Skip to content
బిజినెస్ వార్తలు

ఫారెక్స్ నిల్వల కోసం బంగారాన్ని RBI అమ్మలేదు.. బ్లూమ్‌బర్గ్ కథనాన్ని ఖండించిన కేంద్ర ప్రభుత్వం..

Prajapaksham 03 Jun 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
ఫారెక్స్ నిల్వల కోసం బంగారాన్ని RBI అమ్మలేదు.. బ్లూమ్‌బర్గ్ కథనాన్ని ఖండించిన కేంద్ర ప్రభుత్వం..

Centre Debunks Report Claiming RBI Sold Gold to Boost Forex Reserves

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్‌) నిల్వలను కాపాడుకోవడానికి పెద్దఎత్తున బంగారం విక్రయించినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ వార్తాసంస్థ ‘బ్లూమ్‌బెర్గ్‌’ ప్రచురించిన కథనాన్ని తోసిపుచ్చుతూ.. అందులోని అంశాలు పూర్తి అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా భారతదేశ ఇంధన దిగుమతుల బిల్లు భారీగా పెరిగిందని, అదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు మన ఈక్విటీలను విక్రయించి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుపోతున్నారని బ్లూమ్‌బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది. ఈ కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్‌కు గిరాకీ విపరీతంగా పెరిగి రూపాయి విలువ క్షీణిస్తోందని, ఫలితంగా దేశీయ ఫారెక్స్‌ నిల్వలు పడిపోతున్నాయని వివరించింది. ఈ నేపథ్యంలోనే క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలను ఆదుకోవడానికి ఆర్‌బీఐ తన వద్ద ఉన్న 12 బిలియన్‌ డాలర్ల విలువైన పసిడిని విక్రయించిందంటూ సదరు వార్తాసంస్థ కథనాన్ని ప్రచురించింది.

అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆర్‌బీఐ గణాంకాలను ఉదహరిస్తూ.. కేంద్ర బ్యాంక్ వద్ద ఉన్న ఫారెక్స్‌ నిల్వల్లో బంగారం వాటా 2025లో 13.92 శాతంగా ఉండగా, అది 2026 మార్చి 31 నాటికి 16.70 శాతానికి పెరిగిందని వెల్లడించింది. అంతేకాకుండా, మే 22 నాటికి ఈ పసిడి నిల్వల వాటా మరింత వృద్ధి చెంది 16.85 శాతానికి చేరినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్‌బీఐ తన వద్ద ఉన్న భౌతిక బంగారం (ఫిజికల్‌ గోల్డ్‌) వివరాలను ఎప్పటికప్పుడు ప్రతి నెలా విడుదల చేసే అధికారిక బులెటిన్‌లో బహిరంగంగా వెల్లడిస్తోందని, ప్రస్తుత తేదీ వరకు అందులో ఎలాంటి విక్రయాలు లేదా మార్పులు జరగలేదని వివరించింది. అందువల్ల సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఏదైనా అధికారిక సమాచారం కోసం నేరుగా ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *