Skip to content
జాతీయం వార్తలు

రాజ్యసభ ఎంపీగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం.. మోదీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు

Prajapaksham 29 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
రాజ్యసభ ఎంపీగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం.. మోదీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు

Congress President Mallikarjun Kharge Sworn In as Rajya Sabha Member

కర్ణాటక నుండి రాజ్యసభకు తిరిగి ఎన్నికైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోమవారం నాడు పార్లమెంట్ భవనంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తన ఛాంబర్‌లో ఖర్గే చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చేతిలో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని, హిందీ భాషలో ఆయన ఈ ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మోదీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపారు. దేశ ప్రజల మండుతున్న సమస్యలను, వారి ఆకాంక్షలను ,గొంతుకను పార్లమెంట్‌లో పూర్తి చిత్తశుద్ధితో, గట్టి విశ్వాసంతో వినిపిస్తానని స్పష్టం చేశారు. రాబోయే వర్షకాల సమావేశాల్లో ప్రతిపక్షాల మధ్య మరింత బలమైన సమన్వయం ఉండేలా చూస్తామని, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ, జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒత్తిడి తీసుకురావడమే తమ ప్రధాన బాధ్యతని ప్రకటించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా (Leader of the Opposition) కొనసాగే అవకాశం లభించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, వయనాడ్ లోక్‌సభ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, కె.సి. వేణుగోపాల్ ప్రత్యేకంగా హాజరై ఖర్గేకు అభినందనలు తెలిపారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు జగత్ ప్రకాష్ నడ్డా (సభా పక్ష నేత), కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, ఎల్. మురుగన్ ,రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఖర్గేతో పాటు బీజేపీ నేత తరుణ్ చుగ్, ,గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన మరో ఆరుగురు కొత్త సభ్యులు కూడా ఈ రోజు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *