Skip to content
తెలంగాణ వార్తలు

Telangana polytechnic students protest: విలీనం వద్దు.. పాలిటెక్నిక్‌లను బలోపేతం చేయాలి…

Prajapaksham 23 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana polytechnic students protest: విలీనం వద్దు.. పాలిటెక్నిక్‌లను బలోపేతం చేయాలి…

Telangana polytechnic students protest: విలీనం వద్దు.. పాలిటెక్నిక్‌లను బలోపేతం చేయాలి...

Telangana polytechnic students protest: తెలంగాణలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతిక విద్యకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు వెన్నెముకగా ఉన్నాయి. ఎన్నో దశాబ్దాలుగా ప్రతి విద్యాసంవత్సరం వేలాదిమంది విద్యార్థులకు డిప్లొమా విద్యను అందిస్తూ, ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలకు మార్గం చూపుతున్న పాలిటెక్నిక్‌ విద్య వ్యవస్థకు ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం జీఓ నెం.97 తీసుకువచ్చి పాలిటెక్నిక్‌ విద్యను స్కిల్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రభుత్వ నిర్ణయం విద్యార్థుల్లో, అధ్యాపకుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రంలో 59 ప్రభుత్వ, 54 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉండగా లక్ష మంది విద్యార్థులు పాలిటెక్నిక్‌ విద్య చదువుతున్నారు. పాలిటెక్నిక్‌ విద్య చదివే వారిలో అత్యధికులు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ విద్యార్థులే. అందులో పాలిటెక్నిక్‌ విద్యను ఎక్కువగా బాలికలే చదివేది.

నైపుణ్య విద్యను అభివృద్ధి చేయడం పేరుతో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యను, ఐటీఐలను, ఎటిసి విద్యారంగాలను స్కిల్‌ ఇండియా యూనివర్సిటీలో విలీనం చేయడం పరిష్కారం కాదు. ప్రభుత్వ-భాగస్వామ్యంతో నడిచే స్కిల్‌ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ విద్యావ్యవస్థను విలీనం చేయడం పాలిటెక్నిక్‌ విద్యను కార్పొరేటీకరించే కుట్రలో భాగంగానే జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో స్కిల్‌ యూనివర్సిటీ నిర్వహణలో ఉన్నది కాబట్టి ఆ యూనివర్సిటీకి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే యూనివర్సిటీ వారు ఫీజులు పెంచి విద్యార్థుల దగ్గరి నుండి నిధులు రాబట్టే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థులపై ఫీజుల భారం పడే అవకాశం ఉంది. ఒకవేళ ఫీజులు పెంచితే వేలాది మంది విద్యార్థులు పాలిటెక్నిక్‌ విద్యకు దూరమయ్యే అవకాశం లేకపోలేదు.

స్కిల్‌ యూనివర్సిటీపై మాకు వ్యతిరేకత లేదు. కానీ ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యను దాని పరిధిలో కలిపే నిర్ణయాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం.

పాలిటెక్నిక్‌ విద్య అనేది కేవలం స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ కాదు. ఇది గుర్తింపు పొందిన సాంకేతిక విద్యా వ్యవస్థ. డిప్లొమా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇంజినీరింగ్‌ విద్యలోకి వెళ్లే అవకాశాలను కల్పించే కీలకమైన విద్యా మార్గం. అలాంటి వ్యవస్థను మరో సంస్థ పరిధిలోకి తీసుకెళ్లే ముందు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం ఆలోచించాలి.

ఉన్న వ్యవస్థ అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి ఇలాంటి నిర్ణయం ఎందుకని? దీని వెనుక ఆలోచన ఏందని? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పాలిటెక్నిక్‌ విద్య ప్రైవేట్‌ పరం కానుందనే ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు.

Telangana polytechnic students protest

ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు?

పాలిటెక్నిక్‌ కళాశాలలు స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం అయితే విద్యార్థుల డిప్లొమా గుర్తింపు, ఉన్నత విద్య అవకాశాలు, ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి?

ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో చదువుతున్న పేద విద్యార్థులపై పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నిర్వహణలో ఉండే స్కిల్‌ యూనివర్సిటీలో భవిష్యత్తులో అదనపు ఫీజుల భారం పడదని ప్రభుత్వం హామీ ఇవ్వగలదా? ఆ నమ్మకం విద్యార్థులకు లేదు. ఎందుకంటే అక్కడ కౌన్సిల్‌ సభ్యులుగా ఉన్నది అంతా పారిశ్రామిక వేత్తలే కాబట్టి.

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా, సరైన ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేయకుండా కేవలం వ్యవస్థను మార్చడం వల్ల విద్యార్థులకు వచ్చే ప్రయోజనం ఏమిటి? సమస్య పాలిటెక్నిక్‌ విద్యలో ఉందా? లేక దానికి అవసరమైన నిధులు, అధ్యాపకులు, మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యంలో ఉందా? అనే ప్రశ్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కలుగుతుంది.

ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటి?

విలీనం కాదు.. బలోపేతం చేయాలి

ప్రభుత్వం చేయాల్సింది పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్‌ యూనివర్సిటీలో కలపడం కాదు. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఆధునిక ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలి.

పరిశ్రమలతో అనుసంధానం చేసి ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు పెంచాలి. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లను బలోపేతం చేయాలి. విద్యార్థులకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో నాణ్యమైన సాంకేతిక విద్య అందించాలి. డిప్లొమా తర్వాత ఉన్నత విద్యకు వెళ్లే అవకాశాలను మరింత విస్తరించాలి.

స్కిల్‌ యూనివర్సిటీని అభివృద్ధి చేయాలంటే కొత్త అవకాశాలు సృష్టించాలి. కానీ ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీనపరచకూడదు.

ప్రభుత్వ విద్యాసంస్థలను ఒక్కొక్కటిగా కొత్త పేర్లు, కొత్త విధానాల పేరుతో పునర్వ్యవస్థీకరించడం వల్ల చివరకు పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న విద్య దూరమయ్యే ప్రమాదం ఉంది. విద్యను మార్కెట్‌ అవసరాలకు మాత్రమే పరిమితం చేయకుండా, విద్యార్థుల సామాజిక, విద్యా హక్కులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి.

విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు, విద్యార్థి సంఘాలతో బహిరంగ చర్చ నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజు నుండి ఇప్పటివరకు విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకొని స్కిల్‌ యూనివర్సిటీలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను విలీనం చేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.

కసిరెడ్డి మణికంఠ రెడ్డి
ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ట్యాగ్‌లు: Telangana