Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. ఏపీలోకి ఎప్పుడు ఎంటర్ అవుతాయంటే..

Prajapaksham 03 Jun 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. ఏపీలోకి ఎప్పుడు ఎంటర్ అవుతాయంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విశాఖ వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. రేపు (గురువారం) నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని, ఆ తర్వాత జూన్ 5వ తేదీన ఇవి రాయలసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్‌కుమార్‌ వెల్లడించారు. జూన్ 10వ తేదీ నాటికి ఇవి దక్షిణ కోస్తా అంతటా విస్తరిస్తాయని, జూన్‌ 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రాబోయే వారం రోజుల పాటు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతాయని, మరో ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఎండలు విపరీతంగా కాశాయి కాబట్టి వర్షాలు కూడా భారీగా పడతాయని చెప్పలేమని, ఎండల తీవ్రతకు, వర్షపాతానికి ఎలాంటి సంబంధం ఉండదని జగన్నాథ్‌కుమార్‌ వివరించారు.

ఇప్పటికే కేరళ రాష్ట్రంలో తొలకరి వర్షాలు కురుస్తుండగా, ఈ రుతుపవనాలు కేరళ, తమిళనాడు మీదుగా ఏపీలోకి ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కావలిలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో భీమిలిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రాబోయే మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున, ప్రజలు ఎవరూ చెట్లు, విద్యుత్ స్తంభాలు, ప్రకటనల హోర్డింగ్స్ క్రింద నిలబడరాదని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ప్రఖర్ జైన్ గట్టిగా సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *