దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా.. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు..
US Strikes Iran After Apache Helicopter Incident, Tehran Hits Gulf Targets
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా అత్యంత ఉద్రిక్తంగా మారింది. హార్ముజ్ జలసంధి పరిధిలో, ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా వైమానిక దళానికి చెందిన ప్రతిష్టాత్మక అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ తన డ్రోన్ దాడి ద్వారా కూల్చివేయడం ఈ తాజా ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ చర్యను సహించేది లేదని, ఆ దేశంపై అత్యంత కఠినమైన రీతిలో దాడులు చేస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే అమెరికా దళాలు ఇరాన్ లక్ష్యాలపై మళ్లీ పెద్ద ఎత్తున వైమానిక దాడులకు దిగాయి.
అమెరికా జరిపిన ఈ దాడుల తీవ్రత ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధి పరిధిలోని క్వెష్మ్ ఐలాండ్‌తో పాటు ఇరాన్ వ్యూహాత్మక ఓడరేవు నగరమైన సిరిక్‌పై కూడా అమెరికా దళాలు విరుచుకుపడ్డాయని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. వీటితో పాటు జాస్క్ కౌంటీ సమీపంలోని ప్రముఖ బండార్ అబ్బాస్ నగరంలో కూడా భారీ పేలుడు సంభవించినట్లు ఇరాన్ వెల్లడించింది. తమ దేశ దక్షిణ భాగంలోని అనేక కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులకు పాల్పడుతోందని ఇరాన్ ఆరోపించింది. అయితే, తమ అపాచీ హెలికాప్టర్‌పై ఇరాన్ జరిపిన దాడికి దీటుగా సమాధానం చెప్పేందుకు ,అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ ఆత్మరక్షణ (Self-defense) విధానంలో భాగంగానే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.
ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అత్యంత ఘాటుగా స్పందించారు. తమ దేశ సార్వభౌమాధికారంపై జరుగుతున్న ఏ దాడినీ ఇరాన్ ఊరికే వదిలిపెట్టబోదని, ప్రతీకారం తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అమెరికా హెలికాప్టర్ కూలిపోయిన ఘటనను ఉదహరిస్తూ, పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న విదేశీ సైనిక దళాలన్నీ తక్షణమే అక్కడి నుండి వెనక్కి వెళ్లిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇరాన్ సైన్యం నుండి మరింత తీవ్రమైన సైనిక చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ బలగాలకు హార్ముజ్ జలసంధి ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లడం ఒక్కటే ఏకైక మార్గమని అబ్బాస్ అరాగ్చీ సూచించారు.
మరోవైపు, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. బహ్రెయిన్ దేశంలో ఉన్న అమెరికాకు చెందిన అత్యంత పటిష్టమైన ‘ఐదవ యూఎస్ ఫ్లీట్’ (5th US Fleet) సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు తెగబడింది. దీనితో పాటు జోర్డాన్, కువైట్ దేశాలపై కూడా ఇరాన్ మిస్సైళ్లతో దాడులు చేస్తోంది.
అయితే, తమ దేశంపైకి ఇరాన్ ప్రయోగించిన ఒక క్షిపణిని (Missile) తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా గాల్లోనే అడ్డుకుని కూల్చివేసాయంటూ జోర్డాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఆకస్మిక ,శరవేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాల వల్ల, అమెరికా ,ఇరాన్ దేశాల మధ్య శాంతి స్థాపన కోసం గత కొంతకాలంగా తెరవెనుక జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.