శ్రామికవర్గ పక్షపాతి.. శ్రీశ్రీ
Remembering Mahakavi Sri Sri: The Revolutionary Voice of Telugu Poetry (photo-AI Generated Image)
( శ్రీ శ్రీ వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం)
మహాకవి శ్రీశ్రీ గురించి రాయడానికేకాదు… ఆలోచించడానికి కూడా ఒక అర్హత కావాలి. సమజంలో కుళ్లును కూకటివేళ్లతో పెకళించే శక్తివంతమైన కవతా ప్రళయఘోషను భరించే శక్తి ఉండాలి. సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు తలవంచని శ్రీశ్రీ మాటల ఛురకత్తుల దాడుల పదును భరించే ఆద్రత ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆయన కలం సృష్టించిన తిరుగుబాటు భావనలను ఒంటపట్టించుకోవడానికి అనంతమైన ధైర్యం కావాలి. స్వార్థపరులు… లంచగొండులు.. సాటి మనిషి శ్రమను దోచుకునే దుర్మార్గులు.. సమసమాజాన్ని ఒప్పుకోని నీచులకు సింహస్వప్నమైన శ్రీశ్రీ, పీడితులకు, తాడితులకు, అణగారిన వర్గాలకు మాత్రం ఆప్తుడు. సాహితీ ఉద్యమకారుడు… అక్షర ఉద్యమకారుడు శ్రీశ్రీ గురించి ఎంత చెప్పినా … ఎన్ని విశేషణాలు జోడించినా తక్కువే. మనిషి ఆలోచనా సరళిని, ప్రవర్తనా విధానాన్ని విశ్లేషించడానికి ఎంతో మంది రచయితలు మహా గ్రంథాలే రాశారు. కానీ, అక్షరబ్రహ్మ శ్రీశ్రీ మాత్రం..
‘నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే…’ అంటూ సగటు మనిషి ఆలోచనా సరళిని సూక్ష్మంగానేగానీ, ఎంతో లోతైన పరిశీలనగా చెప్పేశాడు. ఒక పుస్తకంలోనూ ఇమడని భావాన్ని, అంత తేలికగా, అంతే కఠినంగా చెప్పిన శ్రీశ్రీని ఎవరితో పోల్చగలం? ‘ఇది నా యుగం.. శ్రీశ్రీ యుగం’ అని ప్రకటించుకున్న అసమాన ప్రతిభావంతుడిని కొత్తగా ఎలా పరిచయం చేయగలం. ఇక్కడ కూడా మళ్లీ శ్రీశ్రీయే గుర్తుకొస్తాడు.
‘ఏదో కాస్త భాషాజ్ఞానం
ఇంతో అంతో చ్చందస్సంపదా
ఐదోపదో అలంకారాలు
అరో అందులో సగమో ఆవేశం..
*
ఇలాంటివేవో పోగుచేసి
ఇది వరకు నిన్నెప్పుడూ చూడనట్టు
ఇవ్వాళేదో కొత్తగా కనిపెట్టినట్టు
ఏమని వర్ణించను నిన్ను?
*
ఏది రాసినా ఏం లాభం?
ఇదివరకెవడో అనే ఉంటాడు
బహుషా అనేదేదో నాకన్నా
బాగానే అని ఉండొచ్చు’ అనే శ్రీశ్రీ మాటలు స్పృతి పథంలో మెదలుతాయి. సందర్భం ‘ఖడ్గసృష్టి’ కావచ్చు.. చెప్పేది ‘శరచ్చంద్రిక’పై కావచ్చు. కానీ, ఆ మాటలు శ్రీశ్రీకి కూడా అన్వయించుకోవచ్చు. నాలాంటి పాత్రికేయులకే కాదు.. రచయితలకు, మేధావులకు, చివరికి రాజకీయ నాయకులు కూడా శ్రీశ్రీయే గతి. ఆయనన అనుసరించకపోయినా, అనుకరించకపోయినా పూటగడవని స్థితి. పదునైన పదాలు కావాలంటే శ్రీశ్రీ. లోతైన భావం చెప్పాలంటే శ్రీశ్రీ. మస్తిష్కాలలోకి చొరబడి.. గుండెల్లో ఒదిగిపోయి.. ఆలోచనలో భాగమై, పలుకులకు మంత్రమై, మనిషిపై అపారమైన ముద్ర వేసిన ఏకైక రచయిత శ్రీశ్రీ అనడంలో అతిశయోక్తి లేనేలేదు. సాహితీ లోకంలో ఆయన ఓ అగ్నిశిఖ. ఓ మహా విస్ఫోటనం. హోరెత్తించే జలపాతం. ఉరుకులుపరుగుల జలప్రవాహం. ఆయన కవిత్వం నిరంతరం జ్వలిస్తునే ఉంటుంది. అందుకే, ఆ కవిత్వంలోని ఏదో ఒక మాటను లేదా వాక్యాన్ని లేదా భావాన్ని ప్రస్తావించకుండా అక్షరాలు ముందుకు సాగవు. ఏ సందర్భంలోనైనా శ్రీశ్రీ మన స్పృతి పథంలో మెదులుతాడు…. మెరుస్తాడు. కుళ్లి సమాజాన్ని చూసినప్పుడు శ్రీశ్రీ గుర్తుకొస్తాడు. పేదల కష్టాలను కాంచినప్పుడు శ్రీశ్రీ కనిపిస్తాడు. ఎర్ర రంగులో.. ఎత్తిన పిడికిలిలో.. వెల్లివిరిసిన చైతన్యంలో.. దైన్యాన్ని వీడిన ధైర్యంలో అగుపించేది శ్రీశ్రీ ఒక్కడే. కవిత్వం ఎలా ఉండాలో చెప్పే క్రమంలో, తన కవితా ధోరణిని తానే..
‘కదిలేది కదిలించేదీ,
మారేది మార్పించేదీ,
పాడేదీ పాడించేదీ,
పెనునిద్దుర వదిలించేదీ,
మునుముందుకు సాగించేదీ,
పరిపూర్ణపు బ్రదుకిచ్చేదీ’ అంటాడు. పెట్టుబడిదారీ వ్యవస్థను నిరసించిన శ్రీశ్రీ, కార్మికులు, కర్షకుల పక్షాన నిలిచాడు. వారి సమస్యలు.. దుర్భరమైన జీవితాలను చూసి చలించిపోయాడు. వారి గొంతుకయ్యాడు. అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా నినదించాడు. అన్యాయాలను ఎదిరించే పదునైన అక్షర ఆయుధమయ్యాడు. ఛురకత్తులై చెడును చెండాడే శక్తి ఆయన కవిత్వానిది. ఆయనలో నవ సమాజ నిర్మాణానికి అంకిత భావం ఉంది. వేదనలు, రోదనలు ఎక్కడ ఉంటే శ్రీశ్రీ అక్కడ ప్రత్యక్షమవుతాడు. పోరాట స్ఫూర్తినింపుతాడు. చిన్నతనంలోనే రచనలకు శ్రీకారం చుట్టిన శ్రీశ్రీ, జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబట్టాడు. కొన్ని సినిమా పాటలను… ఒకటో రెండో రాజకీయ కవితలను కొంత మంది ప్రస్తావిస్తూ, విమర్శలు గుప్పించినంత మాత్రాన శ్రీశ్రీ ప్రతిష్ట మరసకబారదు. సామాన్య ప్రజలు నెత్తినపెట్టుకొని ఊరేగుతున్నప్పుడు, మేధావులిచ్చే భుజకీర్తులు ఆయనకు ఎందుకు? ఏడవ ఏటనే రచనా వ్యాసాంగాన్ని మొదలుపెట్టిన ఆయన మొదట్లో భావ సాహిత్యంలో ఓలలాడాడు. ఆతర్వాత కమ్యూనిజంవైపు మొగ్గు చూపి, విప్లవ సాహిత్యంతో మమేకమయ్యాడు. ఆరంభంలో సాహిత్యమే శ్రీశ్రీని నడిపిస్తే, ఆతర్వాత శ్రీశ్రీయే తెలుగు సాహిత్యాన్ని నడిపించాడు. శ్రీశ్రీ తన 18వ ఏట 1928లో ‘ప్రభవ‘ అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో ఛందస్సు సంకెళ్లు తెంచుకొని, వాడుక భాషలో కవిత్వం రాశాడు. మార్పును ‘గురజాడ అడుగుజాడ‘గా పేర్కొన్నాడు.
1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. ఝంఝామారుతంలా తెలుగు సాహితీ లోకా న్ని చుట్టేసింది. ఆయనను మహాకవిగా నిలబెట్టింది. అప్పటి వరకూ ఎవరూ పట్టించుకోని, ఎవరికీ పట్టని కార్మికులకు, కర్షకులకు, పతితులకు, భ్రష్టులకు, బాధాసర్పద్రష్టులకు చోటు కల్పించాడు. కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా… ఏదీ కవిత్వానికి అనర్హం కాదని స్పష్టం చేశాడు. -పొలాలు దున్నే రైతుల కష్టాన్ని చూసి చలించిపోయాడు. వారు చిందించే ఘర్మజలానికి (చెమటకు) ఖరీదు కట్టే షరాబు లేడని తేల్చిచెప్పాడు. ప్రపంచ వికాశం కోసం గనిలో, వనిలో, కార్ఖినాలో పరిక్లమించే, పరిఫ్లవించే కార్మిక లోకానికి జేజేలు పలికాడు. వారి కన్నుల నిండా కణకణమండే, గలగల తొణకే, విలాపాగ్నులకు, విషాదాశ్రువులకు ఖరుదు ఎవరు కడతారని నిలదీశాడు. కష్టం చాలక కడుపుమంటతో తెగించి సమ్మెలు కట్టేవారిని పలకరించాడు. శ్రమ నిష్ఫలమై, జని నిష్ఠురమై, నూతిని గోతిని వెతుక్కునే అభాగ్యులను, అనాథలను, అశాంతులను విప్లవ శంఖం పూరించాలని ప్రోత్సహించాడు. కాల్చే ఆకలి, కూల్చే వేద, దారిద్య్రా లూ, దౌర్జన్యాలను పరిష్కరించే, బహిష్కరించే పాటలు, కవితలు తనవని ప్రకటించుకున్నాడు. కార్మికలోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యాన్ని దున్నుగా నిలిచాడు. కష్టజీవుల, కర్మ జీవుల సంక్షేమాన్ని కోరాడు.
కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం,
సాలె లల మగ్గం,
శరీరకష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు-
నా వినుతించే,
నా విరుతించే,
నా వినిపించే నవీన గీతికి,
నా విరచించే నవీన రీతికి,
భావం!
భాగ్యం!
ప్రాణం!
ప్రణవం… అని తన ప్రాధాన్యతలను… ఆలోచనలను… లక్ష్యాలను వివరించాడు. వాటినే ఆచరించాడు. మహాకవిగా వెలిగాడు. తెలుగు సాహితీలోకాన చెరగని ముద్ర.. మలగని జ్యోతి అయ్యాడు. అలాంటి శ్రీశ్రీని ఎవరితో పోల్చినా తప్పే అవుతుంది. శ్రీశ్రీని శ్రీశ్రీతోనే పోల్చడం మినహా రాతగాళ్లకు మరో గత్యంతరం లేదు. సాహిత్య గోదాలో శ్రీశ్రీ అజేయుడు. అక్షరాల లోకంలో అమరుడు. ‘ఈ యుగం నాది.. ఇది శ్రీశ్రీ యుగం’ అని సగర్వంగా ప్రకటించుకున్న సాహితీ రారాజుకు వర్ధంతికి ఇదో అక్షర నీరాజం.
చట్రాల్లో ఇమడని నైజం..
చాలా మంది కవులను వర్గీకరించినట్టు శ్రీశ్రీని ఏదో ఒక పరిమిత చట్రంలో బిగించడానికి వీల్లేదు. ఏ రకమైన సంకెళ్లను తగిలించుకోలేదు. ఏ పరిధుల్లోనూ ఇమడని నైజం శ్రీశ్రీది. కవిత్వం మాదిరిగానే, ఆయన వ్యక్తిత్వం లోనూ ఎన్నో వైరుద్ధ్యాలు. అంతకు మించిన విచిత్రమైన సంఘర్షణలు. ఆయ న హేతుబద్ధంగా ఆలోచిస్తాడు. ఆలోచించినదే చెప్తాడు. చెప్పిందే చేస్తాడు. భేషజాలు లేవు. దాపరికాలు లేవు. అందుకేనేమో, ఎంతో మందికి శత్రువయ్యాడు. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. శ్రీశ్రీని ‘అవకాశ వాది’ అన్నారు కొందరు. ‘మహాప్రస్థానం తప్ప ఆయన గొప్ప రచనలు చేయలేదు’ అని మరికొందరు అక్కసు వెళ్లగక్కారు. ఆయన వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసి, తాబుబోతుగా ముద్రవేసి, హేళన చేసిన వారు… శాపాలు పెట్టిన వారూ లేకపోలేదు. కానీ, వీటిలో వేటినీ పట్టించుకోని మహర్షి శ్రీశ్రీ. అంతటి కర్మయోగి… దార్శనికుడు కాబట్టే..
పోనీ, పోనీ,
పోతే పోనీ!
సతుల్, సుతుల్, హితుల్ పోనీ
రానీ, రానీ,
వస్తే రానీ!
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్, రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పాట్లూ, రానీ!
రానీ, రానీ! అంటూ తన పరిస్థితి గురించి తానే చెప్పుకున్నాడు ‘కళారవి’ గీతంలో.. ఆయన ఆలోచనా ధోరణి ఎవరికీ అంత సులభంగా అర్థం కాదు. ఆయన ఓ అహంకారి.. ఓ అమాయకుడు. ఓ విప్లవ వీరుడు… ఓ పసిబాలుడు. శ్రీశ్రీ ఆలోచనలే జీవితంలో కనిపిస్తాయి. జీవితంలో కనిపించినవే రచనల్లో మెరుస్తాయి. అంతా తనేనని భావించే, తనకంటూ ఏమీ లేని నిస్వార్ధపరుడు. సాహితీ కుబేరుడు శ్రీశ్రీ. ఆర్థికంగా కుచేలుడు శ్రీశ్రీ. తన ‘ఆత్మకథ’లో ఉన్నది ఉన్నట్టు రాశాడు. తన జీవితాన్ని తెరచిన పుస్తకంలా అందరి ముందూ ఉంచాడు. అంత ఆత్మస్థుర్యైన్ని ప్రదర్శించాడు కాబట్టే ‘శ్రీశ్రీ’ అయ్యాడు. ప్రాసకు, శ్లేషకు ఆయనను మించిన వారు లేరు. అతి తక్కువ పదాలతో, లోతైన భావాలను చెప్పడంలో ఆయనకు పోటీ ఎవరూ రారు.. ‘వ్యక్తికి బహువచనం శక్తి’ అనే గొప్ప ఆలోచన శ్రీశ్రీకి తప్ప ఎవరికి సాధ్యం? అందకేనేమో, ‘రెండు అక్షరాల’ మేరు పర్వతమని పిలుస్తారు. ప్రజలపై.. వారి జీవన విధానాలపై.. వారి ఆలోచనలపై సాహిత్యం ఏ స్థాయిలో బలమైన ముద్ర వేస్తుందో చెప్పడానికి శ్రీశ్రీని రచనలను మించిన ఉదాహరణ లేదు. ఉండదు. తెలుగు వీరుడ్ని నిద్రలేపి, జాతీయ పురస్కారాన్ని అందుకున్న అక్షర శిల్పి శ్రీశ్రీ. తెలుగు సాహిత్య చరిత్రపై, సమవాద కలంతో కలకాలం నిలిచివుండే రుధిర జ్వాలల చెరగని సంతకం చేసిన రచనా తపస్వి నాస్తికుడైన శ్రీశ్రీకి శ్రామికుడే దేవుడు. అభాగ్యులు, అన్నార్తులే ఆప్తులు. ఆయన కవిత్వం సామాన్యుడి కంటి దీపమై మార్గం చూపుతుంది. అదే కవిత్వం దోపిడీని అరికట్టడానికి అగ్నిపర్వతంలా ఫెళ్లున ఉబికి, తిరుగుబాటు లావాతో శరవేగ ప్రవాహనమవుతుంది. పురోగమన భావాలకు పునరుత్తేజం శ్రీశ్రీ. దోపికీకి తావులేని సామ్యవాద సామ్రాజ్యానికి తిరుగులేని చక్రవర్తి శ్రీశ్రీ. బానిస సంకెళ్లు తెగిపడే శబ్దం శ్రీశ్రీ. కార్మిక లోక గర్జనలో పదునెక్కిన శక్తి శ్రీశ్రీ. నైలూ నది నగరికతను ప్రశ్నించినా… తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరని నిలదీసినా.. దోపిడీలు, దౌర్యన్జాలు ఇకపై చెల్లవని సవాళ్లు విసిరినా.. అది శ్రీశ్రీకి మాత్రమే సొంతం. గుప్పెడు అక్షరాలతో అనంతమైన భావా లు ఆయన రచనల్లో నాట్యమాడుతాయి. ఆయన సాహిత్యానికి కన్నీటిని ఉప్పెనగా మార్చే శక్తి ఉంది. శక్తిహీనులను పోరాట యోధులను చేసే స్ఫూర్తి ఉంది. ఆయన రాతల్లో ఆద్రత దాగుంది… విప్లవ వెలుగుజిలుగులు ఉన్నాయి. శ్రీశ్రీ రచనలు నిరంతరం వేగుచుక్కలై మెరుస్తునే ఉంటాయి.