Skip to content
జాతీయం వార్తలు

Suravaram Sudhakar Reddy: ఎంత కాలం జీవించామనేది కాదు. ఎంత గొప్పగా జీవించామనేది ముఖ్యం: ఘంటా చక్రపాణి

Prajapaksham 22 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Suravaram Sudhakar Reddy: ఎంత కాలం జీవించామనేది కాదు. ఎంత గొప్పగా జీవించామనేది ముఖ్యం: ఘంటా చక్రపాణి

సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్థంతి సభ

( సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్థంతి సభ)
Suravaram Sudhakar Reddy: సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర రెడ్డి జీవితామంతా స్ఫూర్తిదాయకమని, “ఎంత కాలం జీవించామనేది కాదు. ఎంత గొప్పగా జీవించామనేది ముఖ్యం” (లైఫ్ షుడ్ బి గ్రేట్ ర్యాదర్ థెన్ లాంగ్) అనే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చెప్పిన సూక్తికి సురవరం సుధాకర రెడ్డి జీవితం పర్యాయపదంగా నిలుస్తుందని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి కొనియాడారు. సమసమాజం స్థాపన అధికారంతో కాదని, కమ్యూనిస్టుల ఏకీకరణ ద్వారా మాత్రమే అది సాధ్యమని సురవరం సుధాకర్ ప్రగాఢంగా విశ్వసించేవారని, ఆ దిశగా కమ్యూనిస్టు శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సిపిఐ అగ్ర నేత, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ ప్రథమ వర్థంతి సభ శనివారం మఖ్ధూంభవన్ జరిగింది. సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించగా, ఘంటా చక్రపాణి, సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి, సిపిఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ, సురవరం సుధాకర రెడ్డి సతీమణి సీనియర్ నాయకురాలు డాక్టర్ బి.వి.విజయ లక్ష్మి ప్రసంగించారు. సురవరం సుధాకర్ వివిధ సందర్భాలలో వివిధ అంశాలపై రాసిన వ్యాసాలతో రూపొందించిన ‘ఉద్యమాక్షరం’ పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. సురవరం సుధాకర రెడ్డిపై ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహా రచించిన పాటను నాయకులు ఆవిష్కరించారు. అంతకుముందు సురవరం సుధాకర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి సిపిఐ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.

సురవరం సుధాకర రెడ్డి గొప్ప కమ్యూనిస్టు : ఘంటా చక్రపాణి
ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సురవరం సుధాకర రెడ్డి ఓ గొప్ప ఉద్యమకారుడు, రచయిత, వ్యాసకర్త, ఓ గొప్ప విద్యార్థి, యువజన, రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆయన ఎప్పుడూ నిరాడంబరుడిగా జీవించిన మహానేత అని కొనియాడారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక్కడి నైనా మార్చగలిగితే ఆయన గొప్ప కమ్యూనిస్టు అవుతాడని, అందుకు ప్రత్యేక్ష ఉదారణ సురవరం సుధాకర రెడ్డి అని అన్నారు. అయన ఆదర్శాల ప్రభావం గ్రామీణ ప్రాంత యువతపై ఎంతో ఉందని, ఇందుకు ఉదహరణ కల్వకుర్తిలో ఓ దళిత యువకుడి గాథే నిదర్శమని చెప్పారు. సురవరం ప్రయాణం, ఆయన జీవితం నేర్పిన విషయాలు చాలామందికి స్ఫూర్తిదాయకమైనవి అని కొనియడారు. అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన సురవర సుధాకర్ ప్రస్తుతం జరుగుతున్న జన్-జీ ఉద్యమ సమయంలో ఆయన లేకపోవడం తీరని లోటు అని పేర్కొన్నారు. సుధాకర్ రెడ్డి బతికి ఉంటే జన్-జీల ఉద్యమానికి ఓవ్యూహం, ధైర్యం ఇవ్వడంతో పాటు దిశా నిర్దేశం చేసేవారని అన్నారు.

ఢిల్లీలో సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులు అర్పిస్తున్న సీపీఐ ప్రధాన కార్యదర్శి బి రాజా, ఎంపీ సందోష్ కుమార్

సుధాకర్ ఆశయాల బాటలో నడవాలి : పల్లా వెంకట రెడ్డి
సురవరం సుధాకర్ జీవితాన్ని, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను ఆదర్శంగా తీసుకుని సిపిఐ శ్రేణులు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పల్లా వెంకటరెడ్డి అన్నారు. కమ్యూనిస్టు భావజాలం ఒక వ్యక్తి మాటల్లో కాకుండా వారి ప్రవర్తనలో ప్రతిబింబించాలని, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో మానవత్వం, ప్రజా సంక్షేమం దెబ్బతింటున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులు మరింత నిబద్ధతతో ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఇందుకు సురవరం సుధాకర్ స్పూర్తిగా తీసుకోవాలన్నారు . సుధాకర్ చివరి రోజుల వరకు ప్రజా సంఘాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, ప్రజా సంఘాలు బలంగా ఉంటేనే పార్టీ నిర్మాణం కూడా బలపడుతుందని ఆయన పదేపదే చెప్పేవారని పేర్కొన్నారు. బాధ్యత ఏదైనా సరే వ్యక్తిగత నిర్ణయాలకు కాకుండా సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించేవారని చెప్పారు.సురవరం సుధాకర్ మాటలు, నిర్ణయాలు, ఉద్యమ పద్ధతులు కమ్యూనిస్టు పార్టీ విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు. సురవరం ఎప్పుడు కూడ తన ప్రసంగంలో సమస్యలు తప్ప ఏ ఒక్కరిని వ్యకిగతం గురించి మాట్లాడిన దాఖలు లేవని పేర్కొన్నారు. ఆ మహానేత సుధాకర్ రచనలు, వ్యాసాలను సేకరించి ఇప్పటికే నవ చేతన పబ్లిషింగ్ హౌజ్ ద్వారా పలు పుస్తకాలు తీసురావడం జరిగిందని, మరిన్ని పుస్తకాలను కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని పల్లా వెంకటరెడ్డి తెలిపారు.

కమ్యూనిస్టు భావజాలాన్ని ఎవరూ ఏమి చేయలేరు – కూనంనేని సాంబశివరావు.
కమ్యూనిస్టులను ఏరివేయవచ్చాని కాని ఆ భావజాలాన్ని ఏమి చేయలేమని ప్రధాని నరేంద్రమోదీకి అర్థమైయ్యే దిమాంగి నక్సల్స్ పదాన్ని అందుకున్నారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. కమ్యూనిస్టు భావజాలం సమాజంలో ఇంకా బలంగా ఉందని, మేధోపరమైన ఉద్యమాలు, వాటి ప్రభావంతో ఏర్పడిన భావజాల పునాదులే ఉద్యమాలకు నాంది పలుకుతున్నాయని చెప్పారు. విద్యావంతులు, ప్రొఫెసర్లు, న్యాయవ్యవస్థ, ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల్లోనూ కొంతమందిలో కమ్యూనిస్టు భావజాలం ఉందని ,ఆ భావజాల ప్రభావాన్ని పూర్తిగా తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మేధావులు, విద్యావంతులు, అధ్యాపకులు, విద్యార్థులను కలుపుకొని సురవరం సుధాకర్ స్ఫూర్తితో మేధో ఉద్యమాన్ని విస్తరించాలని కూనంనేని పిలుపునిచ్చారు. సుధాకర్ అధ్యయనంపై ఎంతో ఆసక్తి చూపేవారని, నిరంతరం చదువుతూ, విషయాలను లోతుగా అధ్యయనం చేసి ఇతరులకు అందించేవారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితో మేధోరంగంలో మరింత విస్తృతంగా పనిచేయాల్సిన అవసరముందని,ఇ ందుకు సుధాకర్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఆయన ఆలోచనలు, అధ్యయన పద్ధతి, భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఈ ప్రయత్నాలను కొనసాగించి, సుధాకర్ ఆశయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.

నాయకత్వం లక్షణాలను గుర్తించడంలో సురవరం దిట్ట – డాక్టర్ కె.నారాయణ
కమ్యూనిస్టు ఉద్యమంలో దూరదృష్టి, నిబద్ధత, కార్యకర్తల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు సురవరం సుధకర్ అని డాక్టర్ కె.నారాయణ కొనియాడారు. అపారమైన మేధస్సు, సహనం కలిగిన సురవరం భూమికంటే ఎక్కువ ఓర్పు ఉన్న వ్యకి ్తఅని అన్నారు. రాజకీయ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆవేశానికి లోనుకాకుండా, ఎంతో సంయమనంతో వ్యవహరించడం ఆయన ప్రత్యేకత అని నారాయణ పేర్కొన్నారు. అందుకే ఆయనను ‘అపొలిటికల్ పొలిటికల్ మ్యాన్’గా అభివర్ణించేవారని గుర్తుచేశారు. తన రాజకీయ ఎదుగుదలలో సురవరం పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థి ఉద్యమంలో తనను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్ర బాధ్యతలు, అనంతరం కేంద్ర కమిటీకి వెళ్లే క్రమంలో కూడా ఆయన అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం మరవలేనిదని చెప్పారు.నాయకత్వాన్ని గుర్తించడం, ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడంలో సురవరం ప్రత్యేక నైపుణ్యం కలిగిన నాయకుడన్నారు. రాజకీయ ఆలోచనలతో పాటు కార్యకర్తల నిర్మాణానికి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని పేర్కొన్నారు. నాయకత్వ లక్షణాలను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో ఆయనకు ప్రత్యేకమైన సామర్థ్యం ఉండేదన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే దేశంలో మార్పులు ఊహించిన దానికంటే వేగంగా చోటుచేసుకుంటున్నాయని, దానిని అంది పుచ్చుకుని ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు.

అసంఘటిత రంగం కోసం సువరం సుధాకర్ చేసిన కృషి చిరస్మరణీయం – బి.వి. విజయలక్ష్మి
కార్మికులు, అసంఘటిత రంగం కోసం సువరం సుధాకర్ చేసిన కృషి చిరస్మరణీయమని బి.వి.విజయలక్ష్మి కొనియడారు. పార్లమెంట్ కార్మిక శాఖ స్టాడింగ్ కమిటీ ఛైర్మన్ పని చేసిన సురవరం సుధాకర్ పార్లమెంటరీ వేదికను కార్మికుల హక్కుల కోసం వినియోగించారన్నారు. సుధాకర్ తన అనుభవాలను ఆధారంగా చేసుకుని రాజకీయ, సామాజిక సమస్యలపై ఎప్పుడు, ఏ విధంగా స్పందించేవారో ఎంతో స్పష్టంగా వివరించేవారని అన్నారు. ఐదు, ఆరు దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయనకు ఎంతో ఉపయోగపడిందని విజయలక్ష్మిపేర్కొన్నారు.ప్రస్తుత కాలంలో వస్తున్న కొత్త విషయాలను తెలుసుకుని, వాటిని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకునేందుకు ఆయన నిరంతరం కృషి చేసేవారని చెప్పారు.ఏ ఉద్యమానికైనా, ఏ కార్యక్రమానికైనా విద్య, అధ్యయనం ఎంతో ముఖ్యమనే విషయాన్ని సుధాకర్ జీవితం నుంచి నేర్చుకోవాలని బి.వి.విజయలక్ష్మి సూచించారు. సువరం సుధాకర్ ప్రథమవర్థంతి సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.


కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి సయ్యద్ అజీజ్ పాషా, ఎఐకెఎస్ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు, తక్కళ్లపల్లి శ్రీనివాస్, ఈ.టి.నరసింహా, కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, కలవేన శంకర్, ఎం.బాల నరసింహ, వి.ఎస్.బోస్, బాగం హేమంత్ రావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం వేదికపై ఆశీనులయ్యారు.

ట్యాగ్‌లు: CPI CPI leaders CPI news