Konda Surekha issue: మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే పలువురు అధికారుల డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు..
Konda Surekha
Konda Surekha issue: మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే పలువురు అధికారుల డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు..అటవీ శాఖలో డిప్యూటేషన్ అధికారుల బదిలీ?…మంత్రికి కొండా సురేఖకు తెలియకుండానే ప్రభుత్వ నిర్ణయాలు
Konda Surekha issue: తెలంగాణ అటవీ శాఖలో డిప్యూటేషన్‌పై వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసినట్లు తెలిసింది. అయితే ఈ శాఖ మంత్రిగా కొండా సురేఖ పనిచేయడం, ఇటీవల ఆమె కూతురు సుష్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై పలు ఆరోపణలు చేయడంతో అధికారుల బదిలీలపై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి సురేఖ శాఖకు సంబంధించి ఇటీవల చేపట్టిన అధికారుల డిప్యూటేషన్లను ప్రభుత్వం రద్దు చేయడం, మంత్రికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో అటవీ శాఖలో పలువురు అధికారులను వివిధ స్థానాలకు డిప్యూటేషన్‌పై పంపించారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో ఈ డిప్యూటేషన్లు అన్నింటినీ ఉన్నపళంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సాధారణంగా మంత్రి ఆమోదం లేదా వారి దృష్టికి తీసుకెళ్లాకే నిర్ణయాలు జరుగుతుంటాయి. కానీ, సురేఖకు చెప్పకుండానే శాఖలో ఈ మార్పులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇలాంటి బదిలీలు ప్రతి శాఖలో సాధారణంగానే జరుగుతుంటాయని ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీ లేదని అటవీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
కొండాపై నిర్ణయం హై కమాండ్ చేతిలో ఉంది…
కొండా సురేఖ ఉదంతం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలను రాజేసింది. సొంత ప్రభుత్వంలోని అసమ్మతిని ఎంతవరకు అదుపు చేయగలదనే పార్టీ సామర్థ్యానికి పరీక్షగా నిలిచింది. పార్టీ క్రమశిక్షణా యంత్రాంగం ఈ విషయాన్ని పరిశీలిస్తుండగా, తదుపరి చర్య కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉన్నట్లు కనిపిస్తోంది.
పరకాల నియోజకవర్గం నుంచి జరగబోయే తదుపరి ఎన్నికలకు సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి బహిరంగంగా మద్దతు ప్రకటించడమే ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా చెప్పవచ్చు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ఈ నియోజక వర్గం నుంచి భవిష్యత్ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో సీఎం చేసిన ప్రకటన కొండా వర్గానికి ఈ ప్రకటన తీవ్ర ఆగ్రహం తెప్పించిందని చెప్పవచ్చు.
ఆ తర్వాత సుష్మిత సీఎం రేవంత్ ను ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సూచించారు. బీసీలపై మీ పెత్తనం ఏంటని దీనికి కులాల కలరింగ్ కూడా ఇవ్వడం చూడవచ్చు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీలో ఈ వివాదం పెనుముప్పుగా మారిపోయిది.
తన కుమార్తెకు చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ కాంగ్రెస్ కొండా సురేఖకు నోటీసు జారీ చేస్తే…అందుకు మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ… సుష్మిత అభిప్రాయాలు వ్యక్తిగతమైనవని, కేవలం ఆమె తల్లి అయినంత మాత్రాన వాటికి తనను రాజకీయంగా బాధ్యురాలిగా చేయలేరని ఆమె వాదిస్తున్నారు. అయితే ఈ అంశంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ముఖ్యమంత్రి అధికారాన్ని బహిరంగంగా సవాలు చేయడం పార్టీ క్రమశిక్షణకు హానికరమని పార్టీలోని ఒక వర్గం భావిస్తోంది. కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం ఈ విషయంపై ఎక్కువగా స్పందించడం లేదు.