Editorial On ISRO Operations: ఇస్రో ఆపరేషన్స్ ప్రైవేటీకరణ ఎజండా
Editorial On ISRO Operations: ఇస్రోలో ప్రైవేటీకరణకు అనుసరిస్తున్న పద్ధతి రైల్వేలలో, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణకు ఆచరించిన పద్ధతులను గుర్తు చేస్తున్నది. ప్రజల డబ్బుతో ప్రభుత్వ ఆస్తులు నిర్మించటం, వాటి నిర్వహణను నిర్లక్ష్యం చేసి అవి సవ్యంగా పనిచేయటం లేదని నిందలు వ్యాప్తిలో పెట్టటం, అంతిమంగా వాటిని కారుచౌకగా ప్రైవేటు కంపెనీలకు విక్రయించి లాభాలు చేకూర్చటమే ఆ రీతి. అటువంటి లోపాయికారి ఒప్పందాల్లో అధికారులు కమిషన్‌లు, లంచాలు అందుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
Editorial On ISRO Operations: రోదసీ అన్వేషణలో కీలకం, దేశానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉపగ్రహాల ఉత్పత్తిని, వాటిని ప్రయోగించే వాహకాల (లాంచ్ వెహికల్స్)ను మోదీ ప్రభుత్వం ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో) నుంచి ప్రైవేటురంగానికి బదిలీ చేస్తున్నదా? ఇప్పుడు అమలు జరుగుతున్న చర్యలు ‘ఔను’ అనే సమాధానాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇస్రో మరింతగా పరిశోధన, శాస్త్రీయ అన్వేషణ రోదసీ యాత్రలు, అధునాతన రోదసీ మౌలిక వసతుల నిర్మాణం వంటి వాటిపై కేంద్రీకరించే వెసులుబాటు కలిగించే నిమిత్తం ప్రైవేటురంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. ఇస్రో కార్యక్రమాల్లో మార్పు 2023 లో ప్రకటించిన స్పేస్ పాలసీ కింద వేగవంతమైంది.
2025 చివరలో ఎస్‌ఎస్‌ఎల్‌వి (చిన్న ఉపగ్రహ ప్రయోగ వెహికిల్) హక్కులను ఇస్రోనుంచి హెచ్‌ఎఎల్ రూ.511కోట్లకు వేలంలో దక్కించుకుంది. ఇది ఒక ప్రభుత్వరంగ సంస్థ నుంచి మరో ప్రభుత్వరంగ సంస్థకు బదలాయింపులా కనిపించినా, హెచ్‌ఎఎల్ వైఫల్యాన్ని చాటటానికి ఈ బదలాయింపు జరిగి ఉండవచ్చుననే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే, అది తేజాస్ ఎంకె1A జెట్‌లు తదితర కీలకమైన స్వదేశీ యుద్ధ పరికరాలను నిర్ణీత సమయంలో సరఫరా చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్నది.
ఇస్రోలో ప్రైవేటీకరణకు అనుసరిస్తున్న పద్ధతి రైల్వేలలో, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణకు ఆచరించిన పద్ధతులను గుర్తు చేస్తున్నది. ప్రజల డబ్బుతో ప్రభుత్వ ఆస్తులు నిర్మించటం, వాటి నిర్వహణను నిర్లక్ష్యం చేసి అవి సవ్యంగా పనిచేయటం లేదని నిందలు వ్యాప్తిలో పెట్టటం, అంతిమంగా వాటిని కారుచౌకగా ప్రైవేటు కంపెనీలకు విక్రయించి లాభాలు చేకూర్చటమే ఆ రీతి. అటువంటి లోపాయికారి ఒప్పందాల్లో అధికారులు కమిషన్‌లు, లంచాలు అందుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
ఇస్రో వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) అనే సంస్థ ఉండగా, ఇన్-స్పేస్ (IN-SPACe) అనే మరో సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇస్రో ఆస్తులను వాణిజ్యపరం చేయటాన్ని (విక్రయించే) వేగిరపరచటానికే ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేశారని విమర్శకులు వాదిస్తున్నారు.
దాని చైర్మన్ డాక్టర్ పవన్ గోయింకా శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ, రొటీన్ ఉపగ్రహాలు, పిఎస్‌ఎల్‌వి, ఎల్‌విఎంకె వంటి లాంచ్ వెహికల్స్ ఉత్పత్తి చేయటాన్ని ఇస్రో నిలుపు చేస్తుందని, వాటి ఉత్పత్తి పూర్తిగా ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థలకు బదిలీ అవుతుందని చెప్పారు. ఈ క్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ప్రైవేటు కంపెనీలు సొంతంగా చేపట్టలేని పరిశోధన, అధునాతన టెక్నాలజీలు, శాస్త్రీయ పరిశోధన యాత్రలు, మౌలిక వసతుల నిర్మాణంపై ఇస్రో కేంద్రీకరిస్తుందన్నారు.
ఎస్‌ఎస్‌ఎల్‌వి క్రమంలో హెచ్‌ఎఎల్‌ను అనుమతించినట్లు, పిఎస్‌ఎల్‌వి వేలం, ఎల్‌విఎం-3 తదితర భవిష్యత్ టెక్నాలజీ బదలాయింపు క్రమంలో పాల్గొనేందుకు ప్రభుత్వరంగ సంస్థలు అనుమతించబడవని, ప్రైవేటు పరిశ్రమలు మాత్రమే ఆ వ్యాపారం చేబడతాయని కూడా డాక్టర్ గోయింకా చెప్పటం గమనార్హం.

“మేము ఇప్పటికే 120 టెక్నాలజీలను ఇస్రో నుంచి ప్రైవేటురంగానికి బదిలీ చేశాం. కొత్త లాంచ్ సెంటర్ కార్యకలాపాలను ప్రైవేటు పరిశ్రమలకు ఇచ్చేందుకు ప్రభుత్వం తలపెట్టింది. వచ్చే నాలుగైదు మాసాల్లో ప్రైవేటు ఆపరేటర్ ఖరారు అవుతారు” అని కూడా ఆయన చెప్పారు.
ఇస్రో ఆస్తులు, కార్యకలాపాల ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం ఎంత త్వరపడుతున్నదో కదా! రోదసీ ఆర్థిక వ్యవస్థను 2033 నాటికి ప్రస్తుత 8 బిలియన్ డాలర్లనుంచి 44 బిలియన్ డాలర్లకు పెంపు చేయటం ప్రభుత్వ లక్ష్యం. రక్షణశాఖ ఇప్పటికే ప్రైవేటు కంపెనీలకు 31 ఉపగ్రహాలు ఆర్డరు ఇచ్చిందట, ఇస్రో 21 ఉపగ్రహాలే ఉత్పత్తి చేస్తుందట. ప్రభుత్వ ప్రాధాన్యతల్లో వేగవంతమైన మార్పుకు ఇది మరో సూచన.
రెండోవైపున, ఇస్రో లక్ష్యాల సాధన నెమ్మదించటాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విమర్శించింది. ఇస్రో బడ్జెట్ పూర్తిగా ఉపయోగించకపోవటం, చంద్రయాన్, శుక్రయాన్-1 (వీనస్ ఆర్బిటర్ మిషన్) సహా ప్రధానమైన అన్వేషణ కార్యక్రమాలు జాప్యం కావటాన్ని ఆ కమిటీ మార్చి 2026 నివేదిక ఆక్షేపించింది. అధునాతన టెక్నాలజీలను (ఉపగ్రహాలు, రాకెట్లు, ఆధునిక మెటీరియల్స్) తక్కువ ధరలకు ప్రైవేటు కంపెనీలకు బదిలీ చేయటాన్ని కమిటీ గట్టిగా తప్పుపట్టింది.
ఇస్రో, దాని శాస్త్రవేత్తల పట్ల నిర్లక్ష్యం, అనేక కార్యకలాపాలను ప్రైవేటీకరించటం వల్ల ఇస్రో మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్నది. 100 మందికిపైగా శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది ఇటీవల రాజీనామా, వలెంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రైవేటు రంగంలోకి వెళ్లటం తెలిసిందే. ఈ రిటైర్మెంట్లకు వేతనాలు సమస్య కన్నా వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు, పెరుగుతున్న బ్యూరోక్రటిక్ పెత్తనం కారణమని ఇస్రో మాజీ చైర్మన్ జి. మాధవన్ హెచ్చరిక చేశారు. ప్రభుత్వం ప్రైవేటీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాక రోదసీ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు మెరుగైన జీవితాన్ని ఎంచుకోవటంలో ఆశ్చర్యం లేదు.