ప్రతి బిడ్డకు రూ.55 లక్షలిస్తాం.. దయచేసి పిల్లలను కనండి ప్లీజ్.. Singapore సర్కారు సంచలన ఆఫర్ ప్యాకేజీ..
Singapore (Photo Credit-YEN MENG JIIN, BT)
ఆర్థిక అభివృద్ధి, ఆధునిక జీవనశైలికి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన Singapore ఇప్పుడు జననాల రేటు తగ్గుదలతో తీవ్ర ఆందోళనను ఎదుర్కొంటోంది. దేశంలో సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో 0.87 కి పడిపోవడంతో ప్రభుత్వం భారీ కుటుంబ సంక్షేమ ప్యాకేజీని ప్రకటించింది. యువతను పిల్లలను కనేందుకు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆర్థిక సహాయంతో పాటు గృహ, చైల్డ్‌కేర్, పేరెంటల్ లీవ్ వంటి పలు ప్రయోజనాలను అందించనుంది.
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ జాతీయ దినోత్సవ ర్యాలీలో ఈ ప్యాకేజీని ప్రకటించారు. దీని ప్రకారం దేశంలో పుట్టే ప్రతి బిడ్డకు 17 ఏళ్ల వయసు వరకు వివిధ రూపాల్లో కలిపి దాదాపు 70,000 సింగపూర్ డాలర్ల విలువైన ప్రయోజనాలు అందనున్నాయి. పుట్టిన వెంటనే ప్రభుత్వం 10,000 సింగపూర్ డాలర్ల బేబీ గిఫ్ట్ అందించనుంది. దీనికి అదనంగా ‘ఫస్ట్ స్టెప్’ గ్రాంట్ కింద మరో 5,000 డాలర్లు ఇవ్వనుంది. పిల్లల పెంపకానికి ఉపయోగపడేలా ప్రతి ఏడాది చైల్డ్ క్రెడిట్స్ రూపంలో 2,000 డాలర్లు జమ చేయనుంది. చైల్డ్‌కేర్ కేంద్రాల్లో సబ్సిడీలను పెంచడంతో పాటు తల్లిదండ్రులకు లభించే సెలవులను కూడా విస్తరించనుంది.
కేవలం నగదు ప్రోత్సాహకాలకే ప్రభుత్వం పరిమితం కాలేదు. పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ బిల్డ్-టు-ఆర్డర్ ఇళ్ల కేటాయింపులో అదనపు ప్రాధాన్యం ఇవ్వనుంది. కొన్ని గృహ లాటరీల్లో ప్రతి బిడ్డకు అదనపు అవకాశం కల్పించే విధానాన్ని కూడా తీసుకురానుంది. కుటుంబ, సంతాన ప్రోత్సాహక కార్యక్రమాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయనుంది. ఒకప్పుడు జనాభా పెరుగుదలను అడ్డుకునేందుకు ‘ఇద్దరు చాలు’ అనే విధానాన్ని ప్రోత్సహించిన సింగపూర్.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారడంతో పిల్లలను కనాలని ప్రజలను కోరాల్సిన పరిస్థితికి చేరుకుంది. 1980ల చివరి నుంచి జననాల రేటును పెంచేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు, ప్రసూతి సెలవులు, వివాహ ప్రోత్సాహకాలు వంటి అనేక చర్యలు చేపట్టినా ఆశించిన ఫలితాలు రాలేదు.
అయితే డబ్బు ఇస్తేనే యువత పిల్లలను కంటారా? అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధిక జీవన వ్యయం, పని ఒత్తిడి, ఇళ్ల ధరలు, పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులు, కుటుంబ జీవనశైలిలో వచ్చిన మార్పులు వంటి అంశాలు యువత నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతూ, పనిచేసే వయస్సు జనాభా తగ్గుతున్న నేపథ్యంలో సింగపూర్ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు వివాహం, కుటుంబం, సంతానం పట్ల యువతలో ఉన్న దృక్పథాలను మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
- Dussehra 2026 Wishes in Telugu: దసరా శరన్నవరాత్రులు 3వ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి HD Images శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకు Whatsapp ద్వారా తెలియజేయండిలా..
- Rahul Gandhi: మోదీ, అమిత్ షా, అదానీలే అసలు నేరస్థులు.. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేస్తే క్షమించే అవకాశం ఉంది: రాహుల్ గాంధీ
- Minister Komatireddy Video: ఏపీలో జగన్ ఓటమిపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు… కుట్రతోనే జగన్ ను ఓడించారు..
- Dasara 3rd Day Wishes: దసరా శరన్నవరాత్రులలో మూడవ రోజైన శ్రీ అన్నపూర్ణా దేవి ఆశీస్సులు దక్కాలని కోరుకుంటే విషెస్ మీకోసం…
- AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. 106 మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి వివరాలివిగో..