Skip to content
ప్రపంచం వార్తలు

సముద్రం రక్తమోడింది.. ఫారో దీవుల్లో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత.. మండిపడుతున్న జంతు హక్కుల సంఘాలు..

Prajapaksham 04 Jun 2026 0 నిమిషాల పఠనం ప్రపంచం
సముద్రం రక్తమోడింది.. ఫారో దీవుల్లో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత.. మండిపడుతున్న జంతు హక్కుల సంఘాలు..

Over 700 Whales and Dolphins Killed in Controversial Faroe Islands Grind Hunt

నార్త్‌ అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవుల్లో సంప్రదాయం పేరిట జరిగిన ఒక ఘోరమైన సామూహిక వధ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడి ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే ‘గ్రైండాడ్రాప్‌’ ఉత్సవంలో భాగంగా కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్లను అత్యంత క్రూరంగా ఊచకోత కోశారు. మే 27న జరిగిన ఈ భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, వేలాది మూగజీవాల రక్తం ఓడటంతో సముద్ర తీరమంతా పూర్తిగా ఎర్రగా మారిపోయింది.

ప్రపంచ సముద్ర పర్యావరణ సంస్థ ‘సీ షెఫర్డ్’ అందించిన వివరాల ప్రకారం, టోర్షావన్‌లోని సాండెగెర్డి బే వద్దకు వేటగాళ్లు గుంపులుగా వచ్చి 402 పైలట్ తిమింగలాలను, నాలుగు బాటిల్‌నోస్ డాల్ఫిన్‌లను బలవంతంగా ఒడ్డుకు తోసుకుంటూ తీసుకువచ్చి వాటి శరీరాలను ముక్కలుగా చీల్చేశారు. ఇదే క్రమంలో స్కాలబోట్నూర్‌లో 168 వైట్ సైడెడ్ డాల్ఫిన్‌లు, హాల్విక్‌లో మరో 132 వైట్ సైడెడ్ డాల్ఫిన్‌లను అత్యంత అమానుషంగా చంపేశారు.

ఈ జంతువులను చంపేందుకు సాధారణంగా వాడే ప్రత్యేక ఆయుధాల కొరత ఏర్పడటంతో, వేటగాళ్లు ఇనుప కొక్కేలు, పదునైన కత్తులను ఉపయోగించి వాటి శరీరాలను నరికారు. ఆ తీవ్రమైన గాయాల నొప్పితో ఆ జీవులన్నీ సముద్రపు ఒడ్డున విలవిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదలడం అక్కడి వారి క్రూరత్వానికి అద్దం పడుతోంది. ఇంతటి భయానక రక్తపాతాన్ని చిన్న పిల్లలతో సహా వందలాది మంది స్థానికులు సముద్ర తీరంలో నిలబడి ఎంతో సాధారణంగా చూడటం గమనార్హం.

సీ షెఫర్డ్ సంస్థకు చెందిన ఫారో దీవుల డైరెక్టర్ వాలెంటీనా క్రాస్ట్ ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించారు. అమాయక జంతువులను ఇంత క్రూరంగా హింసించి చంపడాన్ని ఏ రకంగానూ సమర్థించలేమని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, ఈ క్రూరమైన సంప్రదాయాన్ని తక్షణమే చట్టబద్ధంగా నిషేధించాలని డిమాండ్ చేశారు.

ఫారో దీవుల స్థానికుల ప్రకారం ఈ సామూహిక వేట అనేది దాదాపు 1000 ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక సంప్రదాయం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు, పర్యావరణ వేత్తలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక మానవ సమాజంలో ఇలాంటి కాలం చెల్లిన, క్రూరమైన పద్ధతులను కొనసాగించడం అనాగరికమని వారు అభివర్ణిస్తున్నారు.

అమాయక సముద్ర జీవుల మారణహోమాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలంటూ అంతర్జాతీయ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ఈ సామూహిక వధ జరగడానికి కేవలం ఒక్క రోజు ముందే, ఫారోస్ పార్లమెంటులో డాల్ఫిన్ల వేటకు సంబంధించిన జంతు సంక్షేమ చట్టాన్ని సవరించడం మరింత వివాదాస్పదంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *