అడకత్తెరలో టిఎంసి రెబెల్ ఎంపిలు
TMC Rebal Mps
పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలు పూర్తవ్వగానే గోడ దూకిన టిఎంసి 20 మంది ఎంపిల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. అధికార బిజెపి అండదండలు చూసుకొని రెచ్చిపోయినా ఆ ఎంపిలకు తాజా పరిణామాలు గుబులు రేపుతున్నాయి. వారి సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ గతంలో ఇచ్చిన అనర్హత పిటిషన్లకు కదలిక వచ్చింది. ఈ పిటిషన్లు షరా మాములే అన్నట్లుగా ఎంతో కాలంగా స్పీకర్ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ టిఎంసి ప్రధాన కార్యదరి అభిషేక్ బెనర్జీ వేసిన కేసులో వాదనలు వినేందుకు ఆగస్టు 25న సుప్రీం కోర్టు అంగీకరించడంతో టిఎంసి రెబెల్ ఎంపిలను, వారిని తెరవెనుక నుంచి ఆడిస్తున్న అధికార బిజెపికి ఒక్కసారిగా ఉలిక్కిపాటు ఎదురైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో లోక్‌సభ సెక్రెటేరియట్ నుంచి వారం రోజుల్లోగా సమాధానాన్ని కోరుతూ రెబెల్ ఎంపీలకు నోటీసులు జారీ అయ్యాయి. దాంతో పాటు అభిషేక్ బెనర్జీ సుప్రీం కోర్టు పిటిషన్ కాపీ, నోటీసులను జత చేశారు. పశ్చిమ బెంగాల్లో నూతన బిజెపి ప్రభుత్వం నుంచి తీవ్ర అణిచివేత ఎదుర్కొంటున్న అసలుసిసలు మమతా బెనర్జీ టిఎంసికి నూతనోత్తేజం కలిగించింది.
మే 4న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే అధికార బిజెపి వికృత క్రీడను మొదలెట్టింది. టిఎంసి శాసనసభా పక్షాన్ని చీల్చి, చీలిక వర్గానికే ప్రతిపక్ష హోదాను కట్టబెట్టింది. ఇదే పంథాను లోక్‌సభ సభ్యుల విషయంలో కూడా అమలు చేసింది. టిఎంసి మెజారిటీ ఎంపిలలో 20 మందిని తన వైపు తిప్పుకుంది. వారంతా జూన్ 14న కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో సమావేశమై లోక్‌సభలో ప్రత్యేక వర్గంగా కూర్చోవాలని, లేదంటే బిజెపిలో విలీనమవ్వాలని భావించారు. కానీ, చట్టపరమైన అడ్డంకులు వారి అభీష్టాన్ని నీరుగార్చాయి. చివరాఖరుకు త్రిపురకు చెందిన ఎన్సిపిఐ పార్టీలో వారు విలీనమవుతున్నట్లు అసమ్మతి ఎంపిలు ప్రకటించుకున్నారు. అసలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయని ఒక పార్టీ లోక్‌సభలో ఐదవ అతిపెద్దగా మారటం వైచిత్రి!
టిఎంసి ప్రధాన కార్యదర్శి, ఎంపి అభిషేక్ బెనర్జీ అసమ్మతి ఎంపిలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ నిబంధనల ప్రకారం జూన్ 19న స్పీకర్‌కు పిటిషన్లను సమర్పించారు. జులై 27న స్పీకర్‌కు ఇదే అంశాన్ని లిఖితపూర్వకంగా గుర్తు చేయడమే కాకుండా, చర్య ఆలస్యమవుతుండడంపై ఆగస్టు 12న స్పీకర్‌ను స్వయంగా కలిశారు. అయినప్పటికీ, స్పీకర్ ఓం బిర్లా ఎటువంటి చర్యా తీసుకోలేదు. చివరకు అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కాల్సి వచ్చింది.
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఆగస్టు 25న విచారణకు అంగీకరించడంతో కథ కీలక మలుపు తీసుకుంది. తమ పార్టీ నుంచి గెలిచిన 28 మందితో తాము 20 మంది ఉన్నామని, కాబట్టి రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లోని నాలుగవ పేరాలో పేర్కొన్న మూడింట రెండు వంతుల పరిమితి కంటే ఎక్కువే నని టిఎంసి అసమ్మతి ఎంపిలు వాదిస్తూ వచ్చారు. అయితే, వారు చేసిన తప్పు ఎన్సిపిఐ అనే కొత్త పార్టీలో తాము విలీనమవు
తున్నట్లు ప్రకటించటం.
రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులోని నాలుగవ పేరాలోనే పార్టీ విలీనం మాతృ పార్ట్టీ వ్యవహారమే తప్ప పార్లమెంటరీ పక్షం చేతిలో ఉండబోదని స్పష్టంగా ఉంది. తాజాగా సుప్రీం కోర్టు కేసు ఆధారంగా స్పీకర్ సచివాలయం కూడా తిరుగుబాటు ఎంపిలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు స్పీకర్ ఎలాంటి వైఖరి తీసుకుంటారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. వచ్చే నెల మొదటి వారం నాటికి నోటీసులు అందుకున్న అసమ్మతి ఎంపిలు సమాధానం ఎలా ఉండబోతుందదనేది ఆసక్తికరం. వాటిపై స్పీకర్ స్పందన కీలకం కానుంది. అభిషేక్ బెనర్జీ వేసిన కేసు సాధారణమైనదేమీ కాదు.ఇది ఫిరాయింపుల నిరోధక చట్టానికే కాకుండా, స్పీకర్ రాజ్యాంగపరమైన పాత్ర, అనర్హత పిటిషన్లపై అంతులేని జాప్యం, ఫిరాయింపు రాజకీయాలు వంటి అంశాలపై కొత్త చర్చకు తెరలేపనుంది.