విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో జూన్ 15 నుంచి బ్రేక్‌ఫాస్ట్, మిడ్డే మీల్ ప్రారంభం..
Telangana to Roll Out Breakfast and Mid-Day Meal Schemes on June 15
తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) పథకానికి’ శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 15వ తేదీ (సోమవారం) నుండి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అధికారికంగా ప్రారంభం కానుంది. ఇందుకోసం విద్యాశాఖ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. తొలి విడత కింద రాష్ట్రంలోని 1,269 ప్రభుత్వ పాఠశాలలు, 33 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో కలిపి మొత్తం 1,302 విద్యాసంస్థల్లో ఈ ఉచిత అల్పాహార పంపిణీ మొదలవుతుంది. దీని ద్వారా మొదటి దశలోనే 1,44,610 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
ఆదివారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు ఉదయం పూట విద్యార్థులకు ఈ వేడివేడి అల్పాహారం అందుతుంది. ఈ పథకాన్ని కేంద్రీకృత వంటశాలల (సెంట్రలైజ్డ్ కిచేన్లు) ద్వారా విడతల వారీగా కొత్త విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు విస్తరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో 39 చోట్ల ఈ ఆధునిక కిచెన్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.299.90 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న 7 కిచెన్లను ఆధునీకరిస్తుండగా, మిగిలిన వాటిని కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ ఖర్చులో 70 శాతం నిధులను ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన 30 శాతం మొత్తాన్ని భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థలు సమకూరుస్తున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టును తెలంగాణ విద్యా సంక్షేమ, మౌలికాభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రీ-ప్రైమరీ (పూర్వ ప్రాథమిక) స్థాయి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.720 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో అల్పాహారానికి రూ.540 కోట్లు, విద్యార్థులకు అందించే పాలకు రూ.180 కోట్లు కేటాయించారు. ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూ.56 కోట్లు కేటాయించడం విశేషం. విద్యార్థులకు వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ అందిస్తారు. ఇందులో ప్రీ-ప్రైమరీ నుండి ఐదో తరగతి వరకు 75 మి.లీ., ఆపై తరగతుల వారికి 100 మి.లీ. చొప్పున పాలు పంపిణీ చేస్తారు.
తొలి దశలో ఈ పథక నిర్వహణ బాధ్యతలను హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ట్రస్ట్, మన్నా ట్రస్ట్‌లకు అప్పగించారు. ఈ రెండు సంస్థలు కలిసి మొత్తం 8 జిల్లాల్లో అల్పాహారాన్ని పంపిణీ చేయనున్నాయి. ఇందులో హరే కృష్ణ మూమెంట్ ట్రస్ట్ వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని 1,162 పాఠశాలలతో పాటు 21 జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తుంది. అలాగే మన్నా ట్రస్ట్ హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని 107 పాఠశాలలు, 12 ప్రభుత్వ కళాశాలల్లో ఈ బాధ్యతలను నిర్వర్తించనుంది.
ఈ పథకంతో పాటు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం పాఠశాలలకే పరిమితమైన ‘మధ్యాహ్న భోజన పథకాన్ని’ ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కూడా విస్తరిస్తున్నారు. సోమవారం నుంచే తొలి దశ కింద 33 కళాశాలల్లో ఇది ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులకు భవిష్యత్తులో ఈ మధ్యాహ్న భోజనం అందనుంది.
విద్యార్థుల కోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిన ప్రత్యేక వీక్లీ మెనూ ఇలా ఉంది:
సోమవారం: 2 దోసెలు + చట్నీ లేదా సాంబారు
మంగళవారం: 2 మిల్లెట్ (చిరుధాన్యాల) ఇడ్లీలు + సాంబారు
బుధవారం: 2 పూరీలు + మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా
గురువారం: 2 బోండాలు + చట్నీ లేదా సాంబారు
శుక్రవారం: 2 ఇడ్లీలు + చట్నీ లేదా సాంబారు
శనివారం: ఉప్మా + చట్నీ లేదా సాంబారు (ప్రీ-ప్రైమరీ నుండి ఐదో తరగతి వరకు 150 గ్రాములు, 6 నుండి 12వ తరగతి విద్యార్థులకు 200 గ్రాముల చొప్పున ఉప్మా వడ్డిస్తారు).
ఈ పౌష్టికాహార కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడమే కాకుండా, వారిలో పోషకాహార లోపాన్ని నివారించడానికి ఎంతగానో దోహదపడుతుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు.