వలసదారుల చెల్లింపులే జీవనాధారం !
Migrants’ Contributions Sustain Households and Growth
(16 జూన్ అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవం సందర్భంగా)
మన తెలుగు రాష్ట్రాల్లో ఎందరో కార్మిక శ్రామిక వర్గాలు అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి, తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవడానికి, తమ స్వగ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి దుబాయ్, సౌథీ అరేబియా లాంటి దేశాలకు కన్నీటి ధారలతో వలస వెళ్లడం చూస్తు న్నాం. అదే విధంగా ఉన్నత విద్యార్హతలను కలిగిన యువత ఉన్నత ఉద్యోగాల వేటలో విదేశాలకు వలసవెళ్లడం కూడా జరుగుతుంది. ఇలాంటి వలసదారు లు తాము కష్టపడి సంపాదించిన ధనాన్ని తమ ఊళ్లల్లో స్థిరపడిన కుటుంబ సభ్యులకు పంపడం ద్వారా ఆయా కుటుంబాల్లో ఆహార భద్రత, ఆరోగ్య పరిరక్షణ, పిల్లల విద్య, గృహ నిర్మాణా లు, అప్పులు తీర్చడం, కుటుంబ సమగ్రాభివృద్ధి జరగడం లాంటివి తరుచుగా చూస్తు న్నాం. ఇలా విదేశాల్లో లేదా స్వదేశంలో ఇతర ప్రాంతాల కు జీవనోపాధులను వెతుక్కుంటూ వలసలు వెళ్లిన అభాగ్యుల శ్రమ తమ కుటుంబాలకు ఆశా దీపాలుగా పని చేస్తున్నాయి.
వలసలు వెళ్లి సంపాదించిన డబ్బును తమ స్వంత ఊళ్లల్లో ఉన్న కుటుంబాలకు పంపించడంతో ఆయా కుటుంబాలు ఆనంద, ఆయురారోగ్యాలతో గడపడాన్ని గమనించిన ఐరాస ప్రతి ఏట జూన్ 16న అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ ఫ్యామిలీ రెమిటెన్సెస్ డేను ఘనంగా జరుగుపుకోవడం గత దశాబ్దకాలంగా కొనసాగుతున్నది. ఈ దినోత్సవ వేదికగా వలసదారుల శ్రమను గుర్తించడం, వారికి ప్రభుత్వ చేయూతను ఇవ్వడం, వలసదారుల యోగక్షేమాలను చూసుకోవడం, ఆర్థిక ప్రగతిలో వారి పాత్రను అవగాహన పర్చడం లాంటివి జరగాలి. 2026 అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవం ఇతివృత్తంగా చెల్లింపులు జీవనాధారం అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతున్నది. వలసదారులు తమ స్వదేశీ కుటుంబాలకు పంపించే చిన్న మొత్తం డబ్బులను పంపినప్పటికీ ఆ మొత్తం ఆయా కుటుంబాలు మెరుగైన జీవితాలను గడపడానికి ఉపకరిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో దాదాపు 5ట్రిలియన్ డాలర్ల వలసదారుల చెల్లింపులు తమ కుటుంబాలకు చేర డం గమనించారు.
2030 నాటి ఈ చెల్లింపులు అదనంగా దాదాపు 4.4 ట్రిలియన్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ వలసదారులు 500 బిలియన్ డాలర్ల సంపాదనను తమ కుటుంబాలకు పంపించడం, ఆ కుటుంబాల్లో పేదరికం తగ్గుతూ, వారి జీవన ప్రమాణాలు పెరగడం జరుగుతోందని గమనించారు. ఈ వలసదారుల్లో 2.58 బిలియన్ల అంతర్జాతీయ వలసదారులు, 760 మిలియన్ల స్వదేశీ వలసదారులు ఉన్నారు.
వలసదారులు పంపించే డబ్బు అధికంగా గ్రామీణ కుటుంబాల ఉన్నతికి ఉపయోగపడుతున్నాయి. మెక్సికో, చైనా, ఇండియా లాంటి దేశాల్లో వలసదారులు తమ కుటుంబాలకు పంపిస్తున్న చెల్లింపులు అధికంగా ఉన్నాయని తెలుస్తున్నది. వలసదారులు పంపించే ధనంతో దాదాపు 800 మిలియన్ల కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతున్నారు. పిల్లల విద్య, పేదరిక నిర్మూలన, కుటుంబ ఆరోగ్యం, పోషకాహారం, గృహ నిర్మాణాలు, కుటుంబాలకు నిలకడ రావడం, అప్పులు తీరడం, అవకాశాలు మెరుగుపడడం, గ్రామీణ అభివృద్ధికి ఊతం ఇవ్వడం, ఆర్థిక అసమానతలు తగ్గడం, దీర్ఘకాలిక ప్రయోజనాలు కలగడం, కుటుంబ ఆర్థిక స్థితులు బలపడడానికి ఉపయోగపడుతూ ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి.
తమ కుటుంబాలను, స్వగ్రామాలను, పిల్లల్ని వదిలి పొట్టచేత పట్టుకొని విదేశాలకు లేదా తమ దేశంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన అభాగ్యులు ఒంటిపూట తింటూ, అనారోగ్యకర వాతావరణంలో సహితం జీవి స్తూ, తమ పిల్లల బంగారు భవితను స్వప్నిస్తూ, సంపాదించిన ధనాన్ని తమ స్వదేశంలో ఉన్న కుటుంబాలకు పంపించడం ద్వారా దేశాభివృద్ధిలో ఎంతగానో దోహదపడుతున్నారని గమనిస్తూ, వారి సేవలను కొనియాడుదాం, వారి కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉంటూ సహకరిద్దాం.
డాక్టర్ : బుర్ర మధుసూదన్ రెడ్డి