Skip to content
తెలంగాణ వార్తలు

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా కాంగ్రెస్ వాలంటీర్స్ కమిటీ షోకాజ్ నోటీసులు

Prajapaksham 25 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా కాంగ్రెస్ వాలంటీర్స్ కమిటీ షోకాజ్ నోటీసులు

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా కాంగ్రెస్ వాలంటీర్స్ కమిటీ షోకాజ్ నోటీసులు

CM Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి బహిరంగంగా మద్దతు ఇవ్వలేదన్న అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చ మొదలైంది. ఈ వ్యవహారంలో నలుగురు సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ వాలంటీర్స్ కమిటీ (AICVC) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వి.డి. సతీషన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిలకు ఈ నోటీసులు జారీ చేసినట్లు AICVC వెల్లడించింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి, ముఖ్యంగా పుణెలో జరిగిన కార్యక్రమానికి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో బహిరంగ మద్దతు ఇవ్వకపోవడాన్ని కమిటీ ప్రశ్నించింది.

AICVC చైర్మన్ రావు సాబ్ అధ్యక్షతన జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నోటీసుల జారీపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా కార్యక్రమానికి మద్దతు ఎందుకు ప్రకటించలేదో నేతలను కమిటీ వివరణ కోరింది. నోటీసుల్లో ప్రధానంగా మూడు అంశాలపై సమాధానం కోరినట్లు తెలుస్తోంది. తమ అధికారిక ఖాతాల నుంచి ఛాత్రోంకి గూంజ్కు మద్దతు ఇచ్చి ఉంటే సంబంధిత లింకులను అందించాలని, మద్దతు ఇవ్వకపోతే అందుకు కారణాలను వివరించాలని, ఇకపై చేపట్టబోయే చర్యలను కూడా తెలియజేయాలని కమిటీ కోరింది. ఇందుకు 72 గంటల గడువు విధించింది.

ఈ వ్యవహారం నలుగురు నేతలకే పరిమితం కాకపోవచ్చనే సంకేతాలను AICVC ఇచ్చింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుల సోషల్ మీడియా, బహిరంగ ప్రచారంలో ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి వారు ఇచ్చిన మద్దతును కూడా సమీక్షిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. కార్యక్రమాన్ని ప్రచారం చేయని ఇతర CWC సభ్యులపైనా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కమిటీ తెలిపింది.

విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించడంతో పాటు విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం సూచనలు సేకరించే లక్ష్యంతో ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టింది. రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులతో సమావేశమవుతున్నారు. పుణెలో ఆగస్టు 22న జరిగిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రకారం, ఈ కార్యక్రమానికి 30 వేలకు పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేత నిర్వహిస్తున్న కీలక ప్రచార కార్యక్రమానికి సీనియర్ నేతలు సోషల్ మీడియా ద్వారా మద్దతు ఇవ్వకపోవడంపై AICVC నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్‌లు: CM Revanth Reddy Telangana