Skip to content
ఎడిట్ పేజి వార్తలు

ఝార్ఖండ్‌ ఆందోళన పరిష్కారంలో చిక్కుముడి

Prajapaksham 22 Aug 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఝార్ఖండ్‌ ఆందోళన పరిష్కారంలో చిక్కుముడి

Students Protest

నీట్‌ తదితర పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజి, పరీక్షల రద్దుపై నరేంద్రమోదీ ప్రభుత్వం మెడలు వంచటంలో ఢిల్లీలో సిజెపి పిలుపుపై విద్యార్థులు, యువత ఆందోళన సఫలం కావటాన్నుండి స్ఫూర్తిపొందిన ఝార్ఖండ్‌ రాష్ట్ర విద్యార్థులు చేబట్టిన ఆందోళన విద్యార్థులు, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంతో ఈనెల 18న ముగిసింది. ఆ ఒప్పందానుసారం ప్రభుత్వం 22 రిక్రూట్మెంట్‌ పరీక్షలను, రిక్రూట్మెంట్‌ను రద్దుచేస్తూ, మరో 22పరీక్షలు అవకతవకలపై దర్యాప్తుకు ఆదేశిస్తూ 19వ తేదీన ఉత్తర్వులు చేసింది. దేవేంద్ర మహతో తన 16 రోజుల నిరాహార దీక్ష విరమించారు. ఢిల్లీ ఆందోళనలో దెబ్బతిన్న బిజెపి ఝార్ఖండ్‌ ఆందోళనలో చేరి ఢిల్లీ ఉద్యమాన్ని మించి దీనికి ప్రచారం ఇవ్వటానికి ప్రయత్నించింది. ఝార్ఖండ్‌ జెఎంఎం ప్రభుత్వంలో కాంగ్రెస్‌ పార్టీ భాగస్వామిగా ఉన్నందున, రాహుల్‌గాంధిని అప్రతిష్ట పాల్జేయటానికి ప్రయత్నించి భంగపడింది. ప్రభుత్వం విద్యార్థి నాయకుల ఒప్పందంతో విద్యార్థు లు ఆందోళన విరమించటంతో శుభం కార్డు పడిందని భావించబడింది. అయితే గతంలో నోటిఫికేషన్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారు తమ పొట్టకొట్టటం అన్యాయం, చట్టవిరుద్ధమంటూ హైకోర్టును ఆశ్రయించటం, రిక్రూట్మెంట్లను రద్దు చేసిన ప్రభుత్వ ఉత్తర్వుపై జస్టిస్‌ దీపక్‌ రోషన్‌ 20వ తేదీన స్టే విధించటంతో ప్రభుత్వ చర్యకు బ్రేకుపడింది. హైకోర్టు స్టే విధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జెపిఎస్‌ఇ 11వ, 13వ పరీక్షల ద్వారా చేసిన నియామకాలు, ఆహార భద్రత అధికారుల నియామకానికి సంబంధించినవి. సమాధానం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ,
తదుపరి విచారణను న్యాయమూర్తి సెప్టెంబర్‌ 15కు వాయిదా వేశారు. ఆ రోజున, ఒక వేళ
తీర్పు యిస్తే అది మైలురాయి కాగలదు.
విచారణ సందర్భంలో న్యాయమూర్తి మౌఖికంగా చేసిన వ్యాఖ్యలు గమనార్హం. మొత్తం విషయాన్ని దర్యాప్తు చేయటానికి రాష్ట్రప్రభుత్వమే సిఐడిని ఆదేశించినపుడు, ఏ పర్మినెంట్‌ ఉద్యోగినీ సహజన్యాయం సూత్రాన్ని పాటించకుండా తొలగించటానికి వీల్లేదు. ఈ సమస్యకు సంబంధించి యదార్థ నిర్థారణ రిపోర్టు ఏమైనా ఉందా, కేవలం ఒక ఉత్తర్వు జారీ చేయటం ద్వారా ప్రభుత్వం పర్మినెంట్‌ ఉద్యోగిని తొలగించగలదా? అని ప్రశ్నించారు. పరీక్షలు, నియామకాల రద్దుకు చట్టప్రకారం అనుసరించాల్సిన క్రమాన్ని పాటించలేదని వ్యాఖ్యానించారు. ఇదిచాలా సమంజసమైన ప్రశ్న. ఇది ఏ రాష్ట్రానికైనా వర్తిస్తుంది. ఆందోళన విరమింపజేసేందుకై రాష్ట్రప్రభుత్వం కుట్రపూరితంగా తమను దగా చేసిందని ప్రతిపక్ష బిజెపి, విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీ ఆందోళనకు విద్యార్థులు, యువత ఆన్‌లైన్‌ సందేశాలతో భావోద్వేగంతో తమంతటతాము సమీకృతులైనారు. ఝార్ఖండ్‌ ఆందోళన తద్భిన్నం, బహు నాయకత్వంతో నడిచింది. జెపిఎస్‌సి రిఫామ్‌ మంచ్‌ జులై 25న రాంచీలో జైపాల్‌సింగ్‌ స్టేడియంలో ఆందోళన ప్రారంభించింది. కునాల్‌ ప్రతాప్‌సింగ్‌ దాని నాయకుడు. 14వ జెపిఎస్‌సి తదితర పరీక్షల రద్దు, సిబిఐచేత లేదా రాష్ర్టేతర రిటైర్డ్‌ జడ్జీలతో విచారణ వారి ప్రధాన డిమాండ్‌. ఆందోళన విస్తరించిన సమయంలో దేవేంద్రనాథ్‌ మహతో నిరాహారదీక్షవల్ల ఆయన గ్రూపు ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆయన కొత్త రాజకీయ పార్టీ లోక్‌తాంత్రిక్‌ క్రాంతికార్‌ మోర్చాకు చెందినవారు. టైగర్‌ మహతోగా పిలవబడే జైరాం మహతో గ్రూపు ఆగస్టు రెండవ వారంలో చురుకుదనం పొందింది. వీరు రిఫామ్‌ మంచ్‌కి వ్యతిరేకులు. మరికొన్ని స్వతంత్ర గ్రూపులు కూడా ఉన్నాయి. బిజెపి, దాని విద్యార్థి విభాగం ఎబివిపి వంటి రాజకీయ మద్దతుదారులు ఉండనే ఉన్నారు.
జులై 2న ప్రకటించిన జెపిఎస్‌సి పిటి ఫలితాల్లో అవకతవకల ఆరోపణలతో ప్రారంభమైన విద్యార్థుల ఆందోళన అనేక మలుపులు తిరిగి ఆగస్టు 18న ప్రభుత్వంతో ఒప్పందంతో ముగిసింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను సంతృప్తిపరిచేందుకై ప్రభుత్వం వారితో చేసుకున్న నియామకాల రద్దు ఒప్పందాన్ని అనుసరించి జారీ చేస్తున్న ఉత్తర్వులను ఉద్యోగ నియామకం పొందినవారు హైకోర్టులో సవాలు చేయటం, ప్రభుత్వ ఉత్తర్వులను (ఇప్పటికి రెండు) కోర్టు నిలుపుచేయటంతో సమస్యకు మళ్లీ చిక్కుముడి పడింది. ఈ పరిణామం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గమనించదగింది.