నమ్మే అబద్ధాలకు ఆధారాలేమున్నాయోనన్నది మాత్రం వారు ఆలోచించుకోరు.
ఇరాన్‌లో బాంబులు పేలుతున్నా, మన భారతదేశం ప్రశాంతంగానే ఉంది. అందుకు మోదీ నిర్ణయాలే కారణం అంటున్నారు ఆయన భక్తులు. వాస్తవమేమంటే అసలు అక్కడ యుద్ధాలు మొదలుకాకముందే, మన దేశంలో విద్వేష యుద్ధం 12ఏళ్ళుగా నడుస్తోంది. విదేశాంగ విధానం లోపించి, పెట్రోలు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి, సామాన్యులు బతకలేకపోతున్నారు. ట్రంప్‌కు భయపడి, మోదీ చేస్తున్న గులాంగిరితో దేశ ప్రతిష్ట పూర్తిగా ధ్వంసమైంది. చావుకు యుద్ధమే అక్కరలేదు. ఈ దేశ ప్రజల చావుకు మన విశ్వగురువు తగిన బందోబస్తు చేస్తూనే వచ్చాడు. గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, ఫ్లుఓవర్లు కూలిపోయి, విమానాలు, రైలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతూ.. హత్యలు, మానభంగాలు, హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ లేకపోవడాలు గ్లాస్ లేక, కరెంటు లేక కట్టెల పొయ్యి వెతుక్కునే స్థితి తెచ్చింది మన విశ్వగురుడే కదా? హోటళ్ళు, హాస్టళ్ళూ మూతపడే విధంగా పరిస్థితిని మురగబెట్టింది ఈ దేశంలోని ఒక టెలిప్రాంప్టర్ రీడరే కదా?
మల్ మల్ ధోయే శరీర్‌కొ/ధోయేన మన్‌క మైల్ నహోయె గంగా గోమతి/రహే బైల్ కె బైల్ అన్నాడు కబీర్. క్రైస్తవ దేశం అమెరికా, యూదుల దేశం ఇజ్రాయెల్‌లు కలిసి పర్మిషన్ ఇస్తే గాని, ముస్లిం దేశమైన ఇరాన్‌కు పోయి చమురు తెచ్చుకునే పరిస్థితిలో లేడు ఈ గల్గొటియా గురువు! అతనూ, అతని అంథ భక్తులూ కలిసి ఈ దేశాన్ని ‘హిందూ రాష్ట్ర’గా మారుస్తారట! కాస్త, మైండ్‌లో మెదడుందా? అని అడుగుతున్నారు సామాన్య పౌరులు.
గాజు భవనాల్లో ఉండేవారు ఇతరుల ఇళ్ళపైకి రాళ్ళు విసరకూడదు కాని, అంత పరిజ్ఞానం లేని ఇండియన్ హోంమినిస్టర్ అమిత్ షా అస్సాం లో జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ “కాంగ్రెస్ తమ పదిహేనేళ్ళ పాలనలో అస్సాం హెల్త్‌కేర్ బడ్జెట్‌లోంచి ప్రతియేటా 150 కోట్లు దిగమింగింది.” అని అన్నాడు. ఆ పని చేసింది హిమంత బిశ్వశర్మ. 2006 మధ్య కాలంలో అస్సాం ఆరోగ్యశాఖామంత్రి ఆయనే! ఆ కాంగ్రెస్ మంత్రినే తమలో చేర్చుకొని, శుద్ధి చేసి బిజెపి, అతణ్ణి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది! ఆయన చేసిన అవినీతి కాంగ్రెస్‌పై రుద్ది ప్రస్తుత తమ ముఖ్యమంత్రి సచ్చీలుడు అని ప్రకటించుకున్నాడు శీలవంతుడైన అమిత్‌షా దేశ ప్రజలకు విషయాలు అర్థం కావన్న భ్రమలో ఉన్నట్టుంది హోం శాఖా మంత్రి.
“తక్కువ ప్రతిభ ఉన్న మందబుద్ధులకే అమితమైన గర్వం, అహంకారం, తమపై తమకు విశ్వాసం ఉంటాయి! కారణం ఏమిటంటే ఇలాంటి మూర్ఖుల చుట్టూ, ఇలాంటి వారే మరికొంతమంది చేరి ప్రశంసలు గుప్పిస్తుంటారు.” అని చెప్పినవాడు డచ్ దేశపు మానవ వాది డిసిడిరియస్ ఎరాస్‌మస్! ఆయన 1509లో చెప్పినా, కొందరికి విషయం ఇప్పటికీ అర్థంకాదు. ఆరెస్సెస్ వారికి చీమూ, నెత్తురూ ఉంటే ‘భారత్ మాతాకీ జై’ నినాదాన్ని, ‘జైహింద్’ నినాదాన్ని వదిలేయాలి. ఎందుకంటే ముస్లింలను ద్వేషించే ఈ సంస్థ సభ్యులు, ‘భారత్ మాతాకీ జై’ నినాదాన్ని రూపొందించింది ఒక ముస్లిం అజీముల్లా ఖాన్ అని తెలుసుకోవాలి! అలాగే ‘జైహింద్’కు రూపకల్పన చేసినవాడు అబిద్ హసన్ హైదరాబాదీ ముస్లిం అని తెలుసుకున్నారో లేదో తెలుసోకపోతే, ఇప్పుడైనా తెలుసుకోవడం మంచిది. అయితే, ‘కాషాయ దేశభక్తులు అసలైన చరిత్ర తెలుసుకోగలుగుతారా?’ అని ప్రశ్నించినవాడు మాత్రం పినరయ్ విజయన్, కేరళ మాజీ ముఖ్యమంత్రి. ఈయనకే కాదు దేశంలోని కోట్లాది భారతీయులక్కూడా ఈ అనుమానం ఉంది.
మోదీ దినచర్యను బాగా గమనించి, ఒక జర్నలిస్ట్ ఈ విధంగా రాశాడు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాలి అంటే ఎంత కష్టం? ప్రఖ్యాత బ్రాండ్ జార్జియా ఆర్మానీ సూటు ధరించాలి. కెన్నెత్ కోల్ షూ వేసుకుని, మొవాడో వాచ్ పెట్టుకోవాలి. మేకప్ చేయించుకొని, కూపర్ విజన్ సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. హెయిర్ కేర్, ఫెర్ఫూమ్ అయ్యాక, ఐఫోన్ చేతిలోకి తీసుకోవాలి. రిహార్సల్స్, లైట్స్, కెమెరా, యాక్షన్, డైరెక్షన్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెల్ఫీలు ఖరీదైన మష్రూమ్ రోటీతో లం చ్ రెస్ట్. తిరిగి వేరే సూట్ ధరించి, రిపీట్ మోడ్‌లో పనిచేయాలి.ఎంత కష్టం? ఎంత కష్టం? ఇంత కష్టపడి అహోరాత్రులు దేశం కోసం పనిచేస్తుంటే వారి బిజెపి పార్లమెంట్ మెంబర్ ఇలా చెపుతాడేమిటో “నరేంద్రమోదీ పదవి నుంచి తొలగితే చాలు. మరుసటి రోజు అతను జైల్లో ఉంటా డు. ఇక జీవితమంతా కూడా అక్కడే గడుపుతాడు” అని! ఇదొక్కటే కాదు, సోషల్ మీడియాలో సుబ్రహ్మణ్యస్వామి, మోదీ గురించి చెప్పిన విషయాలు తిరుగుతూనే ఉన్నాయి. ఆసక్తి గలవారు వెతుక్కోవచ్చు.
మోదీ మిత్రులు కొనేసిన మీడియా సంస్థల్లో పనిచేయడం ఇష్టం లేక, కొందరు బయటకు వచ్చేసి, స్వతంత్ర జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు. జనాని కి కొన్ని వాస్తవాలు చేరవేస్తున్నారు. అలాంటి వారిలో ఓ స్వతంత్ర జర్నలిస్ట్ కవర్ చేసిన సంఘటన ఇలా ఉంది
ఎలక్షన్ ప్రచార సభ ముగించుకొని మోదీ తిరిగి వెళ్లిపోతుంటే కొందరు గ్రామస్థులు ఆయన కాన్వాయ్‌ను ఆపారు. తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. ‘ ఓ అదెంత పని? చెప్పండి చిటికెలో తీర్చేస్తానన్నాడు, గ్రామస్థులు రెండు సమస్యలున్నాయని చెప్పారు. 1.ఆ ఊళ్లో ఆసుపత్రి ఉంది కానీ డాక్టర్ లేడు. ఆ మాట వినగానే మోదీ తన ఐఫోన్ తీసి, ఫోన్ కలిపి ఎవరితోనో మూడు నిమిషాలు మాట్లాడాడు. “అయిపోయింది! మీ ఆసుపత్రికి డాక్టర్ సాబ్ వస్తాడు సరే ఇంకో సమస్య అన్నారు కదా? అదేమిటో చెప్పండి!’ అని అడిగాడు.
“అయ్యా ! మా ఊరి దరిదాపుల్లో ఎక్కడా సెల్ సిగ్నల్ రాదు. దయచేసి ఓ సెల్ టవర్ పెట్టించండి” అని అడిగారు గ్రామస్థులు. మోదీ మొహం వేలాడేసి ‘ కాన్వాయ్‌ని ముందుకు పోనీయండి!’ అని ఆర్డర్ వేశాడు. గత 12 ఏళ్లుగా ఆయన ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోతూనే ఉంది.
బిజెపి వేలమందిని నియమించుకొని, ప్రపంచవ్యాప్తంగా తప్పుడు కథనా లు ప్రచారం చేస్తూనే ఉంది అన్నది నిజం! వారు చెప్పే కథనం ప్రకారం, వారు కాంగ్రెస్‌ను ఖాన్‌గ్రేస్ అని అంటారట. కాంగ్రెస్ ఖాన్ అనే శబ్ధం నుండి వచ్చిందని వీరి సిద్ధాంతం. ఇందిరాగాంధీ ఖాన్‌ను పెండ్లి చేసుకుందని అందువల్ల ఖాన్‌ల పార్టీ కాన్‌గ్రేస్ అని తీర్మానించి జనంలో ప్రచారం చేస్తున్నారు. ఇందిరాగాంధీ వివాహం, ఖాన్ అనే ముస్లింతో కాలేదని వీరికి తెలియదు. తెలిసినా, అబద్ధ్దాలు ప్రచారం చేయదల్చినప్పుడు ఇక నిజాలతో ఏం పని? అడ్డదిడ్డంగా ఏదైనా మాట్లాడొచ్చు కదా? ఇందిరాగాంధీ భర్త పేరు ఫిరోజ్‌గాంధీ. ఆయన ముస్లిం కాడు. పార్సీ కుటుంబీకుడు. వారి ఇంటిపేరు గాంధీ. దాన్ని వారు గాంఢీ అని కూడా పలుకుతారు. అది ఇంగీషులో రాస్తే గాంధీ అవుతుంది. ఈయనకు మహాత్మాగాంధీకి ఏం సంబంధం లేదు.
ఫిరోజ్‌గాంధీ స్వాతంత్య్ర సమరయోధుడు. జైలుకు వెళ్లాడు. ఇందిరా పెళ్లి ఆనంద్‌భవన్‌లో హిందూ సాంప్రదాయాల ప్రకారం 26 మార్చి 1942లో జరిగింది. ఇందిర తల్లి కమలానెహ్రూ టి.బితో బాధపడుతూ ఉండేది. ఫిరోజ్ ఒక కొడుకులాగా బాధ్యత తీసుకుని ఆమెను సానిటోరియంలకు తీసుకుపోయేవాడు. ఆ కుటుంబ సాన్నిహిత్యమే ఇందిర పెళ్లికి దారితీసింది. కమలానెహ్రూ మరణశయ్యపై ఉన్నప్పుడు ఫిరోజ్ పక్కనే ఉన్నాడు. ఈ విషయా లు తెలుసుకోకుండా అభాండాలు వేసే నీచ బుద్ధిని మనం ఎక్కడికక్కడ ఎండగడుతూ ఉండాలి!.
కశ్మీర్‌ను నెహ్రూ వల్లే కోల్పోయామని మోదీ అబద్ధాలు చెపుతున్నాడు. ఆనాడు కశ్మీర్‌ను జిన్నాకు వదిలేద్దామని సర్దార్ పటేల్ అంటే నెహ్రూ పట్టుబట్టి కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేశాడు. ఇది ఆన్ రికారు ్డ లో ఉంది! ఏది నిజం? ఏది అబద్ధం అని దేశ ప్రజలు ఆలోచించుకునేలోపు, అంథభక్తులు మరో కొత్త అబద్ధాన్ని ఆవిష్కరిస్తారు. ఏది ఏమైనా జనాన్ని మతం చుట్టూ గానుగెద్దుల్లా తిప్పుతూ ఉంటారు. దేశప్రజలు ఈ కుట్రను అర్థంచేసుకుంటున్నారు. జిన్నా, సావర్కర్ల స్నేహం ఎంతో గొప్పది. అందుకే ఆర్‌ఎస్‌ఎస్ వారు జిన్నాను చంపలేదు, గాంధీని చంపారు. అదే గాడ్సేతో గాంధీకి బదులు జిన్నాను చంపించి ఉంటే, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి రెండు దేశాలు ఏర్పడి ఉండేవి కావు. సమగ్రత, మత సామరస్యం కోరుకున్నాడు కాబట్టి గాంధీని గాడ్సేతో హత్య చేయించారు. ఈ రోజు వరకు పాక్‌తో మన సంబంధాలు బెడిసికొడుతున్నాయంటే, అక్కడ ఉగ్రవాదం బలపడిందంటే అందుకు కారణం మనం దేశంలో ఉన్న ఈ ఉగ్రవాద సంస్థే కారణం! అయితే, విషయం పైపైన చూస్తే అర్థంకాదు. లోతుగా మూలాల్లోకి పోయి విశ్లేషించుకోవాలి!
సాధారణ దొంగ మీ మొబైల్, పర్సు, గడియారం, బ్యాగు, బంగారు గొలుసు వంటివి దొంగిలిస్తాడేమో గానీ, బడా రాజకీయనాయకుడు మీ మొత్తం భవిష్యత్తును చివరకు ‘ఓటుహక్కు’ను కూడా దొంగిలించేస్తాడు. చాలదూ? విధ్వంసానికి యుద్ధమే చేయాలా?
(కవిరాజు త్రిపురనేని రామ స్వామి, (జాతీయ పురస్కార తొలి గ్రహీత, జీవశాస్త్రవేత్త)