Skip to content
తెలంగాణ వార్తలు

నిజామాబాద్‌లో తీవ్ర విషాదం.. మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి

Prajapaksham 05 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
నిజామాబాద్‌లో తీవ్ర విషాదం.. మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి

Tragedy in Nizamabad: Three Drown While Bathing in Manjira River

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతవగా.. వారిలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మంగల్ కిష్టాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది గ్రామీణులు, బాన్సువాడ మండలం బుడిమి శివారులో ప్రవహిస్తున్న మంజీరా నది వద్ద ఉన్న ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం కుటుంబానికి చెందిన భానుప్రసాద్, అనిత (40), పావని (14), శివాని (13) నదిలో స్నానం చేయడానికి దిగారు.

అయితే, నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, లోతును అంచనా వేయలేకపోవడంతో నలుగురూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్నవారు గమనించి వెంటనే కేకలు వేయడంతో స్థానికులు, జాలరులు నదిలోకి దూకి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారు భానుప్రసాద్‌ను ప్రాణాలతో రక్షించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగలిగారు.

కానీ, మిగిలిన ముగ్గురు అనిత, పావని, శివానిలు అప్పటికే నీట మునిగి శ్వాస ఆడక మరణించారు. స్థానికులు శ్రమించి వారి ముగ్గురి మృతదేహాలను నది నుండి బయటకు వెలికితీశారు. దైవదర్శనానికి వచ్చి, కళ్లముందే ముగ్గురు ఆడవాళ్లు విగతజీవులుగా మారడంతో మంగల్ కిష్టాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.