Nepal Flash Floods: నేపాల్‌లో భారీ వరద బీభత్సం.. 105 మంది భారతీయులు, 37 మంది NRIs గల్లంతు..అప్రమత్తమైన భారత్
Nepal Flash Floods:
Nepal Flash Floods: నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటే కోషి నదికి అకస్మాత్తుగా వరద పోటెత్తడంతో భారీ విషాదం చోటుచేసుకుంది. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువాగధి–తిమురే ప్రాంతంలో బుధవారం ఉదయం సంభవించిన ఆకస్మిక వరదలో కనీసం 17 మంది మృతి చెందగా.. వందలాది మంది ఆచూకీ లేకుండా పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం 384 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 105 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) ఉన్నట్లు సమాచారం.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో భోటే కోషి నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. వరద ప్రవాహం రసువాగధి, తిమురే ప్రాంతాలను ముంచెత్తింది. దీని ప్రభావం నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకూ విస్తరించింది. వాహనాలు, సరుకులు, వంతెనలు, రహదారులు వరదలో కొట్టుకుపోయాయి. టిబెట్‌తో నేపాల్ వాణిజ్యానికి కీలకమైన రసువాగధి సరిహద్దు ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
నేపాల్ పర్యాటక బోర్డు ప్రాథమిక జాబితా ప్రకారం 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులతో కలిపి మొత్తం 384 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. విదేశీయుల్లో భారతీయులతో పాటు అమెరికా, మలేషియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌కు చెందినవారు ఉన్నారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది కైలాష్ మానస సరోవర్ యాత్రకు టిబెట్ వైపు వెళ్తున్న యాత్రికులు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రయాణికుల వివరాలను ట్రావెల్ ఏజెన్సీలు, గైడ్లు, స్థానిక అధికారులు, భద్రతా సంస్థలతో కలిసి అధికారులు ధ్రువీకరిస్తున్నారు.
వరదలో పలువురు పోలీసు సిబ్బంది కూడా గల్లంతయ్యారు. సహాయక, గాలింపు చర్యల కోసం నేపాల్ సైన్యం, సాయుధ పోలీసు దళం, నేపాల్ పోలీసులను రంగంలోకి దించారు. 14 హెలికాప్టర్లు, డ్రోన్లు, జాగిలాల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. స్యాఫ్రుబేసి నుంచి ఆరుగురు, మైలుంగ్ నుంచి ఇద్దరు, ధుంచే నుంచి నలుగురిని రక్షించినట్లు నేపాల్ సైన్యం తెలిపింది. బాధితులకు అత్యవసర వైద్యం అందించేందుకు త్రిశూలిలో ప్రత్యేక చికిత్సా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.
భోటే కోషి నదిలో నీటిమట్టం ఇంత అకస్మాత్తుగా ఎందుకు పెరిగిందన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. రసువా ప్రాంతంలో కురిసిన వర్షాలే దీనికి కారణం కాదని నేపాల్ జలవిజ్ఞాన, వాతావరణ అధికారులు చెబుతున్నారు. టిబెట్ వైపు హిమానీనద సరస్సు ఉప్పొంగడం, కొండచరియలు విరిగిపడి నది ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డంకి ఏర్పడి ఆ తర్వాత ఒక్కసారిగా నీరు విడుదల కావడం వంటి కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే వీటిలో ఏదీ ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.
వరద ప్రభావం నేపాల్ జలవిద్యుత్ రంగంపైనా పడింది. రసువా, నువాకోట్ జిల్లాల్లో కలిపి 354 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్న ఎనిమిది జలవిద్యుత్ ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న మరో ఐదు ప్రాజెక్టులు దెబ్బతిన్నట్లు సమాచారం. నేపాల్‌లో వరద పరిస్థితుల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. వరద నీరు దిగువకు ప్రవహించి గండక్ నదిలోకి చేరే అవకాశం ఉందన్న అంచనాలతో బిహార్, ఉత్తరప్రదేశ్ అధికారులను అప్రమత్తం చేశారు. గండక్ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని సురక్షితంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడి ప్రాణనష్టంపై సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌కు అవసరమైన మానవతా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రసువా సహా దిగువ ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. నదీ తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. గల్లంతైన భారతీయులు సహా ఇతర యాత్రికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
- Teachers’ Day 2026 Speech Ideas: నేడు టీచర్స్ డే సందర్భంగా మంచి స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నారా..అయితే చక్కటి స్పీచ్ మీకోసం..
- Teachers Day Wishes On September 5: మీ గురువులు, స్నేహితులకు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా విషెస్ మీ కోసం…
- Happy Teachers Day 2026 Telugu Wishes: మీ బంధుమిత్రులు, స్నేహితులకు టీచర్స్ డే విషెస్ షేర్ చేయండి..
- Happy Teachers Day 2026 Wishes In Telugu: మీ టీచర్లు, స్నేహితులు, బంధు మిత్రులకు Messages, Quotes, Images రూపంలో Whatsapp Status, Facebook కోసం గ్రీటింగ్స్ మీకోసం..
- El Niño 2027 Alert: ప్రపంచానికి పెనుముప్పు తీసుకొస్తున్న చిన్న బాలుడు.. భారీ వర్షాలు, కరువు, తీవ్ర వేడి ముప్పు.. WMO తీవ్ర హెచ్చరిక