తెలుగు రాష్ట్రాలకు IMD రెయిన్ అలర్ట్.. రాబోయే ఐదు రోజులు వర్షాలు.. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Rain Fury Hits Hyderabad,Several Telangana Districts Under Yellow Alert as Heavy Rain Continues
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. నైరుతి రుతుపవనాల చురుకైన కదలికలతో పాటు వాతావరణంలో ఏర్పడిన పలు మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఐదు రోజులు రెండు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, వాతావరణం చల్లబడుతుందని అంచనా వేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం ప్రత్యేక హెచ్చరిక (Altert) జారీ చేసింది.
ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ వంటి పట్టణ, పరిసర జిల్లాలతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై ఈ వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు కోరారు.
ఇక ఏపీ రాష్ట్రంలో రాగల కొన్ని రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల ఉధృతి ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నందున, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు పాటించాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
వీటితో పాటు తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా రాబోయే గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, పిడుగుల ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇళ్ల నుండి బయటకు రాకూడదని యంత్రాంగం పటిష్ట హెచ్చరికలు జారీ చేసింది.