Skip to content
బిజినెస్ వార్తలు

రాత్రికి రాత్రే IT కంపెనీ మూత.. 700 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..ఎట్టకేలకు CEO అరెస్ట్..

Prajapaksham 04 Jun 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
రాత్రికి రాత్రే IT కంపెనీ మూత.. 700 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..ఎట్టకేలకు CEO అరెస్ట్..

Pune IT Shocker: CEO Arrested After Firm Abruptly Closes, Leaving 700 Workers Unemployed

పుణెకు చెందిన ఐటీ స్టార్టప్ సంస్థ ‘థింక్ టెక్నాలజీ ఇండియా’ ముందస్తు నోటీసు ఏమీ ఇవ్వకుండా రాత్రికి రాత్రే తన కార్యకలాపాలను నిలిపివేసింది. కంపెనీ అకస్మాత్తుగా బోర్డు తిప్పేయడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, ఇంటర్న్‌లతో సహా 700 మందికి పైగా ఉద్యోగులు ఒకేసారి వీధిన పడ్డారు. జీతాల ఎగవేత, సెక్యూరిటీ డిపాజిట్ల పేరిట వసూళ్లు, చెక్కుల బౌన్స్ వంటి తీవ్ర ఆర్థిక అవకతవకల ఆరోపణలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. క్

రిమినల్ నమ్మకద్రోహం, మోసం కేసుల కింద కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను హింజవాడి పోలీసులు అరెస్ట్ చేశారు. కంపెనీలో పనిచేస్తున్న ఒక 25 ఏళ్ల ఇంటర్న్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగుచూసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఈఓతో పాటు కంపెనీ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్, ఒక హెచ్ఆర్ మేనేజర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు దాదాపు 30 మందికి పైగా ఉద్యోగులు, ఇంటర్న్‌లు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.

బాధిత ఉద్యోగుల కథనం ప్రకారం ఏప్రిల్ నెలలో కంపెనీ అకస్మాత్తుగా మూతపడింది. సిబ్బంది ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్లేసరికి కార్యాలయానికి తాళం వేసి ఉంది. యాజమాన్యం నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం గానీ, స్పష్టత గానీ లేకపోవడంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. 2025లో ప్రారంభమైన ఈ కంపెనీ, చేరిన కొత్తలో ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌లు, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియల పేరిట ఒక్కొక్కరి నుండి రూ. 15,000 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేసింది.

ప్రారంభంలో కొందరికి జీతాలు, స్టైపెండ్‌లు సకాలంలో చెల్లించి నమ్మకం కుదిర్చినప్పటికీ, జనవరి 2026 నుండి చెల్లింపులను పూర్తిగా నిలిపివేసింది. జీతాల బకాయిల కోసం కంపెనీ ఇచ్చిన చెక్కులు కూడా బ్యాంకుల్లో బౌన్స్ అయ్యాయి. దీనిపై నిలదీస్తే అంతర్గత ఆడిట్‌లు జరుగుతున్నాయని, ఫండ్స్ రావడం ఆలస్యమవుతోందని యాజమాన్యం తప్పుడు కారణాలు చెబుతూ కాలయాపన చేసింది.

కొత్త అభ్యర్థులను నిరంతరం రిక్రూట్ చేసుకుంటూ, వారి నుంచి వసూలు చేసిన సెక్యూరిటీ డిపాజిట్లను కంపెనీ రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం వాడుకుందని కార్మిక శాఖ అధికారులకు అందిన ఫిర్యాదులలో ఉద్యోగులు పేర్కొన్నారు. ఇంటర్న్‌లకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లు ఇవ్వకపోగా, ట్రైనింగ్ పీరియడ్‌కు సంబంధించిన స్టైపెండ్‌ను కూడా ఎగ్గొట్టారు. ఏప్రిల్ 20న బాధితులంతా కలిసి పుణె పోలీసులను ఆశ్రయించడంతో ఈ వంచనపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభమైంది.

ఉద్యోగుల డిపాజిట్ సొమ్మును ఎక్కడికి మళ్లించారు, కంపెనీ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో హింజవాడి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఒకేసారి వందల మంది ఐటీ ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఈ ఘటన పుణె టెక్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *