Vote Chori Protest: ఎడిటోరియల్: రాజకీయ సంఘర్షణగా ‘ఓట్లు చోరీ’ పోరాటం
cec gyanesh kumar
Vote Chori Protest: ఓట్ల చోరీపై దేశవ్యాప్త పోరాటం.. ఎన్నికల కమిషన్‌పై పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి
Vote Chori Protest: ఓటరు జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (సర్) పేరుతో ఓట్ల తొలగింపు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టిన భారత ఎన్నికల కమిషన్, ముఖ్యంగా దాని ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌పై జరుగుతున్న పోరాటం కీలకమైన దశలోకి ప్రవేశించింది. ఆయన రాజీనామా, ఆయనను పనిముట్టుగా వాడుకుంటూ తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకుంటున్న, విస్తరించుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామాను కోరుతూ గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, ముంబయిలలో ప్రారంభమైన ఆందోళన వచ్చేవారం కొనసాగటంతోపాటు, సీఈసీ, సర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో, బొంబాయి తదితర హైకోర్టుల్లో దాఖలైన కేసులు కూడా విచారణకు రానున్నాయి.
ఈ ఉక్కిరిబిక్కిరి వాతావరణంలో ఎన్నికల కమిషన్ తాము తొలగించిన ఓట్లను పునఃపరిశీలించి అర్హులను తిరిగి చేర్చటం, ఎందుకు తొలగించకూడదో ఈసీ నుంచి నోటీసులు అందుకున్న లక్షలాది ఓటర్లు ఎన్నికల అధికారుల చుట్టూ తిరగకుండా, అధికారులే మళ్లీ ఇంటింటికి వెళ్లి వారి సమాచారం సేకరించి అర్హులను తిరిగి చేర్చటం వగైరా ఉత్తర్వులు జారీచేసింది.
సర్ పూర్తి అయిన, కొనసాగుతున్న రాష్ట్రాల్లో 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించటం ఎన్నికల కమిషన్ ఒంటెత్తు పోకడలపై, దాని అధికారాలపై పెద్ద ఎత్తున ఆగ్రహ వ్యక్తీకరణకు దారితీసింది. అర్హులైన (వయోపరిమితి ప్రకారం) పౌరులందరినీ ఓటర్లుగా నమోదుచేసి, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయటం, ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా నిర్వహించటం ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశం. ఏకపక్షంగా ఓట్లు తొలగించే అధికారం దానికి లేదు.
ఎన్నికల నిర్వహణలో గతంలో ఎన్ని లోపాలున్నా దాని నిజాయితీ, నిష్పాక్షికత ఎన్నడూ ప్రశ్నించబడలేదు. జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా నియామకం మొదలు, బిహార్‌లో తొలుత ‘సర్’ నిర్వహించిన తీరు అతను బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలకు దారితీసింది. ఇక పశ్చిమ బెంగాల్ సర్ సమయంలో ప్రవేశపెట్టిన ‘లాజికల్ వ్యత్యాసాలు’ అనే నియమం పదుల లక్షలమంది ఓట్ల తొలగింపునకు దారితీయటంతో రాజకీయ దుమారం బయలుదేరింది.
‘మేము ముందుగా తీసేస్తాం మీరు మీ పౌరసత్వాన్ని నిరూపించుకుని ఆ తర్వాత చేరండి’ అని సీఈసీ తీసుకున్న వైఖరి కమిషన్ నిర్ణయం కాదని, ఆయన ఏకపక్ష ఆదేశమని తోటి కమిషనర్లు అభ్యంతరాలు తెలిపినట్లు బట్టబయలు కావటం అగ్గి రగిల్చింది.
రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించిన ‘సర్’ ప్రక్రియను ఎండగడుతూ, జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో రాజకీయ పక్షాలతోపాటు విద్యార్థి తదితర ప్రజాసంఘాలు, పౌర సమూహాలు చేరటంతో ఆందోళన పరిధి విస్తరించింది, జిల్లా కేంద్రాల వరకు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై మోదీ ప్రభుత్వానికి చెమటలు పట్టించి, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సాధించిన జన్ జీ ఆందోళన, సీఈసీ రాజకీయ వేదికగా సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తోంది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేయటమంటే అది పరోక్షంగా మోదీ, అమిత్ షా రాజీనామాకు ఒత్తిడి చేయటమే.
సీఈసీ జంతర్‌మంతర్ ఆందోళన తదుపరి జన్ జీ తరాన్ని బుజ్జగించేందుకు ప్రధాని మొదలు యావత్ బీజేపీ నాయకత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో, సీఈసీకి వ్యతిరేకంగా ఆరంభమైన ఆందోళనలో జన్ జీలు పాల్గొనటం బీజేపీని కలవరపెడుతోంది. అందుకనే, జ్ఞానేశ్ కుమార్‌ను గట్టిగా సమర్థించేందుకు, ప్రతిపక్షంపై ఎదురుదాడి చేసేందుకు 14 మంది బీజేపీ ముఖ్యమంత్రులను, టీడీపీ వంటి మిత్రపక్షాల ముఖ్యమంత్రులను బీజేపీ రంగంలోకి దించింది.
సాధారణంగా అయితే సీఈసీ వివాదం ప్రభుత్వానికి సంబంధించింది కాదు. చట్టం, నియామకాలు వంటి అంశాలు, లేదా ఫిర్యాదులు కోర్టు ముందుకు వచ్చినపుడు ప్రభుత్వం సీఈసీకి సమర్థనగా వాదిస్తుంది. కాని ఇదొక ప్రజాస్వామ్య పరిరక్షణ సమస్యగా దేశం ముందుకు రావటంతో, దానివల్ల రాజకీయంగా తమకు ఉత్పన్నమయ్యే ప్రమాదాన్ని గ్రహించి బీజేపీ సీఈసీ కొమ్ము గాస్తూ, ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తోంది.
‘సర్’ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని, ఈసీకి ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డం పెట్టుకుని సీఈసీ సాగించిన ఏకపక్ష నియంతృత్వ నిర్ణయాలను సమర్థించుకుంటున్నారు. ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం సహా, ప్రజాప్రాతినిధ్య చట్టం, కమిషన్ అధికారాలను సీఈసీ తప్పుగా ఉపయోగించిన తీరు వగైరాలు న్యాయ సమీక్షకు రానున్నాయి.
యావత్ రాజకీయ వ్యవస్థ విశ్వాసం చూరగొని తటస్థ అంపైర్లాగా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాల్సిన జ్ఞానేశ్ కుమార్ నరేంద్రమోదీ చేతిలో పనిముట్టుగా ముద్రకు గురైనాడు.
రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తిని హరించి వాటిని చేతిలోకి తీసుకుంటున్న మోదీ షా వ్యూహంలో ఎన్నికల కమిషన్ అత్యంత ప్రాధాన్యత గలది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని బీజేపీకి కట్టబెట్టిన ఆరోపణలకు గురైన సీఈసీ కొనసాగితే ఎన్నికల్లో జనాదేశం ప్రతిఫలించదన్న భయం ప్రతిపక్షాల్లో ఉంది.
సర్ పేరుతో పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాల, దళితుల, మైనారిటీల ఓట్ల తొలగింపును ఆ పథకంలో భాగంగా చూస్తున్నాయి. దీన్ని అనుమతిస్తే ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అనే దానికన్నా రాజ్యాంగ నిర్దేశితమైన ప్రజాస్వామిక వ్యవస్థ ద్రోహానికి గురవుతుంది. ప్రజల చైతన్యం, పోరాటమే ప్రజాస్వామ్యానికి రక్ష.