Skip to content
బిజినెస్ వార్తలు

Bank Strike Alert: సెప్టెంబర్ 11న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె … వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం డిమాండ్

Krishna Rao 25 Aug 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Bank Strike Alert: సెప్టెంబర్ 11న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె … వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం డిమాండ్

bank-strike

Bank Strike Alert: బ్యాంకింగ్ వ్యవస్థలో సమ్మె సైరన్ మోగనుంది. వారానికి ఐదు రోజుల పని విధానం అమలులో జాప్యం, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (పిఎస్‌ఐ)పై భిన్నాభిప్రాయాలు, పెన్షన్‌తో సహా అనేక పెండింగ్ డిమాండ్ల నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు దిగాలని ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ (యుఎఫ్‌బియు) నిర్ణయించింది. ఈ సమ్మె జరిగితే, దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, నాలుగు రోజుల పాటు ప్రభావితం కానున్నాయి. సెప్టెంబర్ 11 శుక్రవారం కాగా, ఆ తర్వాతి రెండు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు. ఇక గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 14న సెలవు ఉంటుంది.

తొమ్మిది బ్యాంక్ ఉద్యోగులు, అధికారుల సంఘాల సమాఖ్య అయిన యుఎఫ్‌బియు, సెప్టెంబర్ 28 నుండి మూడు రోజుల పాటు మరో దేశవ్యాప్త సమ్మెకు కూడా పిలుపునిచ్చింది. సెప్టెంబరు 30తో ఆర్థిక సంవత్సరం సగం పూర్తవుతుంది. అప్పుడు అన్ని సంస్థలు తమ ఖాతా పుస్తకాలను సరిచూసుకుంటాయి. కాగా, ప్రభుత్వం, బ్యాంక్ యాజమాన్యం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే, అక్టోబర్ 26 నుండి నిరవధిక సమ్మెకు వెళ్లాలని కూడా వారు నిర్ణయించారు. తమ ప్రధాన డిమాండ్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతికూల వైఖరికి నిరసనగా ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఎఫ్‌బియు ఒక ప్రకటనలో తెలిపింది.

వారానికి ఐదు రోజుల పని విధానం విషయానికి వస్తే, మార్చి 8, 2024న కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందం లేదా 9వ ఉమ్మడి ఒప్పందంలో భాగంగా ‘ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్’ (ఐబిఎ) ఈ ప్రతిపాదనకు అంగీకరించిందని, దీని ప్రకారం సోమవారం నుండి శుక్రవారం వరకు పని వేళలు 40 నిమిషాలు పెరుగుతాయని యూనియన్లు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ, అది రెండేళ్లకు పైగా పెండింగ్‌లోనే ఉందని వారు తెలిపారు.

స్కేల్–4, అంతకంటే పై స్థాయి అధికారుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎస్‌ఐ పథకాన్ని కూడా యూనియన్లు వ్యతిరేకించాయి. పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని వ్యక్తిగత బ్యాంకుల మొత్తం పనితీరుతో అనుసంధానించాలని, స్కేల్–7 వరకు ఉన్న ఉద్యోగులు, అధికారులకు ఇది సమానంగా ఉండాలని ఐబిఎతో కుదిరిన ఒప్పందానికి ఇది భిన్నంగా ఉందని వారు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు: Bank Strike Dates 2026