Skip to content
ప్రపంచం వార్తలు

Nepal Flash Floods: నేపాల్‌ను ముంచెత్తిన మెరుపు వరద.. అసలు కారణం ఇదేనా ? చైనాకు ముందే హెచ్చరించలేదు ఎందుకు..? ఈ వీడియోలో వివరంగా చూడండి..? ( Viral Video)

Prajapaksham 27 Aug 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Nepal Flash Floods: నేపాల్‌ను ముంచెత్తిన మెరుపు వరద.. అసలు కారణం ఇదేనా ? చైనాకు ముందే హెచ్చరించలేదు ఎందుకు..? ఈ వీడియోలో వివరంగా చూడండి..? ( Viral Video)

Nepal Flash Floods: నేపాల్‌–చైనా సరిహద్దు ప్రాంతాన్ని కుదిపేసిన భారీ మెరుపు వరద వెనుక సంచలన కారణాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓవైపు భారీ వర్షం కురవకపోయినా ఒక్కసారిగా భారీగా నీరు, బురద, మంచు, రాళ్లు, శిథిలాలతో వరద దూసుకురావడం తీవ్ర విధ్వంసానికి కారణమైంది. శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా.. హిమనదం ( గ్లేషియర్) లోని ఒక భారీ భాగం కూలిపోవడం, దాని వెంట మంచు, రాళ్లు, మట్టి నదిలోకి జారిపడటం.. కొంతసేపు నదీ ప్రవాహానికి అడ్డుకట్ట ఏర్పడటం.. ఆ తర్వాత ఆ అడ్డంకి తెగిపోవడంతో ఒక్కసారిగా భారీ వరద ఉప్పొంగినట్లు శాస్త్రవేత్తలు, అధికారులు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హిమనదం కూలింది.. నదికి అడ్డుకట్ట పడింది
మరిన్ని వివరాల్లోకి వెళితే… ఆగస్టు 26 ఉదయం నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు సమీపంలోని హిమాలయ ప్రాంతంలో హిమనదంలోని దిగువ భాగం భారీగా విరిగిపడింది. శాటిలైట్‌ విశ్లేషణ ప్రకారం.. దాదాపు 5,200 మీటర్ల ఎత్తు నుంచి మంచు, రాళ్లు, మట్టి భారీగా కిందికి జారినట్లు తెలుస్తోంది. ఈ ఐస్‌–రాక్‌ అవలాంచ్‌ ఖోలా నదిలోకి చేరడంతో నదీ ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుకట్ట ఏర్పడింది. దాంతో అక్కడ నీరు, శిథిలాలు కలిసి ఒక తాత్కాలిక సరస్సు లేదా ‘డెబ్రిస్‌ లేక్‌’గా మారినట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి.

అడ్డుకట్ట తెగగానే బీభత్సం
కొంతసేపటి తర్వాత ఆ సహజ అడ్డంకి నిలవలేకపోయింది. ఒక్కసారిగా అది తెగిపోవడంతో భారీ మొత్తంలో నీరు, బురద, మంచు, బండరాళ్లు, శిథిలాలు దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చాయి. ల్హెండే ఖోలా నుంచి భోటేకోషి, ఆ తర్వాత త్రిశూలీ నదీ వ్యవస్థలోకి చేరిన ఈ ప్రవాహం.. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్‌ ప్రాజెక్టులు, ఇతర మౌలిక వసతులను తీవ్రంగా దెబ్బతీసింది. కొన్ని ప్రాంతాల్లో నది నీటిమట్టం కేవలం అరగంటలోనే సుమారు 9 మీటర్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

రసువా నుంచి టిబెట్‌ వరకు విధ్వంసం
ఈ వరదల ప్రభావం ప్రధానంగా నేపాల్‌లోని రసువా జిల్లాపై పడింది. చైనా వైపు టిబెట్‌లోని గైరాంగ్‌ కౌంటీ, గైరాంగ్‌ పోర్టు ప్రాంతాలు కూడా మట్టిపెళ్లలు, వరదలకు గురయ్యాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి.

మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై అధికారిక లెక్కలు గంటగంటకూ మారుతున్నాయి. ఆగస్టు 27 నాటికి నేపాల్‌, టిబెట్‌ కలిపి వందలాది మంది మృతి చెందినట్లు, వెయ్యికి పైగా మంది గల్లంతైనట్లు వివిధ నివేదికలు చెబుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నందున తుది సంఖ్య మరింత మారే అవకాశం ఉంది.

అసలు భూకంపం కారణం కాదా?
వరదలకు ముందు భూకంపం సంభవించినట్లు మొదట వార్తలు వచ్చాయి. దీంతో భూకంపమే హిమనదం కూలిపోవడానికి కారణమై ఉంటుందని భావించారు. అయితే అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) తదుపరి విశ్లేషణలో.. తొలుత భూకంపంగా నమోదైన ప్రకంపనలు వాస్తవానికి హిమనదం, రాళ్లు భారీగా కూలిపోవడం వల్ల ఏర్పడిన భూకంప తరంగాలేనని పేర్కొంది. అంటే ప్రస్తుత ఆధారాల ప్రకారం.. భూకంపం కంటే హిమనదం కూలిపోవడమే ప్రధాన ఘటనగా కనిపిస్తోంది.

అయితే హిమనదం ఎందుకు కూలింది? అధిక ఉష్ణోగ్రతలు, వేగంగా మంచు కరగడం, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలు కారణమయ్యాయా? అనే దానిపై శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేస్తున్నారు. వాతావరణ మార్పులు హిమనదాల క్షీణతను వేగవంతం చేస్తున్నాయన్న దానిపై శాస్త్రీయంగా బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ.. ఈ ప్రత్యేక ఘటనకు వాతావరణ మార్పులే ప్రత్యక్ష కారణమని ఇప్పుడే తేల్చలేమని నిపుణులు చెబుతున్నారు.

చైనా ముందే హెచ్చరించ లేదు ఎందుకు..?
ఈ విపత్తు తర్వాత నేపాల్‌లో మరో కీలక ప్రశ్న తలెత్తింది. టిబెట్‌ వైపు ప్రమాదకర పరిస్థితి ఏర్పడిన విషయం చైనా అధికారులకు ముందే తెలిసిందా? తెలిసి ఉంటే నేపాల్‌ను ఎందుకు అప్రమత్తం చేయలేదు? అన్నదే ఆ ప్రశ్న.

నేపాల్‌లోని కొందరు అధికారులు, నిపుణులు సరిహద్దు ప్రాంతాల్లో వరదలు, హిమనద సరస్సుల విస్ఫోటనాలపై రియల్‌టైమ్‌ సమాచార మార్పిడి వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. నేపాల్‌, చైనా మధ్య సాధారణ హైడ్రోలాజికల్‌ డేటా షేరింగ్‌కు స్పష్టమైన అధికారిక వ్యవస్థ లేదన్న అంశం కూడా గతంలోనే గుర్తించబడింది.

అయితే ఈసారి చైనాకు ప్రమాదం ముందుగానే తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా నేపాల్‌కు హెచ్చరిక ఇవ్వలేదని ఇప్పటివరకు నిర్ధారించే ఆధారం లేదు. పైగా చైనా అధికారుల ప్రకారం.. ఘటన నేపాల్‌ వైపు జరిగిన హిమనదం /భూమి కంపించడం కారణంగా ప్రారంభమైందని, తమపై వచ్చిన ఆరోపణలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని చైనా పేర్కొంది.

అసలు సమస్య.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలో లోపాలేనా?

నేపాల్‌ అధికారుల ప్రకారం వరద సరిహద్దు దాటి వచ్చిన తర్వాతే తమకు సమాచారం అందింది. ఒక నివేదిక ప్రకారం.. వరద సరిహద్దు దాటిన సుమారు 16 నిమిషాల తర్వాత నేపాల్‌ హైడ్రాలజీ, వాతావరణ శాఖకు సమాచారం చేరింది. అనంతరం దిగువ ప్రాంతాలకు SMS హెచ్చరికలు పంపినా.. అప్పటికే ఎగువ ప్రాంతాల్లో వరద విధ్వంసం ప్రారంభమైపోయింది.

ఇదే ఈ విపత్తులో అత్యంత కీలకమైన అంశంగా మారింది. సరిహద్దు దాటి ప్రవహించే నదుల విషయంలో రియల్‌టైమ్‌ నీటి మట్టం సమాచారం, హిమనద సరస్సుల పర్యవేక్షణ, శాటిలైట్‌ డేటా, అత్యవసర హెచ్చరికలను వెంటనే పంచుకునే వ్యవస్థ ఉంటే.. కనీసం దిగువ ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే ఖాళీ చేయించే అవకాశం ఉండేదా అన్నది ఇప్పుడు పరిశీలించాల్సిన అంశంగా మారింది.

ట్యాగ్‌లు: Nepal Flash Floods