ఐరాస భద్రతా మండలి నుంచి పాకిస్థాన్ ఔట్.. కిర్గిస్తాన్ తొలిసారిగా ఎంట్రీ.. కొత్తగా ఐదు దేశాల ఎన్నిక
Pakistan to Leave UNSC Following Election of Five New Non-Permanent Members
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) లో తాత్కాలిక సభ్య దేశాల మార్పునకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ భద్రతా మండలి నుంచి పాకిస్తాన్ వైదొలగనుండగా, ఇస్లాం దేశమైన కిర్గిస్తాన్ తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక మండలిలో సభ్యత్వం దక్కించుకుని చరిత్ర సృష్టించింది. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాల ఎంపిక కోసం ఈ నెల 3న జరిగిన ఐక్యరాజ్యసమితి ఓటింగ్ వివరాల ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ సహా ఐదు దేశాలు తమ సభ్యత్వ కాలపరిమితిని పూర్తి చేసుకోనున్నాయి. వాటి స్థానంలో కొత్తగా మరో ఐదు దేశాలు మండలిలోకి అడుగుపెట్టబోతున్నాయి.
ప్రస్తుతం తాత్కాలిక సభ్యులుగా ఉన్న పాకిస్తాన్, పనామా, డెన్మార్క్, గ్రీస్, సోమాలియా దేశాల రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. దీంతో వచ్చే ఏడాది నుండి భద్రతా మండలిలో ఈ దేశాలకు ప్రాతినిధ్యం ఉండదు. వీరి స్థానాన్ని భర్తీ చేస్తూ కొత్తగా ఎన్నికైన ఆస్ట్రియా, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే, కిర్గిస్తాన్ దేశాలు జనవరి 1, 2027 నుండి డిసెంబర్ 31, 2028 వరకు రెండేళ్ల కాలపరిమితితో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యులుగా కొనసాగుతాయి.
ఈ ఎన్నికల్లో ఖాళీగా ఉన్న ఐదు స్థానాల కోసం మొత్తం ఏడు దేశాలు పోటీ పడ్డాయి. నిబంధనల ప్రకారం పోటీ పడే ప్రతి దేశం ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలోని సభ్య దేశాల నుంచి కనీసం మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీ ఓట్లను సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆస్ట్రియా, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే దేశాలు సులువుగానే విజయం సాధించి నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. అయితే, మిగిలిన ఒకే ఒక్క స్థానం కోసం కిర్గిస్తాన్, ఫిలిప్పైన్స్ దేశాల మధ్య తీవ్ర ఉత్కంఠ భరితమైన పోటీ నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అదనంగా మూడు రౌండ్ల పాటు ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. చివరకు ఫిలిప్పైన్స్పై కిర్గిస్తాన్ విజయం సాధించి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మొదటిసారిగా అడుగుపెట్టే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
అంతర్జాతీయంగా దేశాల మధ్య శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రపంచ రక్షణను పర్యవేక్షించడానికి అత్యున్నత అధికారాలు కలిగిన ఈ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. ఇందులో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ , ఫ్రాన్స్ దేశాలకు శాశ్వత సభ్యత్వంతో పాటు వీటో (Veto) అధికారం ఉండగా, మిగిలిన 10 స్థానాలను ప్రాంతాల వారీగా తాత్కాలిక సభ్య దేశాలతో అంతర్జాతీయ ఓటింగ్ ద్వారా భర్తీ చేస్తారు.