విద్యావ్యవస్థపై క్రూర పరిహాసం
Bihar protest
ఇంతకాలం సమస్యల్ని, విద్యాలయాల్లో కనీస వసతులను పట్టించుకోని ప్రభుత్వాలు ఇప్పుడు విద్యార్థుల ఆందోళన అంటే ఉలిక్కిపడుతున్నాయి. ఆల్ఫా జీ (పాఠశాల విద్యార్థులు) జన్ జీ (హైస్కూలు, కాలేజీ విద్యార్థులు) రోడ్డెక్కగానే మంత్రులు పరుగుపరుగున వచ్చి చర్చలు జరుపుతున్నారు. ఇది ముఖ్యంగా ఉత్తరాదిన బిజెపి పాలిత రాష్ట్రాల్లో కనిపిస్తున్నది. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) జంతర్‌మంతర్ ఆందోళన కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించడం తెలిసిందే. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో అటువంటి తొలి ఘటన. విద్యార్థుల పార్లమెంట్ మార్చ్ (జులై 25) సందర్భంగా శృతిమించిన పోలీసు హింసపై సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి దర్యాప్తు ఆదేశించగా, విద్యార్థులపై కేసులు ఉపసంహరణ హామీని పూర్తిగా అమలు చేయకుండా హోంశాఖ ఠలాయిస్తున్నది. దీనిపై మరోసారి ఆందోళనను సిజెపి హెచ్చరించింది. ఇదిలా ఉండగా, యువతరం ఆందోళన వారి తల్లిదండ్రులను ప్రభావితం చేస్తే ఓట్లు కోల్పోతామని భయపడుతున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ తల్లిదండ్రులకు విజ్ఞప్తులతో పాటు విద్యార్థులతో సంబంధాలు వృద్ధి చేసుకోవాలని నిర్ణయించాయి. మంత్రులు రోజుకొక యూనివర్సిటీ సందర్శించి విద్యార్థులతో సంభాషించి వారి సమస్యలు, మనోభావాలు తెలుసుకోవాలని బిజెపి జాతీయ కార్యవర్గం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో నిర్ణయం తీసుకుందంటే, సిజెపి ఆందోళన పిలుపుకు వచ్చిన స్పందన బిజెపి పునాదులను ఎంతగా కుదిపిందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టిఎ) ప్రక్షాళన, పోటీ పరీక్షల నిర్వహణను కట్టుదిట్టం చేసేందుకై నందన్ నీలేకని అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రసంగంలో ప్రధాని మోదీ యువతను ప్రత్యేకించి ప్రస్తావించి వివిధ పరీక్షలకు ప్రకటించిన ఆన్‌లైన్ కోచింగ్, కోటిమందికి ఎఐ ఆధారిత శిక్షణ వగైరా అన్నీ ప్రభుత్వ జఢత్వాన్ని వదలగొట్టిన ఈ దేశ యువత శాంతియుత ఆందోళన ఫలితాలే.
అయితే ఎదురులేని, తిరుగులేని వ్యక్తిగా ఏకపక్ష పాలన సాగిస్తున్న మోదీలో మార్పుకు కారణం విద్యావ్యవస్థను మెరుగుపరిచే సత్సంకల్పం కన్నా కోల్పోయిన సానుభూతిని బుజ్జగింపు రాజకీయాలతో తిరిగి పొందే ప్రయత్నం. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ మంత్రిత్వశాఖ కింద పోటీ పరీక్షలకు పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ పథకం ఇప్పటికే ఉంది. మూడేళ్లలో 10,500 మంది అభ్యర్థుల నమోదు దానికి నిర్దేశించిన లక్ష్యం. అయితే 2790 మంది అభ్యర్థులే నమోదైనట్లు, పర్యవసానంగా దాని బడ్జెట్ ఏటేటా కోత పెట్టినట్లు ఆ మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆగస్టు 10న పార్లమెంటుకు సమర్పించిన నివేదిక వెల్లడించింది. తల్లిదండ్రులపై కోచింగ్ ఫీజుల భారం ప్రధానికి ఇప్పుడే గుర్తుకొచ్చిందా? పై అనుభవాన్ని బట్టి ప్రధాని కొత్త హామీ నెరవేరుతుందని ఎవరైనా ఆశించగలరా?
విద్యార్థుల ఆందోళనలను అణచివేసేందుకు పోలీసును ప్రయోగించే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు విద్యార్థులు అనగానే ఉలిక్కిపడుతున్నాయి. రాజస్థాన్‌లో పాఠశాల తనిఖీకి వెళ్లిన సిజెపి నాయకులపై బిజెపి కార్యకర్తలు మూర్ఖంగా దాడి చేసిన మరునాడే మంత్రి అక్కడికి వెళ్లి విద్యార్థులకు వసతులు ఆదేశించారు. మధ్యప్రదేశ్ స్కూల్ పిల్లలు ప్లకార్డులు చేబూని ప్రదర్శన తీయగానే మంత్రి పరుగున వెళ్లి వాళ్ళ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. చత్తీస్‌ఘడ్ దుర్గ్ జిల్లాలో ఆల్ఫాతరం పిల్లలు తల్లిదండ్రుల అండతో ప్రదర్శన జరపగానే స్కూలు విద్యామంత్రి హుటాహుటిన వెళ్లి స్కూలు హెడ్మాస్టర్‌ను బదిలీ చేశారు. అర్హత గల టీచర్లను నియమించారు. ఇదిలావుండగా, బిహార్‌లో విద్యార్థుల ఆందోళనపై అణచివేత చర్యలకు పాల్పడిన బిజెపి ముఖ్యమంత్రి దిగి వచ్చారు. స్కూల్ పరీక్షల బోర్డు పరీక్షలో ఉత్తీర్ణతకు అర్హత మార్కులు సాధించని విద్యార్థుల మార్కు షీట్లపై “ఫెయిల్” అని రాయకుండా, “నైపుణ్య శిక్షణకు అర్హులు” అని రాయాలని నిర్ణయించారు. టీచర్లు విద్యార్థుల మధ్య నిత్య సంబంధం కోసం 9 తరగతుల వారి కోసం “విద్యా సాథి” యాప్ కూడా ప్రారంభించారు, శనివారం స్కూలు సమయాన్ని ఒంటి పూటకు పరిమితం చేశారు. పరీక్షల సంస్కరణల కోసం నిపుణుల కమిటీ నియమించారు. కొన్ని రాష్ట్రాలు విద్యా బడ్జెట్‌ను పెంచాయి.
ప్రశ్నాపత్రాల లీకేజీ సమస్యలపై ఇంతరగడ, దిద్దుబాటు చర్యలు జరుగుతున్నా ఆ అవినీతి చోర కళ యథావిథిగా జరుగుతూనే ఉంది. చత్తీస్‌ఘడ్‌లోని ఇందిరాగాంధీ కృషీ విద్యాలయం బిఎస్‌సి అగ్రికల్చరల్ మొదటి సంవత్సరం పరీక్ష రద్దు చేసింది. ఇది ఆ యూనివర్శిటీలో 20 రోజుల్లో మూడవ ఉదంతం. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నాపత్రం లీకేజీ రూఢీ కావడంతో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్ పరీక్షలు రద్దు చేసింది. ఈ పరిస్థితులు మన విద్యావ్యవస్థ తీరుతెన్నులపై క్రూరమైన పరిహాసం!