Skip to content
సంపాదకీయం వార్తలు

పేదవాడి జీవితానికి ‘హామీ’ ఎక్కడ?

Prajapaksham 02 Jul 2026 0 నిమిషాల పఠనం సంపాదకీయం
పేదవాడి జీవితానికి ‘హామీ’ ఎక్కడ?

Employment Guarantee Scheme

గ్రామీణ భారతదేశంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంగా కాకుండా, కోట్లాది పేద కుటుంబాలకు ఆకలి, నిరుద్యోగం, వలసల నుంచి రక్షణ కల్పించే సామాజిక భద్రతా వ్యవస్థగా చూడాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంపై ఆధారపడిన గ్రామీణ కుటుంబాలకు ఏడాది పొడవునా పని దొరకదు. అలాంటి సమయంలో ప్రభుత్వం కల్పించే ఉపాధి వారికి జీవనాధారంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ‘విబి జి రామ్‌ జి’ బుధవారం (జులై ఒకటి) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఉపాధి దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు దేశవ్యాప్తంగా కనీస వేతనాన్ని రూ.300గా నిర్ణయించింది. సగటు రోజువారీ వేతనం రూ.327.40కు పెరిగింది. రూ.95 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మార్పు లు స్వాగతించదగినవే. అదనంగా 25 రోజుల ఉపాధి నిజంగా లభిస్తే గ్రామీణ కుటుంబాలకు కొంత ఆదాయం పెరుగుతుంది. మహిళలకు గ్రామస్థాయిలోనే ఉపాధి లభించడం, నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనులు కొనసాగడం గ్రామాల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. అయితే పేదల జీవిత వాస్తవాలను పరిశీలిస్తే సమస్య పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని స్పష్టమవుతుంది. నేటి పరిస్థితుల్లో రోజుకు రూ.300 లేదా రూ.327 వేతనం ఒక కుటుంబానికి సరిపోతుందా? గత కొన్నేళ్లలో నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్‌, విద్యుత్‌, వైద్యం, విద్య, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోయింది. వేతనం పెరిగినప్పటికీ జీవన వ్యయం అంతకంటే వేగంగా పెరగడంతో పేదల ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదు. రోజుకు సగటు రూ.327 చొప్పున 125 రోజులు పని చేసినా ఒక కుటుంబానికి సంవత్సరానికి సుమారు రూ.41 వేల ఆదాయం మాత్రమే లభిస్తుంది. మిగిలిన రోజుల ఉపాధి ఎలా లభిస్తుంది? భూమిలేని వ్యవసాయ కూలీలకు సీజన్‌లో మాత్రమే పని ఉంటుంది. మిగతా కాలంలో అప్పులు చేయడం, వలస వెళ్లడం లేదా నిరుద్యోగంతో ఉండడం తప్ప మరో మార్గం ఉండదు. అందువల్ల ఉపాధి దినాలు పెరగడం మాత్రమే గ్రామీణ పేదరికానికి పూర్తి పరిష్కారం కాదు.
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం వేతనాల సకాల చెల్లింపు. గతంలో అనేక ప్రాంతాల్లో కార్మికులు పని చేసిన తరువాత నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. పేద కుటుంబం రోజువారీ ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తుంది. వేతనాలు ఆలస్యం అయితే అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన హామీలు ఆచరణలో కూడా సమర్థంగా అమలు కావాలి. కొత్త చట్టంలో పని కోరిన ప్రతి అర్హ కుటుంబానికి సమయానికి ఉపాధి లభించే విధానం కొనసాగాలి. గ్రామ పంచాయతీల పాత్ర బలహీనపడకుండా స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులను ఎంపిక చేసే స్వేచ్ఛ ఉండాలి. అదే సమయంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు పనిస్థలాల్లో తాగునీరు, విశ్రాంతి, చిన్నపిల్లల సంరక్షణ వంటి సౌకర్యాలు కల్పించడం అవసరం.
ఉపాధి హామీ పథకం శాశ్వత ఉపాధికి ప్రత్యామ్నాయం కాదు. గ్రామీణ పరిశ్రమలు, పాడి పరిశ్రమ, చేపల పెంపకం, ఆహార ప్రాసెసింగ్‌, చేతివృత్తులు, సూక్ష్మ పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతి ఏడాది వేతనాలను సవరించే విధానాన్ని అమలు చేయడం ద్వారా గ్రామీణ కార్మికుల కొనుగోలు శక్తిని కాపాడవచ్చు. ప్రభుత్వం చేపట్టిన వేతన పెంపు, ఉపాధి దినాల పెంపు, అధిక నిధుల కేటాయింపు వంటి చర్యలు గ్రామీణ సంక్షేమం దిశగా ఒక ముందడుగే. అయితే పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రూపాయి కొనుగోలు శక్తి క్షీణత వంటి సమస్యలతో పోలిస్తే ఇవి ఇంకా సరిపోవడం లేదు.
గ్రామీణ పేదలు కోరుకునేది కేవలం కొద్దిరోజుల ఉపాధి కాదు. గౌరవప్రదమైన జీవనం, స్థిరమైన ఆదాయం, పిల్లలకు విద్య, కుటుంబానికి ఆరోగ్య రక్షణ, అప్పులేని జీవితం. ఏటా కోటి ఉద్యోగాల హామీతో, యువతను ఆకర్షించి, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి పుష్కర కాలంగా ఈ దిశగా కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదు. కొవిడ్‌ నుంచి కృత్రిమ మేధస్సు వరకూ అనేకానేక కారణాలతో ప్రైవేటు ఉద్యోగాలు సైతం ఆవిరవుతున్నాయి. చదువుకున్న వారు సైతం స్వగ్రామాలకు తెరలి వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం వారికి అండగా ఉండాలి. గ్రామీణాభివృద్ధికి యువ శక్తిని వినియోగించుకోవాలి.
ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు ఉండాలి. పర్యావరణ మార్పుల కారణంగా వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు దెబ్బతింటున్న వేళ, కనీస ఉపాధి రోజులను కనీసం 200 రోజులకు పెంచాలి. ఇలాంటి చర్యలు తీసుకోకుండా, నామమాత్రపు పెంపు వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఆర్భాటపు ప్రకటనలను విడిచిపెట్టి, లేని అభివృద్ధిని ఉన్నట్టు కనికట్టు చేయడం మానుకొని, వాస్తవాలకు అనుగుణంగా కేంద్రం చర్యలు చేపట్టాలి. ఉపాధి హామీ నిజంగానే ‘జీవన హామీ’గా మారాలంటే వేతనాలను జీవన వ్యయానికి అనుగుణంగా నిర్ణయించడం, సకాలంలో చెల్లించడం, ఏడాది పొడవునా గ్రామీణ ఉపాధి అవకాశాలను విస్తరించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత అవసరం. అప్పుడే వికసిత్‌ భారత్‌ లక్ష్యం గ్రామీణ పేదల జీవితాల్లో కూడా నిజమైన అభివృద్ధిగా ప్రతిఫలిస్తుంది. ఇప్పుడు కంటితుడుపు చర్యలు కాదు… శాశ్వత పరిష్కారాలు అవసరం. కనీసం సుదీర్ఘ కాలానికి ఉపయోగపడే నిర్ణయాలు వెలువడాలి.
గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయడానికి నిర్దిష్టమైన ప్రణాళికలు చేపట్టి, పటిష్టంగా అమలు చేయాలి. సూక్ష్మస్థాయిలో మార్పులు లేకుండా, దేశం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందనడం అతిశయోక్తి మాత్రమే. సగటు జీవికి భవిష్యత్తు శూన్యమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *