Skip to content
జాతీయం వార్తలు

Jharkhand Paper Leak: జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రతరం…

Prajapaksham 07 Aug 2026 0 నిమిషాల పఠనం జాతీయం
Jharkhand Paper Leak: జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రతరం…

అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేల ప్రదర్శనలు

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రతరమయ్యాయి. పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గత 13 రోజులుగా ఆరుగురు నిరసనకారులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వర్షాకాల సమావేశాల మొదటి రోజే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి నిరసన తెలిపారు.

జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో జేపీఎస్సీ–జేఎస్‌ఎస్‌సీ సంస్కరణల మంచ్ ఆధ్వర్యంలో జులై 25న ప్రారంభమైన ఈ నిరసన, ఇటీవలి సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద విద్యార్థి నేతృత్వ ఉద్యమాల్లో ఒకటిగా నిలిచింది.

14వ జార్ఖండ్ పీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలని, అలాగే నియామక పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐతో గానీ లేదా రాష్ట్రం వెలుపలి నుంచి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తుల బృందంతో గానీ స్వతంత్ర విచారణ జరిపించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిరసన చేపట్టి, నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

కాగా, జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మిత్రపక్షం అయినప్పటికీ, జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరసన చేస్తున్న విద్యార్థులకు ఆ పార్టీ మద్దతు ప్రకటించింది.

ప్రభుత్వంతో చర్చలకు 11 మందితో టీం

ప్రశ్నాపత్రాల లీక్ సమస్యలు జాతీయ సమస్య అని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి చర్చలకు ముందుకొచ్చారు.

బీజేపీ ఆరోపణలపై స్పందిస్తూ, విద్యార్థులు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఉందని జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ అన్నారు.

రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు 7, 10 తేదీలలో అసెంబ్లీ వద్ద పికెటింగ్ చేయాలని ప్రతిపాదించడంతో, 6 నుంచి 12 వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అసెంబ్లీ భవనానికి 750 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు జారీ చేశారు.

ఇదిలా ఉండగా, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్‌సీ)లలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలన్న తమ డిమాండ్‌పై నిరసనకారులు ఆందోళన కొనసాగించారు.

జార్ఖండ్ లోకతాంత్రిక్ క్రాంతికారి మోర్చా (జేఎల్‌కేఎం) నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో చేపడుతున్న నిరాహార దీక్షలో ఇద్దరు మహిళలతో పాటు ఐదుగురు నిరసనకారులు చేరారు. ఆయన గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.

చర్చలకు 11 మందితో బృందం

ఇదిలా ఉండగా, విద్యార్థులు, ఉద్యోగార్థుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు 11 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గురువారం ప్రకటించారు.

చర్చల కోసం నిరసనకారులకు తమ ప్రభుత్వ ద్వారాలు తెరిచే ఉన్నాయని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

“చర్చల కోసం ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ప్రతిస్పందనగా, ఎనిమిది మంది విద్యార్థులు, ఇద్దరు నిపుణులు (జర్నలిస్టులు), ఒక న్యాయవాదితో కూడిన 11 మంది సభ్యుల ప్రతినిధి బృందాన్ని మేము ఏర్పాటు చేశాము” అని జేపీఎస్సీ–జేఎస్‌ఎస్‌సీ రిఫార్మ్స్ మంచ్ కార్యనిర్వాహక అధికారి ఒకరు తెలిపారు.

తాము శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నామని, కాబట్టి పాత్రికేయులు, న్యాయవాది పాత్ర కేవలం మార్గదర్శకత్వం అందించడానికే పరిమితమవుతుందని ఆ కార్యవర్గ సభ్యుడు అన్నారు.