Bandi Sanjay: నెక్ట్స్ టార్గెట్ బండి సంజయ్…బీఆర్ఎస్ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో సంచలన పోస్ట్..
Bandi Sanjay: నెక్ట్స్ టార్గెట్ బండి సంజయ్...బీఆర్ఎస్ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో సంచలన పోస్ట్..
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత ఇప్పుడు ఇతర మంత్రుల పైన కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మంత్రులను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు తమ సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్టులు పెడుతున్నాయి. తాజాగా భారత రాష్ట్ర సమితి తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత బండి సంజయ్ టార్గెట్ అవుతున్నారని ఆయన మోడీతో కలిసి ఉన్న ఒక వీడియోను షేర్ చేశారు. అయితే ఇది భారత రాష్ట్ర సమితి అధికారిక ఎక్స్ ఖాతాలోనే పోస్ట్ చేయడం గమనార్హం. . దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది అని చెప్పవచ్చు. ఇటీవల బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఫోక్సో కేసులో నిందితుడిగా అరెస్టై జైలుకు వెళ్లారు. అనంతరం బెయిల్ పైన విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్ర సమితి తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో తీవ్రమైన ఫోక్సో కేసు లాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న నిందితుడికి తండ్రిగా ఉన్న బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలనే అర్థం వచ్చేలా ఈ పోస్టు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
నిజానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందుకే నైతిక బాధ్యత వహిస్తూ, ఆయన రాజీనామా చేయాలి అంటూ గతంలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ప్రస్తుతం నీట్ ఎగ్జాం పేపర్ లీకేజీ వ్యవహారంలో సాగిన పెద్ద ఉద్యమం కారణంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రుల పైన భవిష్యత్తులో రాజీనామాల ఉద్యమం వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.