సామర్లకోట దుర్గాడ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కుమార్తెకు పెళ్లి కుదుర్చుకుని వస్తూ దంపతులు మృతి..
RTC Bus Overturns in Wanaparthy; RTC Executive Engineer Dies, 14 Injured
కుమార్తెకు పెళ్లి సంబంధం ఖాయమైందన్న ఆనందంతో ఇంటికి తిరిగి వస్తున్న దంపతులను లారీ రూపంలో మృత్యువు కబళించిన హృదయవిదారక ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. గొల్లప్రోలు మండలం దుర్గాడ జంక్షన్ సత్తెమ్మ ఆలయం సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సామర్లకోట అప్పయ్య చెరువు ప్రాంతానికి చెందిన జూరెడ్డి సూర్యనారాయణ స్థానిక ఎఫ్‌సీఐ గోదాములో కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన తన భార్య అరుణకుమారితో కలిసి ఆదివారం స్కూటీపై తుని సమీపంలోని తాళ్లూరికి వెళ్లారు. తమ ఏకైక కుమార్తె ధరణికి వివాహ సంబంధం మాట్లాడటానికి వెళ్లిన ఈ దంపతులు, అక్కడ పెళ్లి సంబంధం ఖాయం కావడంతో ఎంతో సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వారు ప్రయాణిస్తున్న స్కూటీ దుర్గాడ రోడ్డు జంక్షన్‌కు చేరుకోగానే ఒక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ సమయంలో సూర్యనారాయణ హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ, లారీ చక్రం తలపై నుంచి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అరుణకుమారిని ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది, ఆమె కూడా ప్రమాద స్థలంలోనే కన్నుమూశారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అతివేగంగా నడపడమే కాకుండా, ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. తమ ఏకైక కుమార్తెను డాక్టర్‌ను చేయాలనే బలమైన ఆశతో ఈ దంపతులు ఆమెను ఎంతో కష్టపడి చదివించారు. నీట్‌లో సీటు రాకపోవడంతో నిరాశపడకుండా, ప్రస్తుతం రాజమహేంద్రవరంలో బీఎస్సీ చేర్పించి హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. ఇంతలోనే మంచి సంబంధం కుదరడంతో పెళ్లి నిశ్చయించుకుని వస్తున్న సమయంలో ఈ ఘోరం జరగడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ దంపతుల హఠాన్మరణంతో అప్పయ్యచెరువు ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.