కృష్ణా జలాలపై సమర్థ వాదన
Krishna River
పలుమార్లు వాయిదా పడిన తరువాత ఎట్టకేలకు కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు( కెఆర్‌ఎంబి) సమావేశం సోమవారం నాడు హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో కెఆర్‌ఎంబి సభ్య కార్యదర్శి ఎదుట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ ఛీఫ్‌ఇలు తమ తమ వాదనలు వినిపించారు. ఎల్ నినో ప్రభావంతో కరువు ఛాయలు అలుముకుంటున్న వేళ ప్రతి చుక్క నీరు ప్రధానమే అయింది. గత మాసం చివర్లో ఎగువ రాష్ట్రాలలో కురిసిన వర్షాలు అడుగంటుకుపోయిన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు ఊరటనిచ్చాయి. కర్నాటకలో ఆలమట్టి, నారాయణపూర్ నిండుకుండలా మారి, కొద్ది కొద్దిగా వదలడంతో తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు పరుగులు తీసాయి. అయినప్పటికీ, ఉభయ రాష్ట్రాలకు ప్రధాన నీటి వనరులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌లు పూర్థి స్థాయి సామర్థ్యాన్ని సంతరించుకోలేదు. ప్రస్తుతం నిలువ ఉన్న నీటిని వచ్చే ఏడాది ఖరీఫ్ వరకు తాగు నీటి అవసరాలకు వాడుకోవాలని సమావేశంలో సూత్రప్రాయంగా ఏకీభావానికి వచ్చారు. అయితే, శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయకపోతుండటంతో ఈ సమస్యంతా వచ్చింది. ఫలితంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని 6.30 లక్షలకు పైగా ఎకరాల స్థిర ఆయకట్టు ఖరీఫ్‌లో నీటి కటకటను ఎదుర్కొంటున్నది. చాలా కాలం తరువాత కాలువ కింద రైతాంగం నీరు రాక బోర్లపై సాగుకు ప్రయత్నాలు చేసుకుంటోంది. ఇప్పటికే పలు చోట్ల నీటిని విడుదల చేయాలంటూ రైతాంగం ఆందోళనకు కూడా దిగింది.
శ్రీశైలం ప్రాజెక్టుల ఉన్న నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సాగు అవసరాలకు సైతం రోజుకు 8వేల క్యూసెక్కుల చొప్పున తరలించికుపోతున్న విషయం ఆ రాష్ట్ర వాదనలలోనే అర్థమవుతున్నది. ఎందుకంటే, ఆ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మొత్తం కృష్ణా జలాల వాటా నుంచి మినహాయించుకోవాలని సమావేశంలో వాదించినట్లు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా 2015లో నీరు లభ్యత ఉన్న దశలో తాత్కాలికంగా అంగీకరించిన 66 : 33 నిష్పత్తిన తమకు నీరు ఇవ్వాలని పట్టుపట్టినట్లూ తెలిసింది. దీనిని తెలంగాణ తరఫున ఇరిగేషన్ ఇంజినీర్‌ల బృందం సమర్థవంతంగా త్రోసి పుచ్చింది. ఉభయ రాష్ట్రాలలో కృష్ణా నది పరీవాహక ప్రాంతం ఆధారంగా తమకు 70 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 30 శాతం నీరు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శ్రీశైలం కుడి కాలువ నుంచి చెన్నై తాగునీటి అవసరాలకు 15 , ఎపికి 17 టిఎంసిల అంగీకృత వాటాను మాత్రమే తీసుకెళ్ళాలని పేర్కొంది. అయినప్పటికీ, కరువు ఛాయలను దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉన్న నీటిని చెరి సగం పంచుకునే విశాల దృక్ఫథంతో సమంజస ప్రతిపాదన చేసింది. ఇందుకు ప్రాతిపదికగా శ్రీశైలం, నాగార్జన సాగర్ జలాశయాల పరిధిలో తెలంగాణలో 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 76 లక్షల మంది ఉన్నట్లుగా ఉటంకించింది. కెఆర్‌ఎంబి సమావేశంలో అంగీకారం కుదరక అక్టోబర్ 4కు భేటీ వాయిదా పడింది.
నిజానికి ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో మొదటి నుంచి ఎక్కువగా లబ్ధి పొందుతున్నది ఆంధ్రప్రదేశేనని లెక్కలు చెబుతున్నవి. ఈ రెండు ప్రాజెక్టులలో ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు, కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీటి సరఫరా జరుగుతున్నది. శ్రీశైలం కుడి కాలువ ఎప్పుడో పూర్తి అయి, కృష్ణా నది బేసిన్‌లో లేని పెన్నా బేసిన్‌లోని ఉమ్మడి నెల్లూరు , అలాగే చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు బాహాటంగా నీటి తరలింపు జరుగుతున్నది. మరోవైపు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం ఇప్పటికీ పూర్తి కాలేదు. అలాగే కృష్ణా నది ప్రవహించే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు వరప్రదాయినీ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు ఆలస్యం అవుతున్నవి. ఒకదశలో పాలమూరు ప్రాజెక్టుకు నీటిని జూరాల నుంచి తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించడం.. ప్రాజెక్టుకు ఆటంకాలు, కేంద్రం అనుమతుల జాప్యానికి అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరాల కారణంగా అనుమతులు ముందుకు పడడం లేదు.ఆంధ్రప్రదేశ్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఫ్లోరైడ్ పీడిత నల్లగొండకు, వలసల పాలమూరుకు దశాబ్దాల అన్యాయం కొనసాగుతోంది. ఎస్‌ఎల్‌బిసి పూర్తయ్యేలోగా, నాగార్జున సాగర్ రిజర్వాయర్ వెనుక నుంచి ఎఎంఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నీరు తోడుకునేందుకు వీలు కల్పించబడింది. అందులో నుంచే హైదరాబాద్ మహానగరానికి సైతం కృష్ణా జలాలు వస్తాయి. ఇప్పుడు శ్రీశైలం నుంచి దిగువకు నీరు వదలకపోతే, హైదరాబాద్ వాసులు నీటి కటకట ఎదుర్కొనే ప్రమాదం నెలకొంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, హ్రస్వదృష్టితో కాకుండా సుహృద్భావంతో ఉభయ రాష్ట్రాల మధ్య కరువు కాలంలో వచ్చే సమావేశంలోనైనా నీటి పంపిణీ ఖరారవ్వాలి. అలాగే భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాకుండా కృష్ణా జలాల్లో నీటి వాటాపై సామరస్య పరిష్కారం ఎంత త్వరగా చేసుకోగలిగితే ఉభయులకూ అంతమంచిది.