భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్..హైకోర్టులో నో రిలీఫ్ ..
Land Grab Case: No Immediate Relief for Ex-MLA Bolla Brahma Naidu Arrest
హైదరాబాద్ శివారు గండిపేటలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి నకిలీ జీవోలు (ప్రభుత్వ ఉత్తర్వులు) సృష్టించిన కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న ఆయన్ను సైబరాబాద్ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో ఎట్టకేలకు పట్టుకున్నారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో ఉన్న 9 ఎకరాల 28 గుంటల విలువైన సర్కారు భూమిని అక్రమంగా దక్కించుకోవడానికి బ్రహ్మనాయుడు తెరవెనుక పెద్ద వ్యూహమే నడిపినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వివాదాస్పద భూమిని క్రమబద్ధీకరించినట్లు నకిలీ జీవోలను సృష్టించి, ఆ ప్రతులను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పోలీసులు నిర్ధారించారు. దీనికి తోడు బ్రహ్మనాయుడి బ్యాంక్ ఖాతా నుండి ఈ భూమికి సంబంధించి రూ. 1.25 కోట్ల నగదు బదిలీ అయినట్లు ఆధారాలు లభించడంతో కేసు మరింత బలపడింది. గండిపేట తహసీల్దార్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా నర్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ భూకబ్జా కుట్ర కేసులో బ్రహ్మనాయుడు సహా మొత్తం 9 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా సైబరాబాద్ పోలీసులు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో ఉన్న బ్రహ్మనాయుడు నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఆయన అక్కడ అందుబాటులో లేకపోవడంతో పాటు, మిగిలిన నిందితులైన బొల్లా రమేశ్, కొవ్వూరు సునీల్, మరికొందరు కూడా పరారయ్యారు. నిందితులు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి తొలుత హైదరాబాద్ నుండి కేరళ, ఆపై తమిళనాడు, కర్ణాటక వంటి వివిధ రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. చివరకు గాలింపు తీవ్రం చేసి శుక్రవారం నాడు కాంచీపురంలో బ్రహ్మనాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
మరోవైపు, ఈ కేసులో అరెస్టు కాకుండా రక్షణ పొందడం కోసం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని, కోర్టు విధించే ఎలాంటి షరతులనైనా పాటిస్తానని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తు ముగిసే వరకు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం, ఈ వ్యవహారంపై పోలీసుల నుంచి పూర్తి వివరాలు, సూచనలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూన్ 11, 2026కి వాయిదా వేసింది.