Skip to content
జాతీయం వార్తలు

NEET బాధితులకు రూ.1 కోటి పరిహారం ఇవ్వండి.. ప్రధాని మోదీకి అభిజీత్ దిప్కే బహిరంగ లేఖ

Prajapaksham 19 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
NEET బాధితులకు రూ.1 కోటి పరిహారం ఇవ్వండి.. ప్రధాని మోదీకి అభిజీత్ దిప్కే బహిరంగ లేఖ

Abhijeet Dipke Leads Protest Movement, Delhi Security Put on Alert

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్షా పేపర్ లీక్ వివాదం ,విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. నీట్ అక్రమాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై, ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు తన డిమాండ్లతో కూడిన లేఖను ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నీట్ పరీక్షల రద్దు, వరుస లీకేజీలు ,రీ-టెస్ట్ నిర్ణయాల వల్ల ఏర్పడిన తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేక దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని దీప్కే లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, అందులో ఐదు మరణాలు గత 48 గంటల్లోనే సంభవించాయని ఆయన గుర్తుచేశారు. గత రెండు నెలల్లో ఆత్మహత్యలకు పాల్పడిన పలువురు విద్యార్థుల శోకతప్త కుటుంబాలను తాను వ్యక్తిగతంగా కలుసుకున్నానని లేఖలో పేర్కొన్న ఆయన, ఈ ఘోరమైన ధోరణిని అరికట్టేందుకు ప్రధాని తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పిల్లలను కోల్పోయిన భరించలేని మానసిక వేదనతో పాటు, ఈ కుటుంబాలు ఇప్పుడు ఆర్థికంగా కూడా రోడ్డున పడ్డాయని అభిజీత్ దీప్కే వాదించారు. తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు జీవితకాల పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారని, మరికొందరు పెద్ద మొత్తంలో విద్యా రుణాలు తీసుకున్నారని చెప్పారు. కానీ విద్యావ్యవస్థలోని లోపాలతో వారి ఆశలు అడియాసలయ్యాయని మండిపడ్డారు.

అందువల్ల తమ జీవితకాల పొదుపును కోల్పోయి, విద్యా రుణాలు తీసుకున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యావ్యవస్థలో జరుగుతున్న వరుస లోపాలు, పేపర్ లీకేజీల వల్ల ప్రజల్లో ప్రభుత్వ పరీక్షలపై పూర్తి నమ్మకం పోయిందని, కాబట్టి ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. వీటితో పాటు పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, లీకేజీలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని జవాబుదారీలను చేయాలని కోరారు.

పోటీ పరీక్షలపై విద్యార్థుల్లో మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించేలా విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ సీజేపీ ఆధ్వర్యంలో జూన్ 20 నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్త విద్యార్థులతో భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు అభిజీత్ దీప్కే ప్రకటించారు. కాగా, ప్రభుత్వం ప్రకటించిన నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న దేశవ్యాప్తంగా జరగాల్సి ఉన్న తరుణంలో, వ్యవస్థలో మార్పు కోరుతూ విద్యార్థులు ఢిల్లీ వైపు తరలిరావడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *