Skip to content
తాజా
నివురుగప్పిన నిప్పులా రగులుతున్న పశ్చిమాసియా.. ఇరాన్‌ డ్రోన్లపై అమెరికా భీకర దాడులు.. బ్యాంకు మోసాల కేసులు తగ్గినప్పటికీ రూ. 48,000 కోట్లు ఎలా మాయమయ్యాయి: ఆర్‌బిఐ నివేదిక భారత్‌- అమెరికా డీల్‌ ‘హైడ్రా’ భారీ ఆపరేషన్‌ ఫైనల్‌కు ఆర్‌సిబి నివురుగప్పిన నిప్పులా రగులుతున్న పశ్చిమాసియా.. ఇరాన్‌ డ్రోన్లపై అమెరికా భీకర దాడులు.. బ్యాంకు మోసాల కేసులు తగ్గినప్పటికీ రూ. 48,000 కోట్లు ఎలా మాయమయ్యాయి: ఆర్‌బిఐ నివేదిక భారత్‌- అమెరికా డీల్‌ ‘హైడ్రా’ భారీ ఆపరేషన్‌ ఫైనల్‌కు ఆర్‌సిబి
వార్తలు వార్తలు

నివురుగప్పిన నిప్పులా రగులుతున్న పశ్చిమాసియా.. ఇరాన్‌ డ్రోన్లపై అమెరికా భీకర దాడులు..

Prajapaksham 29 May 2026 1 నిమిషాల పఠనం వార్తలు
నివురుగప్పిన నిప్పులా రగులుతున్న పశ్చిమాసియా.. ఇరాన్‌ డ్రోన్లపై అమెరికా భీకర దాడులు..

టెహ్రాన్: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పతాక స్థాయికి చేరాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో ముప్పుగా మారిన ఇరాన్‌కు చెందిన నాలుగు డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు కూల్చివేసిన తర్వాత, బుధవారం ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా దళాలు తాజా రక్షణాత్మక దాడులు జరిపాయి. ఐదో డ్రోన్‌ను పంపడానికి సిద్ధంగా ఉన్న బందర్ అబ్బాస్‌లోని ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. తమ గగనతలంపైకి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను సమర్థంగా అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది.

దాదాపు మూడు నెలలుగా కొనసాగుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నికలు తనను తొందరపెట్టలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ తీవ్ర నిస్పృహతో చర్చలు జరుపుతోందని, వీకెండ్ లోగా ఒక ఒప్పందం కుదురుతుందన్న నమ్మకం ఉందని క్యాబినెట్ సమావేశానికి ముందు ఆయన వ్యాఖ్యానించారు. హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించి, ఇరాన్ అణు సామర్థ్యం క్షీణించిందని నిరూపించే బలమైన వాదనతో రిపబ్లికన్లకు రాజకీయ ప్రయోజనం చేకూర్చాలని ట్రంప్ భావిస్తున్నారు.

ఈ మిలిటరీ కవ్వింపులు ముదురుతున్న నేపథ్యంలోనే, పశ్చిమాసియా సంక్షోభానికి తెరదించేందుకు ఇరు దేశాల మధ్య ఒక ప్రాథమిక ఒప్పందం సిద్ధమైనట్లు సమాచారం. ఇరాన్ అణు కార్యక్రమాల నిలిపివేత, హొర్ముజ్ జలసంధి పునరుద్ధరణ వంటి ప్రధాన అంశాలతో 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పంద ముసాయిదాకు ఇరు వర్గాలు అంగీకరించాయని ఆక్సియోస్ మీడియా వెల్లడించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం కోసం వేచి ఉంది.

దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి ట్రంప్ రెండు రోజుల సమయం కోరారు. అయితే ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేత గురించి తాము ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరపడం లేదని ట్రంప్ స్పష్టం చేయగా, శ్వేతసౌధం అధికారులు ఈ ముసాయిదా వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. పరిస్థితి చేయి దాటిపోకముందే ఈ శాంతి ఒప్పందం అధికారికంగా ఆమోదం పొందితే, గత మూడు నెలల సంక్షోభం ముగింపునకు అది ఒక కీలక అడుగు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *