Skip to content
తెలంగాణ వార్తలు

మైనర్ డ్రైవింగ్‌పై సీపీ సజ్జనార్ సీరియస్.. స్కూల్ యాజమాన్యాలకు తీవ్ర హెచ్చరిక!

Prajapaksham 19 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
మైనర్ డ్రైవింగ్‌పై సీపీ సజ్జనార్ సీరియస్.. స్కూల్ యాజమాన్యాలకు తీవ్ర హెచ్చరిక!

Hyderaabd CP Sajjanar Reviews Safety Measures with Educational Institutions

హైదరాబాద్ నగరంలో మైనర్లు వాహనాలు నడపడం (Minor Driving), విద్యాసంస్థల వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్లు డ్రైవింగ్‌ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ ,రవాణాశాఖ ఉన్నతాధికారులతో కలిసి ట్రాఫిక్ నిబంధనలు, విద్యార్థుల భద్రతపై ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. విద్యార్థుల ర్యాష్ డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలపై విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మైనర్‌ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు స్కూళ్లలో ‘డీమెరిట్‌ పాయింట్‌’ (Demerit Points) విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడిన కేసుల్లో.. సదరు విద్యాసంస్థల పేర్లు బయటకు వచ్చేలా యాజమాన్యాలు ప్రవర్తించవద్దని హెచ్చరించారు.

ఇటీవల కాలంలో విద్యార్థులను తీసుకెళ్లే స్కూల్ బస్ డ్రైవర్లు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడటంపై సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి డ్రైవర్ల కదలికలపై పాఠశాల యాజమాన్యాలు నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. ఒకవేళ డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికితే, ఆయా పాఠశాలల పేర్లను కూడా బహిరంగంగా బయటపెట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

విద్యార్థుల భద్రత అనేది కేవలం స్కూల్‌ కాంపౌండ్‌ లోపల ఉన్నంత వరకే పరిమితం కాదని సజ్జనార్ తేల్చి చెప్పారు. “విద్యార్థులు పాఠశాలకు ఎలా వస్తున్నారు? తిరిగి ఇళ్లకు ఎలా వెళ్తున్నారు? అనే విషయాలను పర్యవేక్షించాల్సిన పూర్తి బాధ్యత యాజమాన్యాలదే. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు.. అది పాఠశాల ఆవరణ బయట జరిగిందని చెప్పి బాధ్యత నుండి తప్పించుకుందామనుకోవడం సరికాదు” అని సీపీ ఘాటుగా వ్యాఖ్యానించారు. విద్యార్థుల ప్రాణాల రక్షణ కోసం పోలీసులు, రవాణా శాఖ ,విద్యాసంస్థలు సంయుక్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *