Skip to content
ఎడిట్ పేజి వార్తలు

‘వందేమాతరం’ గేయం ఆలాపన

Prajapaksham 25 Aug 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
‘వందేమాతరం’ గేయం ఆలాపన

Vande Mataram Telugu lyrics

భారతీయ జనతాపార్టీకి ఈ రోజున అధికారం ఉండవచ్చు. తన బ్రాండ్‌ దేశభక్తి ఎజండాను చట్టం ద్వారా దేశంపై విధించవచ్చు. రేపు అధికారం పోతే మరో పార్టీ లేదా పార్టీల కూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తే అది ఎవరికి అవమానం బిజెపికా లేదా స్వాతంత్య్రోద్యమంలో ప్రజలను పోరాటోనుఖులను చేసిన సుప్రసిద్ధ ‘వందేమాతరం’ గేయానికా? వందేమాతరం గేయం మొత్తం ఆరు చరణాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుగా పాడాలని, ఆ తర్వాతే జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపించాలని నరేంద్రమోదీ ప్రభుత్వం ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఒక బిల్లు ఆమోదించింది. ఆ తర్వాత ఆగస్టు 15న ఎర్రకోటనుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకం ఆవిష్కరణ తదుపరి ఆ గేయం పూర్తిగా తొలిసారి ఆలాపించబడింది. అలాగే పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా కూడా పూర్తిగా ఆలాపించబడింది. దారి నిడివి మూడు నిముషాల 10 సెకండ్లు వస్తుంది. పార్లమెంటు ఆమోదించిన బిజెపి చట్టం ప్రకారం జాతీయ గేయాలాపనకు ఆటంకం కలిగించినా లేక అవమానించినా అది క్రిమినల్‌ నేరం, మూడేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా రెండూ విధించవచ్చు. కాగా ఎఐసిసి కార్యాలయంలో స్వాతంత్య్రదినాన జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం 97 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న ‘వందేమాతరం’ తొలి రెండు చరణాల ఆలాపన అనంతరం ఆపివేశారు. కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీ మిగతా చరణాల ఆలాపనను ఆపుచేయించారని బిజెపి ఆరోపించింది. ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కూడా రిజిస్టర్‌ చేశారు. కాగా ఆగస్టు 19న జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, 1937లో కాంగ్రెస్‌ తీర్మానించినట్లు పార్టీ కార్యక్రమాలన్నిటిలోనూ తొలి రెండు చరణాలే పాడాల న్న నిర్ణయాన్ని పునరుద్ఘాటించింది. ఆగస్టు 22న జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగింది. వందేమాతరం వారసత్వాన్ని గౌరవిస్తామని, కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలకోసం జాతీయ గేయాలాపనను కుదించటాన్ని అనుమతించబోమని తీర్మానించింది. అంతేనా? వందేమాతరం చరిత్ర, అర్థం, జాతీయ ప్రాముఖ్యతను నెలరోజులపాటు చేబట్టే జాతీయ ప్రచార కార్యక్రమంలో దేశమంతటా వివరిస్తూ, కాంగ్రెస్‌ను ఎండగట్టాలని కూడా నిర్ణయించింది.
రెండు చరణాలకు బదులు మొత్తం ఆరు చరణాలు ఆలాపించే వారు ఎక్కువ దేశభక్తులా? బిజెపి గురుపీఠం ఆర్‌ఎస్‌ఎస్‌ క్విట్‌ ఇండియా ఉద్యమం సహా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. పైగా బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పాలకులకు సహకరించారు. వారి నాగపూర్‌ కేంద్ర కార్యాలయంలో కొద్ది సంవత్సరాల క్రితం నుంచి తప్ప అనేక దశాబ్దాలపాటు కాషాయ జెండా తప్ప జాతీయ జెండా ఎగురవేయలేదు. దేశ స్వాతంత్య్రపోరాటంలో ఎన్నో త్యాగాలు చేసిన భారత జాతీయ కాంగ్రెస్‌ వారసులకన్నా, ఇతర సంస్థలకన్నా తామే అధిక దేశభక్తులమని బిజెపివారు చెప్పుకోవటం హాస్యాస్పదం కాదా? అంతేనా? కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పుష్కరకాలానికిగాను వారికి వందేమాతరం రాజకీయ అవసరంగా గుర్తుకు రాలేదు! ఈ ప్రయత్నం తమ ‘హిందూ రాష్ట్ర దేశం’ ఎజండా అమలులో భాగం. అందుకే వారు రాజ్యాంగం పీఠికనుంచి ‘సెక్యులర్‌, సోషలిస్టు’ పదాలు తొలగించాలని ప్రచారం చేబట్టారు. భారతదేశం ‘లౌకిక రాజ్యం’ గా రాజ్యాంగం నిర్దేశించింది. అంటే పాకిస్థాన్‌లాగా మతరాజ్యం కాదు. కాని ఆచరణలో హిందూమత రాజ్యం చేయటానికి వీరు వీలైనన్ని దొడ్డిత్రోవలన్నీ వెదుకుతున్నారు.
‘వందేమాతరం’ గేయాన్ని బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ 1875లో సంస్కృతం, బెంగాలీ భాషల్లో రచించారని అందరికీ తెలుసు. అయితే బ్రిటీష్‌ ప్రభుత్వంలో పనిచేస్తున్న బంకించంద్ర తన ‘ఆనంద మఠం’ నవలలో సన్యాసుల తిరుగుబాటును చిత్రిస్తూ ఆ గేయం రచించారు. ఆ నవల 1882లో ప్రచురించబడింది. 1896లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ దానికి సంగీతం కూర్చి పాడారు. 1905లో బ్రిటీషు ప్రభుత్వం బెంగాల్‌ ప్రావిన్స్‌ను విభజించింది. దానికి వ్యతిరేకంగా బెంగాలీలు ఉవ్వెత్తున ఉద్యమించారు. ఆ ఉద్యమంలో ఈ గేయం మకుటం ‘వందేమాతరం’ (అమ్మా నీకు వందనం) ప్రేరణాత్మక నినాదం అయింది. ఆ తదుపరి జాతీయోద్యమాన్ని అది గొప్పగా ఉత్తేజితం చేసింది. ఆ గేయం తొలి రెండు చరణాలు దేశాన్ని, ప్రకృతిని రమణీయంగా వర్ణించగా, మిగతా చరణాలు హిందువుల ఆరాధ్యదైవం దుర్గామాతను కీర్తిస్తూ సాగుతాయి. అయితే మనది బహుళ జాతుల, సంస్కృతుల దేశం. హిందువులు విగ్రహారాధకులైతే ముస్లింలు, క్రైస్తవులు తదితర మైనారిటీలు విగ్రహారాధకులు కాదు. దాన్ని అందరికీ ఆమోదయోగ్యం చేసేందుకై 1937లో అప్పటి కాంగ్రెస్‌ నాయకులు పండిట్‌ నెహ్రూ, మహాత్మాగాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, వల్లభాయి పటేల్‌ (అందరూ నిఖార్సయిన హిందువులే సుమా!) దాన్ని తొలి రెండు చరణాలకు పరిమితం చేశారు. రాజ్యాంగ సభ చైర్మన్‌ డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ 1950 జనవరి 24న మొదటి రెండు చరణాలను అధికారికంగా రాజ్యాంగ సభకు అందజేశారు. రాజ్యాంగ సభ జనగణమనను జాతీయ గీతంగా, వందేమాతరాన్ని తత్సమాన హోదా యిస్తూ జాతీయ గేయంగా గౌరవించారు. స్వాతంత్య్రం తదుపరి అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో వందేమాతరం, ముగింపులో జనగణమన నిరభ్యంతరంగా ఆలాపించబడుతున్నాయి. ముస్లింలను బుజ్జగించేందుకు వందేమాతరాన్ని రెండు చరణాలకు కుదించారనేది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపణ. ఇప్పుడు కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం అదే పాడుతున్నదని నిందిస్తున్నది. హిందూ రాష్ట్రం ఎజండాతో హిందువులను మతం పేరుతో ఒకగొడుగుకిందకు తెచ్చే విధంగా సమాజాన్ని విభజిస్తున్న బిజెపి కాంగ్రెస్‌వి ఓటుబ్యాంక్‌ రాజకీయాలని నిందించటం విడ్డూరంగా లేదూ!
బిజెపి వారు ఒక ఉదంతం గుర్తు చేసుకోవాలి. 1960 దశకంలో సినిమా థియేటర్స్‌లో చలనచిత్ర ప్రదర్శన ముగిశాక జనగణమన పాడాలని, ప్రేక్షకులందరూ లేచినిలబడి గౌరవం చాటాలని ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదేశించింది. అయితే సినిమా ముగియగానే ప్రేక్షకులు వెళ్లిపోతుంటే కొంతకాలం పోలీసుల్ని కూడా పెట్టారు. ఆ తర్వాత ఆ విఫలప్రయత్నం విరమించుకున్నారు. అదే గతి వందేమాతరానికి కూడా పట్టకుండా మోదీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటే మంచిది. గీతాలాపనతో దేశభక్తిని ముడిపెట్టటం మూర్ఖత్వమని గ్రహించగలరు. పైగా అది సంస్కృత పద భూయిష్టం. మోదీ పట్ల గౌరవంతో పాడాలనుకున్నా, అత్యధిక మెజారిటీ ప్రజలకు నోరు తిరగదు!

ట్యాగ్‌లు: editorial Vande Mataram